చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ టీనా సాధు మృత్యువాత పడింది. ఓంకార్ మొదలుపెట్టిన డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్ గా నిలిచిన టీనా ఈరోజు ఉదయం మృతి చెందినట్లు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ తెలిపారు. అయితే ఆమె ఎలా మృతి చెందింది అనేది తెలియలేదు. ” ఆట సీజన్‌లో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త చాలా బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు శాంతి చేకూరాలి” అని పోస్ట్ లో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
బుల్లితెరపై ప్రసారం అయినా ఈ షో లో సందీప్, టీనా పార్ట్నర్స్ గా చేశారు. ఆ సమయంలో టీనా ఎంతో కష్టపడి, ఎన్నో అవమానాలు పడి చివరకు టైటిల్ ను గెలుచుకొంది. కాగా ఆట సీజన్-1విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్-4కి జడ్జిగా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసింది. కొన్ని కారణాల వలన కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె ఇలా అతి చిన్నవయస్సులోనే హఠాన్మరణం చెందడం పలువురిని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. అయితే ఏ కారణం వలన ఆమె మృతి చెందింది అనేది ఇంకా తెలియాల్సి ఉండడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
