Sydney Sweeney: హాలీవుడ్ స్టార్ నటి సిడ్నీ స్వీనీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి విషయం సినిమా కాదు.. ఓ స్పోర్ట్స్ యాడ్. స్పోర్ట్స్ ప్రిడిక్షన్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నోవిగ్ కోసం ఆమె చేసిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ యాడ్‌లో సిడ్నీ దాదాపు నగ్నంగా కనిపిస్తూ క్రీడా పరికరాలతో తన శరీరాన్ని కప్పుకోవడం చాలామందికి నచ్చలేదు. మహిళా క్రీడాకారులు అయితే ఈ ప్రచారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ విమర్శలకు సిడ్నీ నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది.
నోవిగ్ కోసం రూపొందించిన ఈ యాడ్‌లో సిడ్నీ టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ వంటి క్రీడలకు సంబంధించిన పరికరాలతో కనిపించారు. నోవిగ్ కేవలం స్పోర్ట్స్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ మార్కెట్ అని చెప్పడమే ఈ యాడ్ ఉద్దేశ్యంగా కంపెనీ వివరించింది. సిడ్నీ కూడా ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభం నుంచే క్రియేటివ్‌గా దగ్గరుండి రూపొందించినట్లు చెప్పింది. క్రీడలపై ఫోకస్ పెట్టడంతో పాటు హ్యూమర్, కాన్ఫిడెన్స్, ప్లేఫుల్‌నెస్‌తో ప్రచారాన్ని రూపొందించాలనుకున్నామని ఆమె గతంలో వివరించారు.
అయితే యాడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు అసలు ఈ ప్రకటన ఏం ప్రమోట్ చేస్తుందో అర్థం కావడం లేదని ప్రశ్నించగా, మరికొందరు మహిళలను ఇలా నగ్నంగా చూపించడం సరికాదని మండిపడ్డారు. ఈ యాడ్ క్రీడలపై కంటే, మహిళల శరీరాలపై ఫోకస్ పెడుతోందని విమర్శలు వచ్చాయి. ఇక ఈ విమర్శలు క్రీడా ప్రపంచం నుంచి కూడా వచ్చాయి. నాలుగుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఆస్ట్రేలియా మాజీ స్విమ్మర్ అరియార్న్ టిట్మస్ తీవ్రంగా స్పందించారు.
అయితే ఈ మొత్తం వివాదంపై సిడ్నీ స్వీనీ నేరుగా స్పందించలేదు. బదులుగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో గతంలో స్పోర్ట్స్‌కు సంబంధించిన ఫొటోషూట్లలో నగ్నంగా కనిపించిన ప్రముఖ అథ్లెట్ల ఫొటోలను వరుసగా షేర్ చేశారు. అందులో టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, యూఎఫ్‌సీ ఫైటర్ రోండా రౌసీ, బాస్కెట్‌బాల్ స్టార్ మేగన్ రాపినో, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ రాబ్ గ్రోంకోవ్స్కీ తదితరులు ఉన్నారు. ఈ ఫొటోలు ESPN బాడీ ఇష్యూ వంటి ప్రాజెక్టులకు సంబంధించినవిగా గుర్తించారు. అంటే తనపై మాత్రమే ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయనే ప్రశ్నను పరోక్షంగా లేవనెత్తినట్టుగా ఆమె సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాదం సిడ్నీ స్వీనీకి కొత్తేమీ కాదు. గత ఏడాది అమెరికన్ ఈగిల్ కోసం చేసిన యాడ్ కూడా భారీ చర్చకు దారితీసింది. ఇప్పుడు మరో బ్రాండ్ క్యాంపెయిన్‌పై విమర్శలు రావడంతో ఈ హాలీవుడ్ స్టార్ నటి మరో సారి వార్తల్లో నిలిచింది.

