Hema: హేమకు క్లీన్ చీట్.. చనిపోవాలి అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్!

Hema

Hema

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అందరికీ సుపరిచితురాలైన నటి హేమ గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న డ్రగ్స్ కేసు వివాదంపై తొలిసారిగా బహిరంగంగా స్పందించారు, ఇటీవల నటి హేమకు క్లీన్ చీట్ వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆమె తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు తనను ఎంతలా కుంగదీశాయో చెబుతూ హేమ కన్నీటి పర్యంతమయ్యారు. “ఒకానొక దశలో భరించలేక చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నాను. అంతలా మానసిక వేదనను అనుభవించాను” అని ఆమె పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని గట్టిగా నమ్మానని, అందుకే న్యాయపోరాటం చేసి చివరికి కోర్టులో నిర్దోషిగా బయటపడ్డానని ఆమె స్పష్టం చేశారు.

Also Read:Sampradayini Suppini Suddapusani: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న బిగ్ బాస్ శివాజీ కొత్త సినిమా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తనపై బురదజల్లాయని హేమ ఆరోపించారు, ఈ తప్పుడు వార్తల వల్ల తన వ్యక్తిగత జీవితమే కాకుండా, తన కుటుంబ సభ్యులు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని, వారు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నిజాయితీగా ఉండే మీడియా తన పక్షాన నిలుస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇక నటిగా దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకులను అలరించిన హేమ, ఈ వివాదం నుండి బయటపడి మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. తనపై నమ్మకం ఉంచిన వారికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని ఆమె ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.