చెన్నైలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ సినీ నటుడు ప్రభు నివాసం సహా అమెరికా రాయబారి కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. తమిళనాడు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో చెన్నైలోని అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో త్వరలోనే బాంబు పేలుతుందని, ఆ తరువాత నటుడు ప్రభు ఇంట్లో కూడా బాంబు పేలుతుందని పేర్కొన్నారని అధికారులు వెల్లడించారు.
Also Read : Rishab Shetty: టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రిషబ్‌శెట్టి..!
దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్‌తో కలిసి అన్ని ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అమెరికా కాన్సులేట్ భవనం, నటుడు ప్రభు నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా కాన్సులేట్‌లో పనిచేస్తున్న మరికొందరు అధికారుల ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు మెయిళ్లు వచ్చినట్టు సమాచారం. అన్ని ప్రదేశాల్లోనూ బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.
దీంతో పోలీసులు ఈమెయిల్ మూలాన్ని ట్రేస్ చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఇది కేవలం కొందరు ఆకతాయిలు సృష్టించిన తప్పుడు అలారం మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో మరో ఇద్దరు ప్రముఖులు నటుడు ఎస్.వి. శేఖర్ మరియు మైలాపూర్ సుబ్రమణ్యస్వామి నివాసాలకూ ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అయితే, అన్ని చోట్లా పోలీసులు సెక్యూరిటీ తనిఖీలు పూర్తి చేసి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు కలకలం రేగినప్పటికీ, పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.
