Amani: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితోను నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు. ఇక ఆమని బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య అన్న విషయం చాలామందికి తెలుసు.. ఎన్నో సినిమాలు వీరిద్దరూ కలిసి నటించారు. ఇక సౌందర్య చనిపోయినప్పుడు ఆమని గుండె ముక్కలయింది. ఆమె లేనిలోటును ఎవరు తీర్చలేనిదని, ఆమె స్థానంలో ఎవరు రాలేరని ఆమని చెప్తూ ఉండేది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమని, సౌందర్యపై ఉన్న ప్రేమను బయటపెట్టింది. ఆమె మృతిచెందినప్పుడు తన మెంటల్ స్టేటస్ ఎలా ఉందో చెప్పుకొచ్చింది.
“సౌందర్య చనిపోయింది అని విన్నప్పుడు నాకేమి తెలియలేదు.. దేవుడును తిట్టుకున్నాను ఆమె స్థానంలో నేను చనిపోయినా బావుండేది. దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్ అని తిట్టుకున్నాను. ఆ సమయానికి పెళ్ళై నాకు ఏడాది. పిల్లలు లేరు.. జీవితం మొత్తం చూసేశాను.. నేను చచ్చిపోయినా బాధ ఉండేది కాదు అనే మైండ్ లో ఉన్నాను. ఆ తరువాత సౌందర్య అమ్మగారిని వెళ్లి కలిశాను.. పత్రికల్లో వచ్చినట్లు సౌందర్య చనిపోయేటప్పుడు గర్భవతి కాదు.. ఇక సౌందర్య పెళ్ళికి ముందే నాకు, ఆమె అన్నయ్య అమర్ ను పెళ్లి చేసుకోవాల్సింది. సౌందర్య తల్లి నన్ను అమర్ ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఆ సమయంలో నాకు కెరీర్ మీద తప్ప పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పాను. ఒకవేళ అమర్ ను నేను పెళ్లి చేసుకొని ఉంటే.. ఎలాగూ సౌందర్య కూడా వెళ్తోందిగా నేను వస్తాను అని ఫ్లైట్ ఎక్కేదాన్ని.. లేదా.. భర్త, బెస్ట్ ఫ్రెండ్ చనిపోయారు అని వారి జ్ఞాపకాల్లో ఇప్పటికి ఏడుస్తూ ఉండేదాన్ని. అంతా విధి.. ఎవరికి రాసిపెట్టి ఉన్నది వారికి జరుగుతుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
