Annadammula Savaal: సినిమా అంటేనే చిత్ర విచిత్రాలు సాగుతూ ఉంటాయి. తమ కంటే పెద్దవారికి తండ్రిగా నటించేవారూ కనిపిస్తుంటారు. తమ కన్నా చిన్నవారితో ఆడిపాడేవారూ ఉంటారు. రియల్ లైఫ్ లో రజనీకాంత్ కంటే కృష్ణ పెద్దవారు. కానీ, ‘అన్నదమ్ముల సవాల్’ చిత్రంలో కృష్ణకు అన్నగా రజనీకాంత్ నటించారు. తరువాతి రోజుల్లో ‘రామ్ రాబర్ట్ రహీమ్’లోనూ అదే ఫీట్ సాగింది. శ్రీసారథీ స్టూడియోస్ పతాకంపై కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో ‘అన్నదమ్ముల సవాల్’ చిత్రాన్ని జి.డి.ప్రసాదరావు, పర్వతనేని శశిభూషణ్ నిర్మించారు. 1978 మార్చి 3న విడుదలైన ‘అన్నదమ్ముల సవాల్’ విశేషాదరణ చూరగొంది.
‘అన్నదమ్ముల సవాల్’ కథ ఏమిటంటే- చిన్నప్పుడే తల్లి మందుల కోసం దొంగతనం చేస్తాడు కిశోర్. అది తప్పని వారిస్తాడు అన్న అశోక్. కిశోర్ దొంగతనం కారణంగా ఓ మనిషి ఉరివేసుకుంటాడు. ఆ డబ్బు తన తల్లికి పంపాలని ఆ వ్యక్తి కూడగట్టి ఉంటాడు. ఈ విషయం తెలిసిన అశోక్ ఆ ఇంటి అడ్రస్ వెదుక్కుంటూ వెళ్ళి, ఆ తల్లికి డబ్బు ఇచ్చి అసలు విషయం చెబుతాడు. తరువాత ఆ తల్లిని, ఆమె కూతురిని రంగబాబు పేరుతో అశోక్ పోషిస్తూ ఉంటాడు. బాబు చెల్లెలు జ్యోతి, కిశోర్ ను ప్రేమిస్తుంది. కష్టాల్లో ఉన్న లక్ష్మిని ఆదరించి, ఆమెను పెళ్ళాడతాడు బాబు. కొడుకు చనిపోయాడని తెలిసిన బాబు తల్లి మానసికంగా కుంగిపోయి ఉంటుంది. ఆమెకు వైద్యం చేయిస్తాడు బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు ఆమె కొడుకు కాదన్న విషయం తెలియకూడదని డాక్టర్ చెబుతాడు. జ్యోతితో కిశోర్ ఉండడం చూసిన బాబు అతనిపై చేయి చేసుకుంటాడు. ఆ పోరాటంలో బాబు పర్సు పోగొట్టుకుంటాడు. అందులో కిశోర్ తన తల్లి ఫోటో చూసి ఫాలో అవుతాడు. ఆ ఫోటో ఇవ్వమంటాడు కిశోర్. తన చెల్లెలు జ్యోతితో ఎప్పుడూ మాట్లాడనని మాట ఇస్తే, ఆ ఫోటో ఇస్తానని అంటాడు బాబు. మాట ఇచ్చి ఫోటో తీసుకుంటాడు కిశోర్. లక్ష్మిని దక్కించుకోవాలనుకున్న ఓ రౌడీ అది కుదరక పోవడంతో బాబుపై పగబడతాడు. ఆ ఊరికి వచ్చిన ఓ పెద్ద కేడీతో చేయి కలుపుతాడు. వాడి మనుషులు రంగబాబు ఎస్టేట్ పై దాడి చేస్తారు. జ్యోతికి కిశోర్ దూరంగా జరుగుతూ ఉండడంతో నిలదీస్తుంది. కారణం తన అన్న అని తెలుసుకుంటుంది. రంగబాబు తల్లికి అసలు విషయం తెలుస్తుంది. కొడుకు త్యాగమూర్తి అని జ్యోతికి చెబుతుంది. తమ కుటుంబం కోసం బాబు సొంత తమ్ముడినే కాదనుకున్నాడన్న విషయాన్నీ వివరిస్తుంది తల్లి. లక్ష్మిని రౌడీలు ఎత్తుకు పోతారు. అది కిశోర్ చేశాడని రంగ భావిస్తాడు. ఇద్దరూ తలపడతారు. తల్లి ఫోటో చూసి కిశోర్ బాబుని వదిలేస్తాడు. అప్పుడే బాబు అసలు విషయం చెబుతాడు. ఇద్దరూ ఒకటవుతారు. ఆ విషయం తెలిసిన రౌడీ ముఠా జ్యోతి, ఆమె తల్లిని కూడా ఎత్తుకు వస్తారు. కిశోర్, అశోక్ వెళ్ళి పోరాడి వారిని విడిపిస్తారు. కిశోర్, జ్యోతి పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
ఇందులో చిన్నప్పటి కృష్ణగా ఆయన పెద్దకొడుకు రమేశ్ బాబు కాసేపు కనిపించడం విశేషం! చలం, జయచిత్ర, చంద్రకళ, అల్లు రామలింగయ్య, త్యాగరాజు, మిక్కిలినేని, ప్రభాకర్, భీమరాజు, అంజలీదేవి, జయమాలిని, హలం, స్వాతి నటించిన ఈ చిత్రానికి సుందరమ్ కథను అందించారు. కన్నడలో ‘సహోదరర సవాల్’గా రూపొంది విజయం సాధించిన ఇదే కథతో తెలుగులో ఈ సినిమా తెరకెక్కింది. అక్కడా ఇక్కడా రజనీకాంత్ తన పాత్రను తానే పోషించగా, రెండు భాషల్లోనూ కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించారు. రెండు భాషలకూ సత్యం సంగీతం సమకూర్చారు. తెలుగు చిత్రానికి త్రిపురనేని మహారథి మాటలు రాశారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి, డాక్టర్ దాశరథి, వేటూరి, కొసరాజు పాటలు పలికించారు. ఇందులోని “నా కోసమే నీవున్నది…”, “నీ రూపమే…”, “గువ్వ గూడెక్కె…”, “ఓ పిల్లా… చలి చలిగా ఉందే…”, “నేర్పమంటావా…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. తెలుగులోనూ ‘అన్నదమ్ముల సవాల్’ కమర్షియల్ సక్సెస్ సాధించింది. శతదినోత్సవం జరుపుకుంది.