Site icon NTV Telugu

Aamir Khan: ఆమిర్ సంచలన నిర్ణయం.. సినిమాలకు బ్రేక్

Aamir Khan Breaks

Aamir Khan Breaks

Aamir Khan Took Break From Movies: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరొందిన ఆమిర్ ఖాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ హీరో.. ఈ సందర్భంగానే ఆ విషయాన్ని వెల్లడించాడు. తన 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తాను తొలిసారి ఇలా బ్రేక్ తీసుకోబోతున్నానని తెలిపాడు. ‘‘నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు, పూర్తిగా అందులోనే లీనమైపోతాను. జీవితంలో మరే విషయాలు లేవన్నట్లుగా ధ్యాస మొత్తం ఆ సినిమాపైనే పెడతాను. నిజానికి నేను లాల్ సింగ్ చడ్ఢా తర్వాత ‘ఛాంపియన్స్’ సినిమా చేయాలి. అదో అద్భుతమైన స్క్రిప్ట్. కానీ.. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. అమ్మ, పిల్లలు, నా కుటుంబంతో సమయం గడపాలనుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నేను గత 35 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. సింగిల్-మైండెడ్‌గా నా పని మీదే ఫోకస్ పెట్టాను. కానీ.. అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో కలిసి సమయం గడిపేందుకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్‌లో చూడొచ్చు. కాబట్టి మరో ఏడాదిన్నర వరకు నటుడిగా కెమెరా ముందుకు వెళ్లకుండా, విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయ్యా’’ అని తెలిపాడు. ఇదే సమయంలో ఛాంపియన్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే దీనికి నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఈవెంట్‌లో ఆమిర్ ఖాన్ నెరిసిన గడ్డం, తెల్లజుట్టుతో దర్శనమిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. లాల్‌సింగ్‌ చడ్డా ఫెయిల్యూర్‌ తర్వాత తొలిసారి అతడు ఓ ఈవెంట్‌లో ఇలా ప్రత్యక్షమయ్యాడు.

Exit mobile version