Site icon NTV Telugu

Abhay 3: ‘పుష్ప’ చూశాను, ‘ట్రిపుల్ ఆర్’ చూడలేదు: కునాల్ ఖేము

Abhay 3

Abhay 3

బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ‘కలియుగ్’ తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కునాల్ ఖేము. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ తోనూ నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కునాల్. తాజాగా అతను నటించిన ‘అభయ్’ వెబ్ సీరిస్ సీజన్ త్రీ జీ 5లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. విశేషం ఏమంటే… హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ దీన్ని డబ్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో కునాల్ ఖేముతో పాటు దర్శకుడు కెన్ ఘోష్ మీడియాతో మాట్లాడారు.

తెలుగు సినిమా రంగంలోని చిరంజీవి, నాగార్జున వంటి హీరోలంటే తనకెంతో గౌరవమని, వారి సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటానని కునాల్ చెప్పాడు. నాగార్జున తో ‘జఖ్మ, అంగారే’ చిత్రాలలో నటించే ఆస్కారం తనకు లభించిందని, అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన ఫిజిక్ లో ఎలాంటి మార్పూ లేకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఆ మధ్య వచ్చిన ‘పుష్ప’ చిత్రాన్ని తాను చూశానని, ఎంతో బాగా నచ్చిందని అయితే ‘అభయ్ -3’ ప్రమోషన్స్ తో బిజీ కావడంతో ఆ తర్వాత విడుదలైన ఏ చిత్రమూ చూడలేదని తెలిపాడు. ‘ట్రిపుల్ ఆర్’ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే చూడాలనే కోరిక కలుగుతోందని, అతి త్వరలోనే ఆ సినిమాను చూస్తానని అన్నాడు. ‘గంగూబాయ్ కటియావాడి’తో పాటు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ‘అభయ్’ వెబ్ సీరిస్ ను కెన్ ఘోష్ దర్శకత్వంలో జీ 5 ఒరిజినల్ గా బీపీ సింగ్ నిర్మించారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అభయ్ ప్రతాప్ సింగ్ అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రను కునాల్ పోషించాడు. పాపులర్ బాలీవుడ్ నటుడు విజయ్ రాజే ఇందులో ప్రతినాయకుడి పాత్రను చేస్తుండగా, ‘పోటుగాడు’, ‘పాఠశాల’ చిత్రాలలో నటించిన అనుప్రియ గోయంక కీలక పాత్రను చేసింది. అలానే ముఖేశ్ రుషి సైతం ఈ వెబ్ సీరిస్ లో కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. వెబ్ సీరీస్ లను తానో పెద్ద సినిమాగా భావిస్తానని, ప్రతి ఎపిసోడ్ చివరిలో ఆసక్తికరంగా ఉండేలా చూసుకుంటానని, ఆ రకంగా ఓ ఏడు ఇంటర్వెల్స్ ఉండే పెద్ద సినిమా ఇదని దర్శకుడు కెన్ ఘోష్ చెప్పాడు. భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సీరిస్ తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని కునాల్, కెన్ ఘోష్ వ్యక్తం చేశారు.

Exit mobile version