NTV Telugu Site icon

Bahubali : ఐదేళ్ళు… చెక్కుచెదరని ‘బాహుబలి-ద కంక్లూజన్’!

Bhubali 2

Bhubali 2

ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి అనుగుణంగా తెరకెక్కి ‘బాహుబలి-2’ 2017 ఏప్రిల్ 28న విడుదలయింది. అనూహ్య విజయం సాధించింది. భారతదేశంలో వెయ్యి కోట్ల రూపాయలు చూసిన తొలి చిత్రంగా చరిత్రలో నిలచింది. తెలుగులో రూపొంది, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోకి అనువాదమైన ‘బాహుబలి-2’ విశేషాదరణ చూరగొంది. పాన్ ఇండియా మూవీస్ కు ఓ స్పెషల్ క్రేజ్ ను తెచ్చింది. ఓ జానపద చిత్రం ఆ స్థాయిలో వసూళ్ళు చూడడం అన్నది కనీవినీ ఎరుగని చరిత్ర!

ఇప్పటికీ… ఆ రెండు…
‘బాహుబలి’ సిరీస్ సాధించిన ఘనవిజయంతో ‘బాహుబలి’ అన్న పదం సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ భలేగా మారుమోగింది. ‘బాహుబలి’ రెండు చిత్రాలు ఇప్పటికీ టాప్ గ్రాసర్స్ లో చోటు నిలుపుకోవడం అన్నది విశేషం! ఈ రెండు చిత్రాలతో తెలుగు దర్శకుడు రాజమౌళి పేరు అంతర్జాతీయంగా మారుమోగింది. దాంతో సహజంగానే ఇతర ప్రాంతాలవారికి ఈ సినిమాపై ఓ విధమైన ఆసక్తి నెలకొంది. దీనిని ఏ సినిమా అయినా అధిగమిస్తుందా అన్న లెక్కలూ వేసుకున్నారు. ఇప్పటికీ సినిమా రంగంలో ఏవైనా రికార్డులను గురించి ప్రస్తావించ వలసి వస్తే ‘నాన్-బాహుబలి రికార్డ్’ అని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదని ఇట్టే అర్థమై పోతుంది.

తొలి వెయ్యి కోట్ల చిత్రం!
‘బాహుబలి-2’ చిత్రం విడుదలై ఐదేళ్ళయినా, ఆ సినిమా నెలకొల్పిన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దాంతో కొందరు బాలీవుడ్ బాబులు ఓ ప్రాంతీయ చిత్రం అనువాదమై తమ చిత్రాలను సైతం అధిగమించడం అన్నది జీర్ణించుకోలేక పోయారు. మన దేశంలో వెయ్యి కోట్ల రూపాయలు చూసిన తొలి చిత్రంగా ‘బాహుబలి-2’ను పేర్కొన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు ఉత్తరాదివారు ‘బాహుబలి-2’ నాలుగు భాషల్లో కలిపి అంత మొత్తం చూసిందనే వాదం తీసుకు వచ్చారు. అది నిజమే! కానీ, ఓ జానపద కథతో రూపొందిన చిత్రం ఆ స్థాయి విజయం సాధించడమన్నది చరిత్రనే కదా! అదలా ఉంచితే, ‘బాహుబలి-1’ చిత్రం 2015లో విడుదలై అప్పట్లో టాప్ గ్రాసర్స్ లో నంబర్ 2 స్థానంలో నిలచింది. అప్పటికి ఆమిర్ ఖాన్ ‘పీకే’ ప్రథమస్థానంలో ఉంది. ఆ తరువాత ఆమిర్ ఖాన్ ‘దంగల్’ 2016 డిసెంబర్ 23న విడుదలై ‘పీకే’ను వెనక్కి నెట్టి ప్రథమస్థానం ఆక్రమించింది. అప్పటికి ‘పీకే’ రూ.750 కోట్లు పోగేసిందని అక్కడి ట్రేడ్ సర్కిల్స్ పేర్కొన్నాయి. దాని కంటే ఓ వంద కోట్లు అధికంగా సాధించిందని ‘దంగల్’ను నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ‘బాహుబలి-2’ 2017లో వచ్చాక తొలి వెయ్యి కోట్ల చిత్రమని అక్కడివారే ప్రకటించారు. అప్పుడు కిమ్ కమ్ అనని బాలీవుడ్ బాబులు. తరువాత ‘దంగల్’ను చైనాలో విడుదల చేయగా అక్కడ రూ.1100 కోట్లు వచ్చాయని, వెరసి రూ. 2,024 కోట్లు కొల్లగొట్టి ‘దంగల్’ ప్రథమ స్థానం ఆక్రమించిందని టముకు వేశారు. పైగా కేవలం రూ.70 కోట్లతో రూపొందిన ‘దంగల్’ ఆ స్థాయి వసూళ్ళు చూడడం విశేషమనీ పదే పదే చెప్పుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ బాబుల కనుసన్నల్లో మెలిగే సోషల్ మీడియాలో ‘దంగల్’ రెండువేల కోట్లు చూసిన చిత్రంగానే ప్రచారం అవుతూ ఉంటుంది. మరి ‘దంగల్’ నిజంగా చైనాలో అంత విజయం సాధించిందా? మన దేశంలో కన్నా మిన్నగా ‘దంగల్’ను చైనీయులు ఆదరించారా? అన్న ప్రశ్నలు ఉదయించక మానవు.

ఎందుకీ లెక్కలు!?
ఏది ఏమైనా అలా లెక్కలు చెప్పుకున్నా, ‘బాహుబలి-2’ జానపద చిత్రం ద్వితీయ స్థానంలోనే ఉంది. ఇక ఎప్పుడు ‘బాహుబలి-2’ రికార్డులను తమ హిందీ చిత్రాలు దాటుతాయా అనీ ఆసక్తిగా ఎదురుచూశారు. అది జరగలేదు. దాంతో ‘బాహుబలి’ చిత్రాల రూపకర్త రాజమౌళిపై కొందరు అక్కసు కూడా పెంచుకున్నారు. అలాంటివారు ఈ మధ్య విడుదలైన రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో విషం కక్కారు. అంతేకాదు, రాజమౌళిని జైల్లో పెట్టాలనీ అన్నారు. దీనిని బట్టే అక్కడి వారికి దక్షిణాది చిత్రాలపై ఎలాంటి దృష్టి ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ , ‘బాహుబలి-2’ను అధిగమించక పోవచ్చు. కానీ, ఈ వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసిన రెండు సినిమాలు ఉన్న ఏకైక దర్శకునిగా రాజమౌళి నిలిచారు. ఇంకా ఆయన మీద ఎంత అక్కసు ఉందంటే, ఇటీవల వచ్చిన మరో సౌత్ పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్-2’ సినిమా లెక్కలతో రాజమౌళి రెండు చిత్రాల కలెక్షన్స్ ను పోలుస్తూ చిట్టా వేశారు. అందులోనూ కేజీఎఫ్-2 పది రోజుల వసూళ్ళను, రాజమౌళి చిత్రాల తొమ్మిది రోజుల వసూళ్ళతో పోల్చడం విడ్డూరం! దీనిని బట్టే ఉత్తరాది ట్రేడ్ సర్కిల్స్ కు రాజమౌళి సాధించిన ఘనవిజయం ఎంతలా నిద్ర పట్టకుండా చేస్తోందో అర్థమవుతుంది.

రెండు చిత్రాలకు నేషనల్ అవార్డ్స్!
ఇంత చరిత్ర సృష్టించిన ‘బాహుబలి-2’ చిత్రానికి పలు అవార్డులూ రివార్డులూ లభించాయి. ‘బాహుబలి-1’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిస్తే, ‘బాహుబలి-2’ జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదభరిత చిత్రంగా గెలిచింది. ‘బాహుబలి’ రెండు భాగాలూ నేషనల్ అవార్డ్స్ ను దక్కించుకోవడమూ కొందరికి మింగుడు పడని విషయమే! ‘బాహుబలి-2’ చిత్రం పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ సందడి చేసింది.

ఎందుకలాగా!?
‘బాహుబలి-2’కు ఇప్పటి దాకా ఏ భారతీయ చిత్రానికి, ఆ మాటకు వస్తే ఏ ఆంగ్లేతర చిత్రానికీ లభించని గౌరవం లభించింది. అదేమిటంటే, లండన్ లోని 150 ఏళ్ళ చరిత్ర కలిగిన ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’లో ‘బాహుబలి- ద కంక్లూజన్’ చిత్రాన్ని ప్రదర్శించారు. అప్పుడు యూనిట్ సభ్యులు దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని తదితరులకు ‘స్టాండింగ్ ఓవేషన్’ లభించింది. ఇంతటి చరిత్రను సొంతం చేసుకున్న ‘బాహుబలి’ సిరీస్ ను భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ మదిలో తరతరాలు గుర్తుంచుకుంటారని చెప్పవచ్చు. అయితే కొందరు తెలుగువారికి విచారం కలిగించే అంశం ఏదంటే, ‘బాహుబలి-2’ తెలుగు చిత్రం ఒరిజినల్. దానిని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’లో ప్రదర్శించక పోవడం. ఆ రోజున హిందీ వెర్షన్ ను ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించారు. మరి అలా జరగడానికి సాంకేతిక కారణాలు ఏమిటో ఇప్పటి దాకా ‘బాహుబలి’ బృందం తెలుపలేదు.

Show comments