NTV Telugu Site icon

Subbaraju: సుబ్బరాజు… తరగని తపన!

Subbaraju Birthday

Subbaraju Birthday

Subbaraju: తనదైన అభినయంతో జనాన్ని ఆకట్టుకుంటున్న సుబ్బరాజు పాదం బంగారం అంటూ ఉంటారు సినీజనం. పరికించి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. టాలీవుడ్ లో టాపు లేపిన బ్లాక్ బస్టర్స్ లో సుబ్బరాజు నటించారు. మహేశ్ బాబు ‘పోకిరి’ చెరిగిపోని చరిత్ర సృష్టించింది. ఇక రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ రికార్డుల గురించి చెప్పక్కర్లేదు. మళ్ళీ టాలీవుడ్ కు ఓ ఊపు తీసుకు వచ్చిన చిత్రంగా బాలకృష్ణ ‘అఖండ’ నిలచింది. ఈ యేడాది సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ జేజేలు అందుకుంది. ఈ చిత్రాలన్నిటా సుబ్బరాజు నటించారు. ఈ కోణంలోనే ఆయన సన్నిహితులు ‘మా వాడు గోల్డెన్ లెగ్’ అంటూ ఉంటారు. అయితే సుబ్బరాజు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. తనకు లభించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలని, వైవిధ్యం ప్రదర్శించాలనీ తపిస్తూ ఉంటారు. ఏ తరహా పాత్రనైనా పోషించి మెప్పించాలన్నదే సుబ్బరాజు తాపత్రయం!

సుబ్బరాజు 1977 ఫిబ్రవరి 27న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. సుబ్బరాజు మేథ్స్ లో డిగ్రీ పట్టా పొంది కంప్యూటర్ కోర్సు చేశాక, హైదరాబాద్ ‘డెల్’ కంప్యూటర్స్ లో కొంతకాలం పనిచేశారు. సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ‘డెల్’లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు వద్దకు వచ్చి, తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడయిందని, బాగు చేయమని కోరాడు. అలా కృష్ణవంశీ ఆఫీసుకు వెళ్ళిన సుబ్బరాజుకు అనుకోకుండా ‘ఖడ్గం’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం లభించింది. ఆ సినిమా తరువాత పూరి జగన్నాథ్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలపడే ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. వరుసగా “శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ” చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తరువాత పలు అవకాశాలు సుబ్బరాజును పలకరించాయి. పూరి జగన్నాథ్ తరువాత హీరో రవితేజ కూడా సుబ్బరాజును బాగా ప్రోత్సహించారు. తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ సుబ్బరాజు నటించి అలరించారు. రాబోయే చిత్రాల్లోనూ విలక్షణమైన పాత్రల్లో కనిపించనున్నారు సుబ్బరాజు.