చూడగానే బాగా పరిచయం ఉన్న మనిషి అనిపిస్తాడు. అతనిలోని ప్రతిభ సైతం అదే తీరున ఆకట్టుకుంటూ ఉంటుంది. కేవలం నటనతోనే కాకుండా, దర్శకునిగా, రచయితగా తనదైన బాణీ పలికిస్తున్నారు శ్రీనివాస్ అవసరాల. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ తాజా చిత్రం ఇటీవలే విడుదలై అలరిస్తోంది. అందులో నటునిగానూ శ్రీనివాస్ ఆకట్టుకున్నారు. మునుముందు కూడా నటన, దర్శకత్వంతో అలరించే ప్రయత్నాల్లోనే శ్రీనివాస్ అవసరాల సాగుతున్నారు.
శ్రీనివాస్ అవసరాల 1984 మార్చి 19న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగి. దాంతో కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో ఆయన ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఈ నాలుగు పట్టణాల్లో శ్రీనివాస్ చదువు సాగింది. విజయవాడ కె.ఎల్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు శ్రీనివాస్. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటాలో ఎమ్మెస్ చేశారు. ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబోరేటరీలో కొంతకాలం పనిచేశారు శ్రీనివాస్. కాలిఫోర్నియా యూనివర్సిటీలో స్క్రీన్ రైటింగ్ లో డిప్లొమా చదివారు. అలాగే లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో యాక్టింగ్ లో డిప్లొమా సాధించారు శ్రీనివాస్. అక్కడే ‘బ్లైండ్ యాంబిషన్’ అనే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. స్వదేశం వచ్చాక ఈటీవీలో ‘ఛాంపియన్’ క్విజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ సీజన్ నిర్వహించారు. తరువాత మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘అష్టాచెమ్మా’తో నటునిగా పరిచయం అయ్యారు. ఇదే సినిమాతోనే నాని కూడా పరిచయం కావడం విశేషం! అలా నాని, శ్రీనివాస్ మధ్య స్నేహబంధం నెలకొని తరువాత “పిల్లజమీందార్, ఎవడే సుబ్రహ్మణ్యం, జెంటిల్మేన్” వంటి చిత్రాల్లో కలసి నటించారు. నాని సొంత చిత్రం ‘ఆ!’లోనూ శ్రీనివాస్ కీలకమైన పాత్రలో కనిపించారు. “ఆరెంజ్, గోవిందుడు అందరివాడేలే, జిల్, బందిపోటు, కంచె, నాన్నకు ప్రేమతో, అ ఆ, అమీ తుమీ, మేడమీద అబ్బాయి, పీఎస్వీ గరుడవేగ, మహానటి, యన్టీఆర్-కథానాయకుడు, నూటొక్క జిల్లాల అందగాడు” వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు శ్రీనివాస్.
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల, తరువాత “జ్యో అచ్చుతానంద, ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి” చిత్రాలనూ తెరకెక్కించారు. ఆయన రచనతో “గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్చుతానంద, నూటొక్క జిల్లాల అందగాడు, ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి” వంటి చిత్రాలు వెలుగు చూశాయి. “బ్రహ్మాస్త్ర, అవతార్: ద వే ఆఫ్ వాటర్” వంటి అనువాద చిత్రాలకూ తెలుగులో రచన చేశారు. ‘జ్యో అచ్చుతానంద’తో బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డుకు ఎంపికయ్యారు శ్రీనివాస్. ఈ బర్త్ డే తరువాత ఆయన మరిన్ని చిత్రాలలో అలరిస్తారని ఆశిద్దాం.