NTV Telugu Site icon

Panduranga Mahatyam: ‘పాండురంగ మహాత్మ్యం’ – నందమూరి నటనావైభవం

Pandu Ranga Mahatyam

Pandu Ranga Mahatyam

Panduranga Mahatyam: ఎన్టీ రామారావును మహానటునిగా తీర్చిదిద్దిన చిత్రాలలో ‘పాండురంగ మహాత్మ్యం’ స్థానం ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి ముందు ఎన్టీఆర్ అనేక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించినా, భక్త పుండరీకునిగా ఇందులో ఆయన అభినయం అశేష ప్రేక్షకలోకాన్ని అలరించింది. ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం! ఎన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. పతాకంపై ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తన తమ్ముడు ఎన్.త్రివిక్రమరావు నిర్మాతగా తెరకెక్కించారు. 1957 నవంబర్ 28న విడుదలైన ‘పాండురంగ మహాత్మ్యం’ విజయఢంకా మోగించింది.

కన్నవారే ప్రత్యక్ష దైవాలు అన్నసందేశాన్నిస్తూ ఈ పురాణగాథ తెరకెక్కింది. పరమనిష్టాగరిష్ఠులైన జహ్నుశర్మ, లక్ష్మీ దంపతుల తనయుడు పుండరీకుడు నిరంతరం ఆనందంగా జీవిస్తూ, వేశ్యా వాటికల్లో విహరిస్తూ ఉంటాడు. బాల్యంలోనే అతనికి రమా అనే అమ్మాయితో వివాహం జరిగి ఉంటుంది. తనయుడు దారి తప్పుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు అతని భార్యను కాపురానికి తీసుకువస్తారు. తమ సుఖవైభవానికి కన్నవారు అడ్డు అని భావించి, వారిని నానా మాటలంటాడు. ఇంట్లో నగలను దొంగిలించి కళావతి అనే వేశ్యకు ఇస్తాడు. ఆ నేరాన్ని కన్నవారిపైనే నెడతాడు. దాంతో వారు ఇల్లు వదలి వెళ్ళిపోతారు. పోతూ కన్నతల్లి అతడిని సుఖంగా ఉండమని దీవిస్తుంది. అప్పుడు కాసేపు తప్పుచేశాననే భావన అతనిలో కలిగినా, మళ్ళీ సుఖభోగలాలసుడై నెచ్చెలి కళావతి చెంతకే చేరతాడు. ఇల్లాలి నగలను సైతం దోచి సానికి కట్టబెడతాడు. పుండరీకుని ధనం కరిగిపోగానే, కళావతి మరొకరిని చూసుకుంటుంది. అది కళ్ళారా చూసిన పుండరీకుడు ఆమెను ఏవగించుకుంటాడు. భార్య అతనితో వాదులాడి పుట్టిల్లు చేరుతుంది. అక్కడ ఆమె తండ్రి మందలించి పంపుతాడు. కళావతి చేసిన మోసానికి పుండరీకుని కాపురం కూలిపోయిందని భావించిన అతని మిత్రుడు రంగదాసు ఆమె చెంత నున్న వీలునామాను తెచ్చి, పంచాయతీలో పెడతాడు. అక్కడ కళావతి నేరం రుజువవడంతో ఆమెకు గ్రామబహిష్కరణ విధిస్తారు.

పుండరీకుని ఆస్తి అతని కుటుంబీకులకు కానీ, వారసులకు కానీ అప్పగిస్తామని తీర్పు చెబుతారు. గంగ, యమున, సరస్వతి తమను అంటిన పాపాలను కుక్కుట ముని పాదసేవతో పరిహరించుకొని పావనమై వస్తూండగా, వారిని పుండరీకుడు కామాంధుడై అడ్డగిస్తాడు. అతని స్పర్శతో వారు మలినులై మళ్ళీ కుక్కుట ముని పాదస్పర్శతో పునీతలై వెడలిపోతారు. వారిని వెదుకుతూ ఆ ముని చెంతకు చేరి, వారి జాడ చెప్పమని దుర్మార్గంగా ఆ మునినే కాలితో తన్నబోతాడు పుండరీకుడు. అతని కాళ్ళు పోతాయి. కన్నవారి పాదాలను నీ కన్నీటితో కడిగినప్పుడు నీ పాదాలు వాటంతట అవే వస్తాయని ముని చెబుతాడు. పశ్చాత్తాప హృదయంతో విలపిస్తూ బయలుదేరిన పుండరీకునికి కన్నవారు కనిపించగానే, వారి పాదసేవతో అతనికి మళ్ళీ పాదాలు వస్తాయి. ఆ తరువాత రమ సైతం భర్తను చేరుకుంటుంది. అప్పటి నుంచీ పుండరీకుడు అపరభక్తుడై ఆ చిన్నికృష్ణయ్యను ధ్యానిస్తూ ఉంటాడు. ఆ గోపాలుడే వచ్చినా, కన్నవారి సేవ చేస్తూ ఆ పంచన ఉండమని చెబుతాడు. గోపాలుని పాదస్పర్శతో అప్పటి దాకా పాషాణుడై పడివున్న ఇంద్రుడికి శాపవిమోచన కలుగుతుంది. చివరకు కన్నవారితో సహా భార్యాసమేతంగా పరమాత్మలో లీనమవుతాడు పుండరీకుడు. ఆ క్షేత్రమే నేడు పండరీపురంగా భక్తులను అలరిస్తోంది.

ఇందులో యన్.టి.రామారావుతో పాటు చిత్తూరు నాగయ్య, శివరావు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, కె.వి.యస్.శర్మ, వంగర, పద్మనాభం, బాలకృష్ణ (అంజి), పేకేటి, బొడ్డపాటి, లక్ష్మయ్య చౌదరి, ఏవీ సుబ్బారావు, అంజలీదేవి, బి.సరోజ, ఋష్కేంద్రమణి, ఛాయాదేవి, అమ్మాజీ, నిమ్మి, రీటా, అతిథి పాత్రలో జానకి నటించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు సముద్రాల జూనియర్ సమకూర్చారు. టి.వి.రాజు స్వరకల్పన చేశారు. ఈ చిత్రానికి పుండరీకాక్షయ్య నిర్వాహకునిగా వ్యవహరించారు.

ఇందులోని పాటలన్నీ పులకింప చేశాయి. ముఖ్యంగా ఘంటసాల ఆలపించిన ‘జయకృష్ణా.. ముకుందా.. మురారీ..’ గానం ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంది. ఈ పాట తరువాత కన్నీరు పెట్టించేలా నందమూరి నటన సాగిన ‘అమ్మా అని అరచినా..’ గీతం రూపొందింది. ‘హర హర శంభో..’, ‘సన్నుతిసేయవే మనసా.. ’, ‘జయ జయ గోకుల..’, ‘లక్ష్మీనృసింహ విభవే..’, ‘అక్కడ ఉండే పాండురంగడు..’ వంటి భక్తి గీతాలతో పాటు ‘కనవేర మునిరాజ..’, ‘ఆనందమిదేనోయి..’, ‘తరం తరం నిరంతరం..’, ‘ఎక్కడోయి ముద్దుల బావా..’, ‘నీవని నేనని..’, ‘చెబితే వింటివ గురూ గురూ..’, ‘తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది..’, ‘ఓ దారి కనని..’ అంటూ సాగే పాటలూ అలరించాయి. చివరలో మరికొన్ని భాషల్లో పండరీపురనాథుని గానంతో ‘శ్రీకామినీ కామితకార..’, ‘ఆది బీజ ఏకలే..’, ‘తుమా బినా మోరే..’, ‘ఆజ్ కా సునేరా దిన్ హై..’, ‘ఆటలాడ రా రా కన్నయ్యా..’ వంటి పాటలూ వినిపిస్తాయి.

ఈ చిత్రకథ ఆరంభంలోనే ఓంకారనాదం వినిపిస్తూ, ఓంకారరూపం దర్శనమిస్తుంది. తరువాత ఇంద్రుని శాపంతో కథ ముందుకు సాగుతుంది. అతని శాపవిమోచనం, నారాయణుని పాదస్పర్శతో జరుగుతుందని శివుడు చెబుతాడు. పుండరీకుడు కన్నవారి పాదసేవలో ఉండగా, అతని గానానికి పరవశించి వచ్చిన క్రిష్ణయ్యను ఇంటి పంచన ఉండమంటాడు. ఆ సమయంలో చిన్నికన్నయ్య పాదస్పర్శతో ఇంద్రుని శాపం తొలగుతుంది. చివరలో ‘జై పాండురంగ విఠల్’ యన్.ఏ.టి. సమర్పణ అని ఎండ్ టైటిల్ కనిపించడం విశేషం. అంతకు ముందు భక్తుల పాత్రపోషణ అనగానే మహానటుడు చిత్తూరు వి.నాగయ్యనే ముందుగా గుర్తు చేసుకొనేవారు. ఆ తరువాత మరికొందరు భక్తుల పాత్రల్లో అలరించినా, నాగయ్యస్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమాతో ఎన్టీఆర్, ఆ స్థాయిని అందుకున్నారని జనం జేజేలు పలికారు. నాగయ్య స్వయంగా రామారావును అభినందించడం విశేషం!

‘పాండురంగమహాత్మ్యం’ చిత్రం ద్వారానే బి.సరోజాదేవి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు అంతకు ముందు “చంద్రహారం, గుణసుందరి (తమిళం), పెంకిపెళ్ళాం” చిత్రాలకు దర్శకత్వం వహించినా, అవేవీ విజయం సాధించలేదు. ఈ సినిమాతోనే కమలాకర తొలి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇందులో బాలకృష్ణునిగా విజయనిర్మల నటించారు. అప్పట్లో ఆమె పేరును ‘నిమ్మి’గా టైటిల్స్ లో ప్రకటించారు. ఈ చిత్రంలో నాగయ్య, ఘంటసాల, పి.లీల, పి.సుశీల, జిక్కి, ఏ.పి.కోమల, ఎమ్మెస్ రామారావు, పిఠాపురం, మాధవపెద్ది వంటి గాయనీగాయకుల పాటలు వీనులవిందు చేశాయి. విచారకరమేమిటంటే, ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో గాయనీగాయకుల పేర్లు కనిపించవు. ఆ తప్పిదం ఎలా జరిగిందో అర్థం కాక నందమూరి సోదరులు తరువాత వారికి క్షమాపణ చెప్పారట.

ఈ సినిమా తొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. విజయవాడ, గుంటూరులో రజతోత్సవాలూ జరుపుకుంది. రిపీట్ రన్స్ లోనూ ఈ సినిమా విశేషాదరణను చూరగొంది. ఇదే ఇతివృత్తంతో 2008లో యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో కమలాకర కామేశ్వరరావు శిష్యుడు కె.రాఘవేంద్రరావు ‘పాండురంగడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులో శ్రీకృష్ణునిగా, పుండరీకునిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఆ సినిమా అంతగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది.

(నవంబర్ 28న ‘పాండురంగ మహాత్మ్యం’కు 65 ఏళ్ళు)