Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!

Gaja

Gaja

Gaja Teaser: ఒకవైపు ప్రేమ.. మరోవైపు రక్తపాతం.. మధ్యలో అంతుచిక్కని రహస్యం. హీరో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తిని రేకెత్తిస్తూ సతీష్ జై తెరకెక్కించిన ‘గజ’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ టీజర్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. చలమలశెట్టి సునీల్ సమర్పణలో, సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ మైత్రి శరణ్ నిర్మించిన ఈ చిత్రంలో సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడిగా కెమెరా ముందు కనిపించడంతో పాటు దర్శకుడిగా వెనుక ఉండి సినిమాను తెరకెక్కించడం సతీష్ జైకు ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా మార్చింది. పద్మనాభ రెడ్డి, జి. మధుసూదన్, ఎం. నరేంద్ర సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో నిన్న ‘గజ’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ, సినిమా పరిశ్రమకు కులం, గోత్రం ఉండవని, కళామతల్లిని నమ్ముకున్న మనందరిదీ ‘సినిమా కులం’ మాత్రమేనని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు ఈ చిత్రంలో ఒకేసారి హీరోగా నటిస్తూ, కథ అందించి, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్న సతీష్ జై పట్టుదలను ఆయన ఎంతగానో అభినందించారు. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మతో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, చిత్ర యూనిట్ మొత్తానికి తన హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

భగవద్గీతలోని ఒక సూక్తితో టీజర్ ప్రారంభం కావడం, వెంటనే కథను యాక్షన్ థ్రిల్లర్ లో చూపించడంతో స్టోరీ ఏమిటనే ఇంట్రెస్ట్ కలుగుతోంది ప్రేక్షకులకు. ఈ టీజర్‌లో జైలు నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా కనిపిస్తున్నాయి. ప్రేయసిని చంపిన వ్యక్తిగా హీరోను చూపించడం వెనుక ఉన్న కారణం సస్పెన్స్ గానే ఉంచారు. అతను నిజంగా హంతకుడా, లేక పరిస్థితులు అతన్ని ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయా అనే సందేహాన్ని టీజర్ సస్పెన్స్ తో ప్రేక్షకుల ముందుంచింది. మణి శర్మ అందించిన నేపథ్య సంగీతం కూడా ఈ మూవీకి హైలెట్ గా ఉండబోతోంది. టీజర్‌ను చూస్తే ‘గజ’ యాక్షన్ సినిమాలా కాకుండా ప్రేమ, థ్రిల్, ఎమోషన్‌తో కూడిన విభిన్నమైన కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇప్పటివరకు విడుదలైన టీజర్ సినిమా కథను పూర్తిగా వెల్లడించకుండా కీలకమైన ప్రశ్నలను మాత్రమే ప్రేక్షకుల ముందుంచింది. ముఖ్యంగా హీరో ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయినే ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. త్వరలోనే ట్రైలర్‌ను , రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. ఇక సతీష్ జై దర్శకత్వంలో రూపొందిన ‘గజ’ థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.