ఆది సాయికుమార్ హీరోగా, వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘కిరాతక’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో కొన్ని నెలల క్రితం నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం పోస్టర్స్ నూ రిలీజ్ చేశారు. అంతేకాదు… ఆగస్ట్ 13 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలవుతుందని, పూర్ణ ఇందులో పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించబోతోందని ప్రకటించారు. కానీ ఆగస్ట్ 13న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకపోగా ఆది, పాయల్ రాజ్ పుత్ జంటగా మరో కొత్త సినిమాను ఆగస్ట్ 15న నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించడం ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ తాజా చిత్రానికి ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనూ పూర్ణ నటిస్తోంది. సో… ‘కిరాతక’ వెనక్కి వెళ్ళడానికి, హఠాత్తుగా ఈ సినిమా ముందు రావడానికి కారణం తెలియదు.
అయితే… ఇన్ సైడ్ సోర్స్ ద్వారా తెలిసిందేమంటే…. ‘కిరాతక’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. అది పక్కాగా ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందట. అందుకే ఈలోగా ఆర్టిస్టుల డేట్స్ వృధా కాకుండా వారిని ఒప్పించి, ఈ కొత్త సినిమాను ప్రారంభించారని తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది ఇటు నిర్మాత తిరుపతి రెడ్డి లేదా దర్శకుడు వీరభద్రమ్ చెబితేనే తెలుస్తుంది. ఏదేమైనా… నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నా ఆది సాయికుమార్ ఇచ్చిన డేట్స్ వదులుకోలేకే నిర్మాత ఈ ఫాస్ట్ డెసిషన్ తీసుకున్నాడనే ప్రచారమైతే జరుగుతోంది. మరి ‘కిరాతక’ గురించి హీరో ఆది సాయికుమార్ అయినా వివరణ ఇస్తాడేమో చూడాలి!
