NTV Telugu Site icon

Khaidi Kannayya: 60 ఏళ్ళ ‘ఖైదీ కన్నయ్య’

నాటి మేటి నటుల్లో ఒకరైన టి.యల్. కాంతారావు పేరు చెప్పగానే ఆయన కత్తి పట్టి కదం తొక్కిన చిత్రాలు, నారద పాత్రతో అలరించిన వైనం గుర్తుకు వస్తాయి. సాంఘిక చిత్రాల్లోనూ కాంతారావు హీరోగా అలరించారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన సాంఘిక చిత్రాలలోనూ కాంతారావు నటించి ఆకట్టుకున్నారు. సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన ‘ఖైదీ కన్నయ్య’ చిత్రంలో కాంతారావు హీరోగా నటించారు. 1962 మార్చి 1న విడుదలయిన ఈ చిత్రం జనాన్ని ఆకట్టుకుంది.

కన్నయ్య బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. బ్యాంకు నుండి డబ్బు తీసుకు వస్తూండగా పాపారావు అనేవాడు కొట్టేస్తాడు. కన్నయ్య తల్లిలేని కొడుకును కూడా పాపారావు, అతని మిత్రుడు కిడ్నాప్ చేస్తారు. డబ్బు పోగొట్టిన నేరంపై కన్నయ్యను అరెస్ట్ చేస్తారు. జైలులో ఉండగా, తన కొడుకు చనిపోయాడని తెలుస్తుంది. అదే సమయంలో జైలర్ కొడుకు రవి అతనికి దగ్గరవుతాడు. దుర్గారాయుడు అనే దుర్మార్గుడు తాను జైలు నుండి తప్పించుకోవడానికి జైలర్ కొడుకు రవిని కిడ్నాప్ చేసి తీసుకుపోతాడు. రవిని వెదికి తెచ్చేందుకు కన్నయ్య కూడా తప్పించుకుంటాడు. రవికి తాను నేర్పిన పాట కారణంగా అతని జాడ తెలుసుకుంటాడు కన్నయ్య. చివరకు బాబును కన్నవారి చెంతకు చేరుస్తాడు. పాపారావు, దుర్గారాయుడును చట్టం శిక్షిస్తుంది. కన్నయ్య నిర్దోషి అని తేలుతుంది. తనను ప్రేమించిన మాధవిని కన్నయ్య పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, రాజనాల, కేవీయస్ శర్మ, బాలకృష్ణ, రాజసులోచన, గిరిజ, సంధ్య, మల్లీశ్వరి, రాజరత్నం తదితరులు నటించారు. ఈ సినిమాకు రాజన్ – నాగేంద్ర సంగీతం సమకూర్చారు. ఇందులోని పాటలన్నీ జి.కృష్ణమూర్తి కలం నుండి జాలువారాయి. “ఈ నిజం తెలుసుకో… మనిషిగా మసలుకో…”, “తియ తీయని తేనెమాటలతో…”, “యవ్వనం అది…”, “చోటెక్కడ చూసెదెప్పుడు…”, “అందాల కళ్ళు చూడు…”, “ప్రేమకు కానుక కావలెనా…” వంటి పాటలు అలరించాయి.

హిందీలో విజయం సాధించిన ‘ఖైదీ నంబర్ 911’ సినిమా ఆధారంగా ‘ఖైదీ కన్నయ్య’ తెరకెక్కింది. ఈ సినిమాకు ప్రముఖ చిత్రకారుడు, తరువాతి రోజుల్లో దర్శకునిగా ఎంతో పేరు సంపాదించిన బాపు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు. పలు కార్టూనులతో ఈ చిత్ర ప్రచారం సాగింది. దానిని అప్పట్లో వింతగా చెప్పుకున్నారు జనం. ‘ఖైదీ కన్నయ్య’ తెలుగులోనూ మంచి విజయం సాధించి, శతదినోత్సవం చూసింది.

(మార్చి 1న ‘ఖైదీ కన్నయ్య’కు 60 ఏళ్ళు)