Brathuku Theruvu:చదువుకున్న వారికి కూడా ఉద్యోగం దొరకని పరిస్థితులు ఇప్పుడే కాదు డెబ్బై ఏళ్ళ క్రితమే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యను వినోదం మాటున రంగరించి, అనేక చిత్రాలు రూపొందాయి. అలాంటి ఓ సినిమా 70 ఏళ్ళ క్రితమే పి.రామకృష్ణ దర్శకత్వంలో ‘బ్రతుకు తెరువు’ పేరుతో తెరకెక్కింది. రామకృష్ణ భార్య భానుమతి అప్పటికే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆ రోజుల్లో టాప్ హీరోయిన్. అయితే ఈ సినిమాలో సావిత్రిని నాయికగా ఎంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రూపొందిన ‘బ్రతుకు తెరువు’ 1953 ఫిబ్రవరి 6న విడుదలయింది. ఏయన్నార్, సావిత్రి జంటగా నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం! ఈ సినిమా తెలుగునాట మంచి విజయం సాధించింది. తరువాత హిందీలో ‘జీనే కీ రాహ్’ పేరుతో రీమేక్ అయింది. చిత్రమేమిటంటే, మార్పులూ చేర్పులతో రూపొందిన ‘జీనే కీ రాహ్’ను తెలుగులో మళ్ళీ ఏయన్నార్ హీరోగా ‘భార్యాబిడ్డలు’ పేరుతో పునర్నిర్మించారు.
ఇంతకూ ‘బ్రతుకు తెరువు’ కథ ఏమిటంటే- డిగ్రీ పాసయిన మోహన్ రావు తన కుటుంబానికి ఆధారం. అతను ఉద్యోగం కోసం తంటాలు పడుతూ ఉంటాడు. తన సంసారనౌకను సాగించడానికి పెళ్ళికాలేదని అబద్ధం ఆడి, జమీందార్ బాలా సాహెబ్ వద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. ఇది తెలియని జమీందార్ కూతురు మీనా, మోహన్ రావుపై మనసు పారేసుకుంటుంది. మోహన్ పంపిన సొమ్మును అతని అక్క కాజేస్తుంది. దాంతో మోహన్ తల్లి గొడవపడి, మోహన్ భార్యాబిడ్డలను తీసుకొని పట్నం వస్తుంది. వారిని మోహన్ ఓ చోట పెడతాడు. అలాగే మోహన్ అక్క కోటమ్మ, ఆమె భర్త రామయ్య పట్నం వచ్చి భూషయ్య ఇంట్లో చేరతారు. జమీందార్ కు ఈ భూషయ్య మంచిమిత్రుడు. ఇది తెలిసిన మోహన్, జమీందార్ ఇచ్చే పార్టీలకు ఎగ్గొడుతూ ఉంటాడు. మోహన్ కు తన కూతురు మీనాను ఇచ్చి పెళ్ళి చేయాలని జమీందార్ నిశ్చయిస్తాడు. ఆ రోజుల్లోనే లక్షల డబ్బు ఇచ్చి మోహన్ ను తన అల్లుడుగా చేసుకోవాలను కుంటాడు. అయితే మోహన్ నిజం చెప్పేసి, అందరూ హాయిగా ఉండేలా ప్లాన్ చేస్తాడు. అయితే పరిస్థితులు తారుమారవుతాయి. మోహన్ వాటన్నిటినీ ఎదుర్కొని తన కుటుంబంతోనే ఉండటానికి నిర్ణయించుకుంటాడు. చదువుకున్నా, ఉద్యోగాలు దొరకని కారణంగా యువత పడే పాట్లను అందరూ అర్థం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
ఎస్వీ రంగారావు, జూనియర్ శ్రీరంజని, రేలంగి, సూర్యకాంతం ఇతరు ముఖ్యపాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రంతోనే సముద్రాల సీనియర్ అయిన రాఘవాచార్య తనయుడు సముద్రాల జూనియర్ గా సుప్రసిద్ధులైన రామానుజాచారి రచయితగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసం సముద్రాల జూనియర్ రాసిన ‘అందమె ఆనందం..’ పాట ఘంటసాల బాణీల్లో సూపర్ హిట్ గా నిలచింది. ఈ నాటికీ ఆ పాట జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం! ఇందులోని మిగిలిన పాటలు సముద్రాల కలం నుండి జాలువారాయి. సి.ఆర్.సుబ్బురామన్ కూడా కొన్ని పాటలకు స్వరకల్పన చేశారు. “దారీ తెన్నూ కానగదా..”, “ఇంతే ప్రపంచమన్నా..”, “వచ్చెనమ్మా వచ్చేనే..”, “రాదోయీ కనరాదోయీ..”, “ఏదో మత్తుమందు జల్లి..” అంటూ సాగే పాటలు సైతం ఆకట్టుకున్నాయి.
కోవెలమూడి భాస్కరరావు నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తమిళంలో ‘భలే రామన్’ పేరుతో ఈ సినిమాను డబ్బింగ్ చేయగా, అక్కడా ఆదరణ చూరగొంది. మళ్ళీ ఇదే కథను 1972లో తమిళంలో యమ్జీఆర్, కె.ఆర్.విజయ జంటగా ‘నాన్ ఎన్ పిరందేన్’ పేరుతో రీమేక్ చేయగా, పరాజయం పాలయింది.