కొత్తగా కలం పట్టేవారికి వ్యాసాలు రాయాలన్నా, గీతాలు పలికించాలన్నా, కథలు అల్లుకోవాలన్నాసూచనలు సలహాలు ఇవ్వడానికి ముందుండేవారు ఆరుద్ర. ఆయన చెప్పిన టిప్స్ తోనే కలం పట్టి తమ కవితాబలం చూపించినవారూ లేకపోలేదు. ఆరుద్ర పాటంటే ఎంతో అభిమానించే ప్రముఖ దర్శకులు, ప్రఖ్యాత చిత్రకారులు బాపు కూడా ఆయన స్ఫూర్తితో భావి చిత్రకారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కొన్ని బొమ్మలు ‘బాపు’ గీతాంజలి పేరిట అందించారు. అంతేనా, బాపు తెరకెక్కించిన కొన్ని సినిమాలు మినహాయిస్తే, అన్నిటా ఆరుద్ర పాట పరవశింప చేసింది. తెలుగు భాషలో పలు పోకడలు పోయింది ఆరుద్ర కలం. అందుకు నిదర్శనంగా నిలిచాయి ఆరుద్ర కలం నుండి జాలువారిన “త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు” వంటివి. ఇవే కాకుండా అందరినీ ఆలోచింప చేసే “గుడిలో సెక్స్, రాముడికి సీత ఏమౌతుంది?” వంటి రచనలూ పాఠకలోకాన్ని అలరించాయి.
ఇక సినిమా రంగంలో ఆరుద్ర బాణీ అనితరసాధ్యం అనే చెప్పాలి. 1949లో రూపొందిన ‘బీదలపాట్లు’ చిత్రంలో “ఓ చిలకరాజా… నీ పెళ్ళెపుడు…” అనే పాటతో ఆరుద్ర చిత్రసీమలో అడుగు పెట్టారు. కాలానుగుణంగా కలాన్ని పరుగులు తీయించారు. ఆరుద్ర బాణీ కొన్నాళ్ళకే పేరు సంపాదించింది. రాజ్ కపూర్ తన ‘ఆహ్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలేఖలు’ పేరుతో అనువదించారు. ఈ చిత్రానికి శంకర్-జైకిషన్ సంగీతం సమకూర్చారు. అందులో తెలుగువారయిన శంకర్ సూచనతోనే రాజ్ కపూర్, ఆరుద్రతో తెలుగు పాటలు రాయించారు. రాజ్ కపూర్ ‘ప్రేమలేఖలు’లో ఆరుద్ర రాసిన పాటలు భలేగా మారుమోగాయి. ముఖ్యంగా “పందింట్లో పెళ్ళవుతున్నాదీ…” పాట విశేషంగా ఆకట్టుకుంది. ఆ పై యన్టీఆర్ ‘పెంకి పెళ్ళాం’ చిత్రంలో ఆరుద్ర కలం పలికించిన “పడచుదనం రైలుబండి పోతున్నది…” పాట అప్పట్లో యువతను విశేషంగా మురిపించింది. ఆరుద్ర రచనలో హేతువాదం కనిపించేది. అయితే సమయానుకూలంగా పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ తనదైన పంథాలో పదాలు పలికించి మురిపించారు ఆరుద్ర. ఇక బి.ఏ.సుబ్బారావు రూపొందించిన ‘భీష్మ’ చిత్రానికి మరో హేతువాది తాపీ ధర్మారావు మాటలు రాయగా, ఆరుద్ర పలికించిన పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉండడం విశేషం! ‘బాలభారతం’లో భీముడు స్వర్గానికి నిచ్చెన వేసుకు వెళ్ళే సమయంలో “మానవుడే మహనీయుడు…” అంటూ పలికించడంలోనూ తన ముద్ర వేశారు ఆరుద్ర. జానపద చిత్రాల్లో ఓ ఒరవడి దిద్దిన ‘బందిపోటు’లో ఆరుద్ర పలికించిన “ఊహలు గుసగుసలాడే…” పాట స్ఫూర్తితో తరువాత పలు జానపద చిత్రాల పాటలు పరుగుతీశాయి. చరిత్ర నేపథ్యంలో సాగే పాటను రాయడంలోనూ ఆరుద్ర బాణీ ప్రత్యేకమైనది. ‘బాలరాజు కథ’లో “మహాబలిపురం…” పాటలో పల్లవరాజుల కథను బాలలకు అర్థమయ్యేలా పొందు పరిచారు. అదే తీరున భాగ్యనగర చరితను వివరిస్తూ ‘ఎమ్.ఎల్.ఏ.’లో “ఇదేనండి ఇదేనండి భాగ్యనగరమూ…” పాటనూ పలికించారు. వయసు మీద పడ్డా ఏ మాత్రం పట్టు సడలకుండా ‘ఆంధ్రకేసరి’ చిత్రం కోసం “వేదంలా ఘోషించే గోదావరి…” పాటను ఆరుద్ర రాసి అలరించిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు.
డిటెక్టివ్ రచనలో తనకు తానే సాటి అనిపించారు ఆరుద్ర. అందువల్లే కొన్ని ఆంగ్ల చిత్రాలను కలిపి ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే యాక్షన్ మూవీకి కథ సమకూర్చారు. చిత్రసీమలో పలు ప్రయోగాలు చేసిన ఆరుద్ర మనసు తన మాతృభాష, దాని పరిణామం, పరిశోధన అనే అంశాలవైపు సాగింది. తత్ఫలితంగానే ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ వెలసింది. ప్రతి తెలుగు భాషాభిమాని ఇంట ఉండవలసిన అద్భుత గ్రంథమిది. ఒక్కసారి ఆరుద్ర మాటతో, పాటతో పరిచయమయితే చాలు, తరువాత మన మదిలో చెరగని ముద్ర వేస్తుంది ఆయన సాహిత్యం. భావితరాలు, ముఖ్యంగా సినీగేయ రచయితలు ఆరుద్ర పంథాను అనుసరిస్తే చాలు ఏ తరహా బాణీలకయినా పాటలు రాయగలరు.