NTV Telugu Site icon

Adapaduchu: నటరత్న మరపురాని నటనతో ‘ఆడపడుచు’

Adapaduchu

Adapaduchu

Adapaduchu: తెలుగు ప్రజల హృదయాల్లో ‘అన్న’గా సుస్థిర స్థానం సంపాదించిన నటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి. రామారావు. అనేక చిత్రాలలో తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు అన్నగా నటించి మెప్పించిన నటరత్న నటన మరపురానిది. ఆ తీరున ఆయన అభినయంతో అలరించిన చిత్రం ‘ఆడపడుచు’. 1967 నవంబర్ 30న విడుదలైన ‘ఆడపడుచు’ జనాన్ని విశేషంగా అలరించింది.

‘ఆడపడుచు’ కథ ఏమిటంటే – సత్యం ఓ చిరుద్యోగి. తన తమ్ముడు శేఖర్, చెల్లెలు శారదతో కలసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేసే సుశీల, సత్యం ప్రేమించుకుంటారు. తన చెల్లెలు పెళ్ళి, తమ్ముడు స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలని భావిస్తాడు సత్యం. అందుకు సరేనంటుంది సుశీల. డాక్టర రమేశ్ తో శారదకు పెళ్ళి నిశ్చయమవుతుంది. అలాగే రావు బహదూర్ రంగారావు ఏకైక కుమార్తె లలితతో శేఖర్ ప్రేమాయణం సాగించడం, వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించడం జరుగుతుంది. డబ్బు అవసరమై తన ఇంటిని పూచీగా పెట్టి తన చిన్నాన్న ధర్మయ్య వద్ద అప్పు తీసుకుంటాడు సత్యం. అనుకోకుండా ఓ ప్రమాదం కారణంగా శారద కంటిచూపు పోతుంది. చెల్లెలు జీవితం బాగుపడ్డాకే తన పెళ్ళి అనుకుంటాడు సత్యం. లలిత, శేఖర్ పెళ్ళి చేసుకుంటారు. ధనవంతుల అమ్మాయి అయిన లలిత ఆ ఇంట అడుగు పెట్టిన తరువాత నుంచీ వారి సంసారంలో కలతలు మొదలవుతాయి. లలిత తన పుట్టిల్లు చేరుకుంటుంది. భార్యతో పాటే శేఖర్ వెళతాడు. ధర్మయ్య జాలిచూపకుండా, తన అప్పు తీర్చమని, లేదా ఇల్లు ఖాళీ చేయమని అంటాడు. నిలువనీడలేని సత్యం, చెల్లెలితో శేఖర్ దగ్గరకు వెళతాడు. అక్కడ అవమానాల పాలవుతాడు. అన్నాచెల్లెళ్ళకు సాయం చేయలేని జీవితం తనదని భావించిన శేఖర్ తాగుడుకు బానిస అవుతాడు. సత్యంకు జ్వరం వస్తే అతని కంటిచూపు లేని చెల్లెలు అన్న కోసం డాక్టర్ ను వెదికి వెదికి తీసుకు వస్తుంది. అదే సమయంలో ధర్మయ్య కొడుకు సదానందం కూడా కనిపిస్తాడు. తన అన్నలు ఇద్దరు దొరికారని, శేఖరన్నయ్య ఒక్కడూ వస్తే బాగుంటుందని శారద ఆశిస్తుంది. శేఖర్ తాగుబోతయ్యాడని తెలుసుకున్న శారద తన పుట్టినరోజున వెళ్ళి అడిగితే ఆ వ్యసనం మానేస్తాడని ఆశిస్తుంది. రాత్రి శేఖర్ ను చూడాలని వెళ్తుది. అదే సమయంలో ఆమె ప్రమాదానికి గురవుతుంది. అప్పుడే కారులో వస్తోన్నశేఖర్ తన చెల్లెలును చూసి, ఆసుపత్రికి తీసుకువెళతాడు. సత్యం, సదానందం చెల్లెలును వెదుక్కుంటూ వస్తారు. అక్కడకు సుశీల కూడా వస్తుంది. శారద రాసిన ఉత్తరం చూసి సుశీల వచ్చానని చెబుతుంది. డాక్టర్ రమేశ్ కూడా అదే ఆసుపత్రిలో పనిచేస్తూ, శారదకు కంటి చూపు వస్తుందని చెబుతాడు. శారద, రమేశ్ ను పెళ్ళాడుతుంది. సుశీల, సత్యం పెళ్ళవుతుంది. అన్నలు సత్యం, శేఖర్, సదానందం వీడ్కోలు చెబుతారు, విదేశాలలో కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వెళ్తూండగా కథ ముగుస్తుంది.

సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.హేమాంబరధర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో యన్.టి.రామారావు, చంద్రకళ, శోభన్ బాబు, వాణిశ్రీ, రేలంగి, పద్మనాభం, గీతాంజలి, చదలవాడ కుటుంబరావు, ఏ.వి.సుబ్బారావు, రాధాకుమారి, ఝాన్సీ, అతిథి పాత్రల్లో కృష్ణకుమారి, హరనాథ్, నాగభూషణం నటించారు. ఈ సినిమాకు యల్.వి.ప్రసాద్ స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. చిత్ర దర్శకనిర్మాత హేమాంబరధరరావు సోదరుడు, మరో ప్రముఖ దర్శకులు కె.ప్రత్యగాత్మ ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. దాశరథి, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ పాటలు పలికించారు. టి.చలపతిరావు స్వరకల్పన చేశారు. ఇందులోని “అన్నా నీ అనురాగం…”, “గారడి చేసే కన్నులతో…”, “మది తుళ్ళి తుళ్ళి ఎగిరింది…”, “ప్రేమ పక్షులం మనం…”, “ఇదే నా దయలేని లోకం…”, “రిక్షావాలాను నేను…” అంటూ సాగే పాటలు అలరించాయి.

ఈ చిత్రానికి 1952లో సిహెచ్. నారాయణ మూర్తి రూపొందించిన ‘ఎన్ తంగై’ అనే తమిళ చిత్రం ఆధారం. అదే సినిమా 1959లో యల్.వి. ప్రసాద్ ‘ఛోటీ బహన్’గా హిందీలో నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ హిందీ చిత్రం విజయం సాధించింది. ఈ రెండు చిత్రాల ఆధారంగానే ‘ఆడపడుచు’ రూపొందింది. తరువాత కన్నడలో ‘ఒందే బల్లియ హూగలు’ పేరుతో రీమేక్ అయింది.

అప్పటికే తిరుగులేని మాస్ హీరోగా సాగుతున్న యన్టీఆర్, ఈ సినిమాలో అన్నపాత్రలో అభినయించిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. ఇందులో ఆయన పాత్రకు గ్లామర్ టచప్స్ ఏవీ లేవు. ఓ కేరెక్టర్ రోల్ లా ఆయన పాత్ర సినిమా మొత్తం కనిపిస్తుంది. కానీ, తన ఆడపడుచుకోసం జీవితాన్నే అంకితం చేసిన అన్నగా యన్టీఆర్ నటన సాగింది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం కేంద్రాలలో ఈ సినిమా శతదినోత్సవం చూసింది.

(నవంబర్ 30న ‘ఆడపడుచు’కు 55 ఏళ్ళు)