Adipurush First Look Poster Released: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. దర్శకుడు ఓమ్ రౌత్ ఇంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం.. శుక్రవారం ఉదయం 7:11 గంటలకు ఈ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశాడు. ఇందులో రాముని అవతారంలో కనిపించిన ప్రభాస్.. ధనస్సు చేత పట్టి, బాణాన్ని గురి పెట్టడాన్ని మనం చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రళయంలా ఉప్పొంగుతోన్న సముద్రపు అలలు, ఎర్రబడిన మేఘాల మధ్య నుంచి మెరుస్తోన్న మెరుపులతో కూడిన ఈ పోస్టర్ చూస్తే.. ఫ్యాన్స్ బాడీలో వెయ్యి ఓల్టుల కరెంట్ ఒక్కసారిగా పాస్ అయినట్టు నరాలు జివ్వుమనడం ఖాయం. ఇన్నాళ్లు ఫ్యాన్స్ చేసిన నిరీక్షణకు మంచి ఫలితమే దక్కిందని, ఈ పోస్టర్ చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇదే సమయంలో ఆదిపురుష్ టీజర్‌ను అయోధ్యలోని సరయు నది తీరాన సాయంత్రం 7:11 గంటలకు విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు ఓమ్ రౌత్ మరోసారి స్పష్టం చేశాడు. తమ సినిమాను ఐమ్యాక్స్ & 3డీ ఫార్మాట్‌లో జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు. కాగా.. రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కుతుండడంతో ఈ ఆదిపురుష్ సినిమాపై తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ ఆధునిక యుగానికి తగినట్టు మెరుగులు దిద్ది, సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నామని దర్శకుడు ఇదివరకే వెల్లడించాడు. ఇందులో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీఎత్తున విడుదల చేయబోతున్నారు.
https://twitter.com/omraut/status/1575662106833481729?s=20&t=EBo8w45c7rKBiJy0c7DTng
