NTV Telugu Site icon

Actress Ashita: అందుకు ఒప్పుకోలేదని.. ఇండస్ట్రీ నుంచి తరిమేశారు

Ashita Metoo Allegations

Ashita Metoo Allegations

Actress Ashita Makes Metoo Allegations On Kannada Film Industry: సినీ పరిశ్రమలో అమ్మాయిల ప్రస్థానం అంత సజావుగా సాగదు. ఎన్నో ఒడిదుడుకుల్ని, కష్టనష్టాల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా.. కాస్టింగ్ కౌచ్! ఎప్పట్నుంచో ఇండస్ట్రీని పెనుభూతంలా అంటిపెట్టుకొని ఉన్న ఈ కాస్టింగ్ కౌచ్.. ఎందరో అమ్మాయిల కలల్ని నాశనం చేసింది. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలన్న ఆశల్ని నీరుగార్చేసింది. ఈమధ్య కాలంలో మీటూ ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చినప్పుడు.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్య దాదాపు అంతమైందని అంతా అనుకున్నారు. కానీ, అది ఇప్పటికీ ఉందని కన్నడ నటి అశిత కుండబద్దలు కొట్టింది. దాని వల్లే తన కెరీర్ నాశనమైందని బాంబ్ పేల్చింది.

ఇటీవల కన్నడ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మీటూ ఆరోపణలు వచ్చాక పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య తగ్గిందని అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎందరో పెద్దలు చక్రం తిప్పుతున్నారని, వారు చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని షాకిచ్చింది. ఒకవేళ వాళ్లు చెప్పినట్టు పడక సుఖం ఇవ్వకపోతే, సినిమా అవకాశాలు రాకుండా నరకం చూపిస్తారని పేర్కొంది. తన కెరీర్ కూడా అలాగే నాశనం అయ్యిందని ఈ అమ్మడు వాపోయింది. తనని చాలామంది పడక సుఖం ఇవ్వాల్సిందిగా కోరారని, కానీ అందుకు తాను ఒప్పుకోలేదని, తాను టాలెంట్‌ని నమ్ముకొని వచ్చానని, ఆ టాలెంట్‌తోనే తన ప్రస్థానం కొనసాగిస్తానని తెగేసి వాళ్లకు చెప్పానని చెప్పింది.

అయితే.. ఇండస్ట్రీలో వాళ్ల రాజ్యమే నడుస్తున్న కారణంగా తనకు అవకాశాలు రాలేదని అశిత ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రతీ చోటా కాస్టింగ్ కౌచ్ అవాంతరాలే ఎదురయ్యాయని చెప్పింది. తాను అందుకు సహకరించకపోవడం వల్ల, శాండిల్‌వుడ్‌కి దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. బహుశా తాను సహకరించి ఉండుంటే, తనకు సినిమా అవకాశాలు వచ్చి ఉండేవని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాకపోతే, తనని ఎవరు వేధించారన్న వ్యక్తుల పేర్లు మాత్రం అశిత బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు కన్నడ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.