Sobhita Dhulipala: సినీ తారలు రాజకీయాలపై మాట్లాడటం చాలా అరుదు. ముఖ్యంగా తమలోని రాజకీయ భావాలను బహిరంగంగా చెప్పేందుకు చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ మాత్రం ఈసారి ఎలాంటి సందేహం లేకుండా తన రాజకీయ భావజాలాన్ని వెల్లడించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి చాలా మందికి తెలియని విషయం చెప్పాలని శోభితను అడిగారు. దానికి స్పందించిన ఆమె, తనకు చాలా బలమైన రాజకీయ భావాలు ఉన్నాయని వెల్లడించారు. తాను వామపక్ష భావజాలం కలిగిన ఉదారవాదినని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఏదో ఒక రోజు కమ్యూనిజం విజయం సాధిస్తుందని తాను నమ్ముతున్నానంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆమె మాట్లాడిన మాటలు మాత్రం క్షణాల్లో వైరల్ అయ్యాయి.
శోభిత వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె తన రాజకీయ విశ్వాసాలను ఎలాంటి భయం లేకుండా బహిరంగంగా చెప్పడాన్ని అభినందించారు. సెలెబ్రిటిగా ఉన్నప్పటికీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిన ఆమె ధైర్యమని ప్రశంసించారు. అయితే మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను ప్రశ్నించారు. ముఖ్యంగా నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో, ఆమె రాజకీయ వ్యాఖ్యలపై కొందరు విమర్శలు గుప్పించారు. సంపన్న సినీ కుటుంబంలో సభ్యురాలిగా ఉన్న వ్యక్తి కమ్యూనిజం గురించి మాట్లాడటం విరుద్ధంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ధూళిపాళ ప్రస్తుతం తన కెరీర్‌లో కూడా బిజీగా కొనసాగుతున్నారు. దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ మూవీ ‘వెట్టువం’లో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు. పోస్ట్ అపోకలిప్టిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని తన కెరీర్‌లో అత్యంత బెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా శోభిత ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఏడాది విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. హీరో ఆర్య, దినేష్ రవి ప్రధాన పాత్రల్లో హై-యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శోభిత అత్యంత పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే శోభితా ధూళిపాళ నటించిన తాజా చిత్రం ‘క్రాస్ రోడ్స్’ 2026, జూన్ 5న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోగా, ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియో ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ డ్రామా చిత్రంలో విక్రాంత్ మాస్సేతో కలిసి ఆమె ప్రధాన పాత్ర పోషించారు. దీనితో పాటు హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ దర్శకత్వంలో శోభిత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్’ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకోగా, ప్రస్తుతం ఆమె నటిస్తున్న పీరియాడిక్ రూరల్ డ్రామా చిత్రం ‘సిల్ బట్టా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ 2027 ప్రారంభంలో విడుదలకు సిద్ధమవుతోంది.

