తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించి, ఎందరో ప్రతిభావంతులైన నటీనటులను పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు తేజ. మూవీ మొఘల్ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిని తేజ ‘అహింస’ సినిమాతో హీరోగా లాంచ్ చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా పలు హర్డిల్స్ ను ఎదుర్కొన్న ‘అహింస’ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశామని చిత్ర బృందం మంగళవారం తెలిపింది. ఈ విషయాన్ని టీమ్ అంతా ఉన్న ఓ ఫోటోతో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సో…. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నూ మొదలు పెట్టబోతున్నారు.
ఆర్.పి. పట్నాయక్ ను సంగీత దర్శకుడిగా తేజ పరిచయం చేశారు. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తరువాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి ‘అహింస’ చిత్రానికి పనిచేస్తున్నారు. చంద్రబోస్ ఇందులోని పాటలన్నింటిని రాయగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. రియల్ సతీష్ ఫైట్స్ కంపోజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
