ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ విశేషాదరణ పొందుతోంది. ఇండియాలోనే నంబర్‌వన్ టాక్ షోగా బాలయ్య షో పేరు తెచ్చుకుంది. ఇప్పటికే 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. త్వరలో పదో ఎపిసోడ్ రానుంది. మహేష్‌బాబు ఎపిసోడ్‌తో ఈ సీజన్ పూర్తి కానుంది. ఇప్పటివరకు మోహన్‌బాబు-మంచు విష్ణు-మంచు లక్ష్మీ, అల్లు అర్జున్-సుకుమార్-రష్మిక, రాజమౌళి, రానా, నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను-శ్రీకాంత్, రవితేజ-గోపీచంద్ మలినేని, విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్-ఛార్మి వంటి ప్రముఖలను బాలయ్య ఇంటర్వ్యూలు చేశాడు. హోస్టుగా బాలయ్యను ఈ యాంగిల్‌లో చూసి అభిమానులే మెస్మరైజ్ అవుతున్నారు. బాలయ్య మీద రోజురోజుకు ప్రేమ పెంచుకుంటున్నారు.
తాజాగా ఆహా మరో వీడియో విడుదల చేసింది. బాలయ్య మంగళవారం మెనూ పేరుతో ఓ వీడియోను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో చాలాకాలంగా తన దగ్గర పని చేస్తున్న వంట మనిషితో బాలయ్య ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం స్పెషల్‌గా బంగాళదుంప, వాముతో చారు, క్యాలీ ఫ్లవర్, దొండకాయ ఫ్రై లాంటివి తనదైన స్టైలులో ఆర్డర్ చెప్పి ఎలా వండాలో బాలయ్య సలహాలివ్వడం ఈ వీడియోలో చూడొచ్చు. బుధవారం మెనూ కూడా బాలయ్య ఈ వీడియోలో చెప్పేశారు. ఊతప్పం, జీడిపప్పు ఉప్మా, కొబ్బరిచట్నీ లాంటి టిఫిన్ చేయాలని ఆర్డర్ వేసేశారు. ఒక పక్క ఎమ్మెల్యేగా, మరోవైపు సినిమాలలో నటిస్తూ తీరిక లేకుండా ఉంటున్న తనకు తన కుక్ మంచిగా వండిపెడతాడని బాలయ్య ప్రశంసలు కురిపించారు.
