ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాంకర్ గా నేడు దూసుకుపోతున్నారు. రాజీవ్ వైవిధ్యమైన పాత్రలతో తన రూటులో తాను సాగిపోతున్నారు.
స్టార్స్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో నటులకు నటనలో శిక్షణ ఇచ్చారు దేవదాస్ కనకాల, ఆయన సతీమణి లక్ష్మి. పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో దేవదాస్ శిక్షణ పొంది వచ్చారు. పలు చిత్రాలలో నటించారు. మదరాసులో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి ఆధ్వర్యంలో సాగిన ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ కు లక్ష్మి కనకాల ప్రిన్సిపల్ గా పనిచేశారు. అక్కడే దేవదాస్ కూడా నటశిక్షణ ఇచ్చేవారు. ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొందిన పలువురు నటులుగా రాణించారు. తరువాత హైదరాబాద్ లో మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లోనూ దేవదాస్, లక్ష్మి దంపతులు పనిచేశారు. ఈ దంపతులకు 1969 నవంబర్ 13న రాజీవ్ జన్మించారు. చిన్నతనం నుంచీ సినిమా వాతావరణంతో పరిచయం ఉన్న రాజీవ్ మనసు సహజంగానే నటనవైపుకు మళ్ళింది. తొలుత కొన్ని టీవీ సీరియల్స్ లో అలరించిన రాజీవ్, తరువాత సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
‘స్టూడెంట్ నంబర్ వన్’ చిత్రంతో రాజీవ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత నుంచీ అనేక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో అలరించారు రాజీవ్. ‘ఎ ఫిలిమ్ బై అరవింద్’తో మరింత మంచి పేరు దక్కించుకున్నారు. అనేక చిత్రాలలో హీరోలకు ఫ్రెండ్ గా నటించారు రాజీవ్. కొన్ని చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ లోనూ, విలన్ గానూ నటించి అలరించారు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఆకట్టుకుంటూ సాగారు రాజీవ్. ఇప్పటికీ రాజీవ్ పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి రాబోయే చిత్రం ‘ట్రిపుల్ ఆర్’లోనూ రాజీవ్ ఓ ముఖ్య పాత్రను ధరించారు.
రాజీవ్ భార్య సుమ కూడా తొలుత నటిగా సాగారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘కళ్యాణప్రాప్తిరస్తు’లో ఓ నాయికగా సుమ తెరపై కనిపించారు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో కీలక పాత్రలు ధరించారామె. రాజీవ్, సుమ దంపతుల తనయుడు రోషన్ సైతం తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ ఈ మధ్యే నటునిగా మారాడు.
