NTV Telugu Site icon

Amani: ఒంటరిగా రా.. అవకాశాలు ఇస్తాం అన్నారు

Amani

Amani

Amani: తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. ఆమనీ. ఆమె నటిస్తే జీవించినట్లే ఉంటుంది. పక్కింటి అమ్మాయిగా.. గయ్యాళి కోడలిగా.. అనుమానపు భార్యగా నటించడం అంటే ఆమె తరువాతనే ఎవరైనా. శుభలగ్నం, శుభ సంకల్పం, మావి చిగురు వంటి సినిమాల్లో ఆమె నటనను మర్చిపోవడం ఎవరి వలన కాదు. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమని.. ఇప్పుడు రీ ఎంట్రీలో కూడా దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా, పిన్నిగా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే వినరో భాగ్యం విష్ణు కథ సినిమాలో నటించి మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇక ఇప్పుడంటే పర్లేదు కానీ ఆమె కెరీర్ మొదట్లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడిందట.. ఎన్నో అవమానాలు ఎదురుకున్నట్లు ఒక తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పట్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ లు ఉండేవని చెప్పుకొచ్చింది.

Mrs. Chatterjee Vs Norway: కన్న బిడ్డల కోసం కర్కశమైన దేశంలో ఒక తల్లి పోరాటం

“కెరీర్ మొదట్లో నేను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. అవకాశాల కోసం ఎన్నో ఆఫీస్ ల మెట్లు ఎక్కి దిగాను. అక్కడ రకరకాల పరిస్థితులను చూసాను. నేను ఎక్కడికి వెళ్లినా మా అమ్మ నాతోనే ఉండేవారు. నేను లోపలికి వెళితే.. బయట మా అమ్మ వెయిట్ చేస్తూ ఉండేది. అలా మా అమ్మ నా వెంట రావడం చాలామందికి నచ్చేది కాదు. మీ అమ్మ లేకుండా ఒంటరిగా రా.. అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని అనేవారు. నేను ఏమైనా తక్కువ తిన్నానా.. వారికి గట్టిగానే సమాధానం చెప్పేదాన్ని.. మా అమ్మలేకుండా నేను ఎక్కడికి రాను అని నిర్మొహమాటంగా చెప్పాను. అప్పుడే మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ఆయన మొదటి నుంచి సినిమాల వైపుకు వెళ్లొద్దని చెప్పేవారు. అప్పట్లో వారు ఏ ఉద్దేశ్యంతో ఆ మాటలు అనేవారో అర్ధమయ్యేది కాదు. ఆ తరువాత నెమ్మది నెమ్మది గా అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాను. మొదట్లో చెల్లి పాత్రలు వచ్చాయి. అయితే ఒకసారి అలాంటి పాత్రలు చేస్తే తరువాత కూడా అవే వస్తాయని నో చెప్పాను. అలా రెండేళ్లు కష్టపడ్డాకా హీరోయిన్ గా అవకాశం వచ్చింది” అని చెప్పుకొచ్చింది.