NTV Telugu Site icon

రమణారెడ్డి శతజయంతి పూర్తి! (1921-2021)

(అక్టోబర్ 1న రమణారెడ్డి శతజయంతి)

కట్టెపుల్లకు బట్టలు తొడిగినట్టుగా ఉండే రూపంతో చూడగానే ఇట్టే నవ్వులు పూయించేవారు రమణారెడ్డి. క్షణాల్లో ముఖంలో అనేక భావాలు పలికించి రమణారెడ్డి నవ్వించిన తీరును తెలుగువారు మరచిపోలేరు. రమణారెడ్డి నటించిన చిత్రాలు ఇప్పటికీ బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉంటాయి. ఆయన నటన చూసి నవతరం ప్రేక్షకులు సైతం పడి పడి నవ్వుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అదీ రమణారెడ్డి నవ్వుల మహాత్యం అనిపిస్తుంది.

రమణారెడ్డి పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి. 1921 అక్టోబర్ 1న నెల్లూరు జిల్లా జగదేవి పేటలో జన్మించారాయన. చదువుకొనే రోజుల్లోనే రమణారెడ్డి చిత్రవిచిత్రాలు చేసేవారు. తమ ఊరికి వచ్చిన గారడీవారి వద్ద మ్యాజిక్ నేర్చారు. దాంతో చుట్టూ ఉన్నవారిని ఇట్టే ఆకట్టుకొనేవారు. రమణారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉండేది. నెల్లూరులో కొద్ది రోజులు శానిటరీ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. నాటకాల్లో పలు వేషాలు కట్టి మురిపిస్తూ ఉండగా, మిత్రుడు ఎ.శంకర రెడ్డి ప్రోత్సాహంతో చిత్రసీమవైపు పయనించారు రమణారెడ్డి. తెలుగు చలనచిత్ర పితామహునిగా పేరొందిన రఘుపతి వెంకయ్య తనయుడు రఘుపతి సూర్యప్రకాశ్ తెరకెక్కించిన ‘మాయపిల్ల’ అనే జానపదంలో హాస్య పాత్ర పోషించారు. సినిమా సరిగా ఆడకపోవడంతో రమణారెడ్డి నవ్వులు కూడా అంతగా పేరు సంపాదించలేకపోయాయి. వాహినీ, విజయా సంస్థలు నిర్మించిన కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ వేశారు. విజయావారి ‘మిస్సమ్మ’లో డేవిడ్ పాత్రలో రమణారెడ్డి పలికించిన హాస్యాన్ని ఈ నాటికీ జనం గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. ఆ చిత్రం తరువాత రమణారెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు.

రమణారెడ్డి మిత్రుడు ఎ.శంకర్ రెడ్డి – యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా ‘చరణదాసి’ చిత్రం నిర్మించారు. అందులో రమణారెడ్డి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నరసు, కృష్ణ పాత్రల్లో రమణారెడ్డి ఆకట్టుకొనేలా నటించారు. ఇదే శంకర్ రెడ్డి తరువాత యన్టీఆర్, అంజలీదేవితో నిర్మించిన ‘లవకుశ’ చరిత్ర సృష్టించింది. అందులో సూర్యకాంతం భర్తగా రమణారెడ్డి పండించిన హాస్యాన్ని తలచుకుంటే చాలు నవ్వులు మన సొంతం కావలసిందే. విజయవారి “మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ, సత్య హరిశ్చంద్ర, సి.ఐ.డి.” వంటి చిత్రాలలో రమణారెడ్డి హాస్యం జనానికి గిలిగింతలు పెట్టింది. యన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ ‘యన్.ఏ.టి.’ నిర్మించిన చిత్రాలలోనూ, ఏయన్నార్, దుక్కిపాటి సంస్థ ‘అన్నపూర్ణ పిక్చర్స్’ సినిమాల్లోనూ రమణారెడ్డి ఎంతలా నవ్వులు పూయించారో వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రేలంగి, రమణారెడ్డి జోడీ అనేక చిత్రాలలో నవ్వుల పండించిన తీరును జనం తలచుకొని తలచుకొని నవ్వుకుంటూనే ఉంటారు. వందలాది చిత్రాలలో రమణారెడ్డి తనదైన హాస్యం కురిపించారు.

పౌరాణిక, జానపద, సాంఘికాలలో రమణారెడ్డి వైవిధ్యంగా హాస్యం పండించారు. “మాయాబజార్, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, లవకుశ, పాండవవనవాసము, భక్త ప్రహ్లాద” వంటి పౌరాణికాల్లో రమణారెడ్డి అభినయం జనాన్ని కట్టిపడేసింది. “బండరాముడు, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి, బందిపోటు, మంగమ్మ శపథం, అగ్గిబరాటా, కంచుకోట” వంటి జానపదాల్లో ఆయన కామెడీ కబడ్డీ ఆడేసింది. అనేక సుప్రసిద్ధ నిర్మాణ సంస్థలు నిర్మించిన సాంఘిక చిత్రాలలో రమణారెడ్డి నవ్వుల తేరు సాగింది. రమణారెడ్డి అందరినీ నవ్విస్తూ ఉన్నా, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. 1974 నవంబర్ 11న రమణారెడ్డి కన్నుమూశారు. ఆయన స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేకపోయారు. తెలుగు చిత్రసీమలో రమణారెడ్డి హాస్యానికి తప్పకుండా చెరిగిపోని చరిత్ర ఉందని చెప్పవచ్చు.