NTV Telugu Site icon

న‌వ్వుల రేడు…న‌గేశ్!

(సెప్టెంబ‌ర్ 27న న‌గేశ్ జ‌యంతి)

న‌గేశ్ తెర‌పై క‌నిపిస్తే చాలు న‌వ్వులు విర‌బూసేవి. న‌గేశ్ తో న‌ట‌న‌లో పోటీప‌డ‌డం అంత‌సులువేమీ కాద‌ని క‌మ‌ల్ హాస‌న్ వంటి విల‌క్ష‌ణ న‌టుడు కూడా అంటారు. దీనిని బ‌ట్టే న‌గేశ్ టైమింగ్ ఏ పాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఎదురుగా ఎంత‌టి మ‌హాన‌టులు ఉన్నా వారికి దీటుగా న‌టించేసి మెప్పించేవారు న‌గేశ్. కామెడీ అంటేనే క‌త్తిమీద సాము. అలాంటి సాములు బోలెడు చేసి భ‌ళా అనిపించారు న‌గేశ్. ఇక ఆయ‌న న‌ర్త‌నంలోనూ త‌న‌దైన బాణీ పలికించారు. రాక్ అండ్ రోల్, బ్రేక్ డాన్స్ వంటివి న‌గేశ్ తెర‌పై ప‌లికించి జ‌నాన్ని ఆక‌ట్టుకున్నారు. త‌మిళ‌నాట పుట్టినా తెలుగు చిత్రాల‌లో న‌గేశ్ మేటిగా సాగారు. తెలుగు సినిమా మొర‌టోడు కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించీ అల‌రించారు న‌గేశ్.

న‌గేశ్ పూర్తి పేరు చేయూర్ కృష్ణారావ్ న‌గేశ్వ‌ర‌న్. 1933 సెప్టెంబ‌ర్ 27న జ‌న్మించారు న‌గేశ్. 1958 నుండి చిత్ర‌సీమ‌లో త‌న‌దైన బాణీ ప‌లికించారు. హాస్య‌న‌టునిగానే కాదు, హీరోగా, కేరెక్ట‌ర్ యాక్ట‌ర్ గా, విల‌న్ గానూ న‌గేశ్ ఆక‌ట్టుకున్నారు. నాలుగు త‌రాల హీరోల‌తో న‌టించి మురిపించారు న‌గేశ్. ఎమ్.జి.రామ‌చంద్ర‌న్, శివాజీగ‌ణేశ‌న్, జెమినీ గ‌ణేశ‌న్ వంటి స్టార్స్ సైతం న‌గేశ్ రాక కోసం ఎదురుచూసి మ‌రీ న‌టించేవారు. అంత బిజీగా సాగిన న‌గేశ్ త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లో న‌టించి మెప్పించారు. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ న‌టుడు జెర్రీ లూయిస్ బాణీ న‌గేశ్ లో క‌నిపించేది. అందువ‌ల్ల న‌గేశ్ ను జెర్రీ లూయిస్ ఆఫ్ ఇండియా గా పేరు సంపాదించారు. తెలుగులో రేలంగి-గిరిజ జోడీలాగా త‌మిళ‌నాట న‌గేశ్, మ‌నోర‌మ జంట అల‌రించింది. వారిద్ద‌రూ క‌ల‌సి వంద‌లా చిత్రాల‌లో క‌నువిందు చేశారు. దాదాపు వేయి చిత్రాల‌లో న‌గేశ్ న‌ట‌న మురిపించింది.

తెలుగులో య‌న్టీఆర్, ఏయ‌న్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు చిత్రాల‌లో న‌గేశ్ న‌టించి ఆక‌ట్టుకున్నారు. అనేక హిట్ మూవీస్ లో న‌గేశ్ తెలుగులో త‌న‌దైన బాణీ ప‌లికించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ ను ఓ మ‌లుపు తిప్పిన తొలిప్రేమ‌లో హీరోకు పెద‌నాన్న‌గా న‌టించారు న‌గేశ్. ఆయ‌న టైమింగ్ చూసి ఎంద‌రో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు న‌గేశ్ డేట్స్ కోసం వేచివుండేవారు. న‌గేశ్ త‌న‌యుడు ఆనంద్ బాబు కూడా తండ్రిబాట‌లో ప‌య‌నిస్తూ న‌ట‌న‌లో అడుగుపెట్టారు. ఆనంద్ బాబు సైతం కొన్ని తెలుగు చిత్రాల‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. న‌గేశ్ కీర్తి కిరీటంలో ఎన్నెన్నో అవార్డులూ రివార్డులూ చోటు చేసుకున్నాయి. త‌న న‌వ్వుల‌తో ద‌క్షిణాది వారంద‌రినీ అల‌రించిన న‌గేశ్ 2009 జ‌న‌వ‌రి 31న క‌న్నుమూశారు. ఆయ‌న లేక‌పోయినా న‌గేశ్ పంచిన న‌వ్వులు ఇప్ప‌టికీ జ‌నానికి కిత‌కిత‌లు పెడుతూనే ఉన్నాయి.