NTV Telugu Site icon

Brahmachari: యాభై ఐదేళ్ళ ‘బ్రహ్మచారి’

Brahmachari

Brahmachari

Brahmachari:నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మచారి’. ఏయన్నార్ కు అతి సన్నిహితులు, తరువాత ఆయనకు వియ్యంకుడు అయిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి. సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎ.వి.సుబ్బారావు అంటే జయలలితకు కూడా ఎంతో గౌరవం. ఆయన అక్కినేనితో నిర్మించిన ‘మనుషులు-మమతలు’ చిత్రంతోనే జయలలిత తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అలాగే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లోనే ఏయన్నార్, జయలలిత జంటగా తరువాత “ఆదర్శకుటుంబం, భార్యాబిడ్డలు, నాయకుడు-వినాయకుడు” వంటి చిత్రాలూ వెలుగు చూశాయి. 1968 ఫిబ్రవరి 1న విడుదలైన ‘బ్రహ్మచారి’ జనాన్ని ఆకట్టుకుంది.

ఇంతకూ ‘బ్రహ్మచారి’ కథ ఏమిటంటే – రావు సాహెబ్ పరంధామయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఆనందరావు, చిన్నవాడు రామకృష్ణ. ఆంజనేయ స్వామి భక్తుడైన రామకృష్ణ బ్రహ్మచారిగానే ఉండాలని భావిస్తూ, అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అతడిని మిత్రులు ఆటపట్టిస్తూ ఉంటారు. అతనితోనే చదివే వసంతకు కూడా రామకృష్ణ అంటే అభిమానం కలుగుతుంది. ఆమె కూడా అతడిని ఆటపట్టిస్తూ ఉంటుంది. రామకృష్ణ మిత్రుడు అతని రాతతోనే వసంతకు ఓ ఉత్తరం రాస్తాడు. ఆ విషయం రామకృష్ణకు తెలియదు. తరువాత ఓ రోజున ఓ పసిబిడ్డతో వసంత, రామకృష్ణ ఇంటికి వస్తుంది. ఆ బాబుకు రామకృష్ణ తండ్రి అని, కావాలంటే తనకు రాసిన ప్రేమలేఖ చూడమని చెబుతుంది. దాంతో రామకృష్ణ కన్నవారు సైతం ఆమెను ఆదరిస్తారు. ఎలాగైనా వసంతను ఇంట్లోంచి గెంటించాలని రామకృష్ణ పలు ప్రయత్నాలు చేస్తాడు. ఏవీ ఫలించవు. చివరకు రామకృష్ణ తండ్రి వారిద్దరికీ పెళ్ళి చేయాలని నిశ్చయిస్తాడు. ఆ సమయంలో రామకృష్ణ అన్న ఆనందరావు, అతని భార్య వస్తారు. ఆనందరావు, వసంతను చూడగానే గుర్తు పడతాడు. ఎందుకు వచ్చావని ఆనందరావు వసంతను నిలదీస్తాడు. చాటుగా విన్న రామకృష్ణకు తరువాత వసంత జరిగిన విషయం చెబుతుంది. తన అక్కను ఆనందరావు ప్రేమ పేరుతో మోసం చేశాడని, అతని వల్లే ఈ బాబు పుట్టాడని చెబుతుంది. ఎలాగైనా రావు సాహెబ్ ఇంటికి ఈ పిల్లవాడిని చేర్చమని తన అక్కమాట తీసుకుందని, అందువల్లే ఈ నాటకం ఆడవలసి వచ్చిందని వివరిస్తుంది వసంత. ఆనందరావు ముసుగు వేసుకొని బాబును చంపాలని చూస్తాడు. రామకృష్ణ బాబును రక్షించి ఇంటికి తీసుకు వస్తాడు. జరిగినదంతా పెద్దవారికీ వివరిస్తుంది వసంత. ఆనందరావు కూడా ఆ బాబు తన బిడ్డే అని అంగీకరిస్తాడు. చివరకు తాను వచ్చిన పని పూర్తయిందని వసంత అక్కడ నుండి వెళ్ళాలనుకుంటుంది. అయితే రామకృష్ణ ఆమెను ఆపుతాడు. వారిద్దరి పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో నాగభూషణం, రమణారెడ్డి, చలం, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, రావి కొండలరావు, పెరుమాళ్ళు, పొట్టి ప్రసాద్, సూర్యకాంతం, రమాప్రభ, సుకన్య, పుష్పకుమారి ఇతర ముఖ్యపాత్ర ధారులు. ఈ చిత్రానికి బాలమురుగన్ కథ అందించగా, భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు. తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి టి.చలపతిరావు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు ఆత్రేయ, దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు పలికించారు. ఇందులోని “ఓ బ్రహ్మచారి…నినుకోరి…”, “ఏ తోటలో విరబూసెనో ఈ వువ్వు…”, “నిన్ను చూశాను… కన్నువేశాను…”, “ఒక్కసారి సిగ్గుమని…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.

‘బ్రహ్మచారి’ చిత్రం జనాదరణ పొంది, శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత ‘నవశక్తి పిక్చర్స్’ పి. గంగాధరరావు హిందీలో కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘ఏక్ నారి- ఏక్ బ్రహ్మచారి’ పేరుతో రీమేక్ చేశారు. అందులో జితేంద్ర, ముంతాజ్ జంటగా నటించారు. శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చిన ‘ఏక్ నారి ఏక్ బ్రహ్మచారి’ సైతం ఆదరణ పొందింది.

Show comments