నటభూషణ శోభన్ బాబు, లక్ష్మి జంటగా రూపొందిన పలు చిత్రాలు జనాన్ని రంజింప చేశాయి. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వారిద్దరూ నటించిన ‘ప్రేమమూర్తులు’ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో మరో నాయికగా రాధ నటించారు. ఓ కీలక పాత్రలో మురళీమోహన్ కనిపించారు. శ్రీరాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిద్దే రామారావు నిర్మించారు. 1982 ఏప్రిల్ 21న విడుదలైన ‘ప్రేమమూర్తులు’ మంచి విజయం సాధించింది.
కథ విషయానికి వస్తే- గోపాలరావు అనే ధనికుని కూతురు జ్యోతి. మెడిసిన్ చదువుతూ ఉంటుంది. తాను కోరుకున్నది తనకు దక్కాలని తపించే అమ్మాయి. కిరణ్ ఓ మధ్య తరగతి కుర్రాడు. అనాథ అయిన మురళిని చేరదీస్తాడు కిరణ్. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కిరణ్, జ్యోతి ప్రేమించుకుంటారు. వారి ప్రేమను తొలుత ఆమె తండ్రి కాదన్నా, ఆమె పట్టుదల చూసి చివరకు అంగీకరిస్తాడు. పెద్ద పార్టీ ఏర్పాటు చేసి మరీ తన కాబోయే అల్లుడిగా కిరణ్ ను మిత్రులకు పరిచయం చేస్తాడు. పైచదువులకు జ్యోతి విదేశాలకు వెళ్తుంది. వచ్చాక కిరణ్, జ్యోతి పెళ్ళి అనుకుంటారు. రాధ పెళ్ళి చేయడమే ఆమె తల్లికి ఉన్న పెద్ద బాధ్యత. రాధను ఆమె ఊళ్ళోనే జులాయి వెధవ నామాల నారాయణ ప్రేమిస్తాడు. ఆమె చీకొట్టడంతో పగబడతాడు. రాధ దురదృష్టజాతకురాలనీ, ఆమెను పెళ్ళాడితే పైకి పోవలసిందే అంటూ ప్రచారం చేస్తూ పెళ్ళి కాకుండా చేస్తుంటాడు. ఇవేవీ లెక్క చేయని మురళి, రాధను పెళ్ళాడతానంటాడు. పెళ్ళి సమయానికి మురళికి యాక్సిడెంట్ అవుతుంది. చనిపోయే ముందు మిత్రుడు కిరణ్ తో “ధనవంతురాలయిన జ్యోతిని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారని, రాధను పెళ్ళాడి ఆమెకు జీవితం ప్రసాదించమని” కోరతాడు మురళి. మిత్రుడంటే ప్రాణం పెట్టే కిరణ్ అందుకు అంగీకరించి, రాధను పెళ్ళాడతాడు. విదేశాల నుండి ‘పిడియాట్రిషియన్’గా తిరిగి వచ్చిన జ్యోతికి ఈ విషయం తెలిసి గగ్గోలు పెడుతుంది. తరువాత నుంచీ కిరణ్ పై పగ పెంచుకుంటుంది. అతనికి నిలువ నీడలేకుండా చేస్తుంది. చివరకు కిరణ్ కొడుకు పసివాడికి వైద్యం చేయలేకపోతుంది. కానీ, ఆ పసివాడు బాగోలేడన్న విషయం జ్యోతికి తెలియకుండా ఓ నీచుడు అడ్డు పడి ఉంటాడు. నిజంగానే తనకు తెలియదని చెబుతుంది చివరకు తండ్రి కూడా నమ్మడు. దాంతో ఆ పసివాడు చనిపోతాడు. ఆ సమయంలో కిరణ్, జ్యోతిని నానా మాటలు అంటాడు. మనిషివే కాదనీ అని వెళ్ళిపోతాడు. గోపాలరావు కూడా ఎంతో బాధపడి, అప్పుడు జ్యోతికి అసలు విషయం చెబుతాడు. “చిన్నప్పటి నుంచీ నిన్ను ఐశ్వర్యంలో పెంచడమే తన తప్పని, దుర్మార్గంగా కిరణ్ ను కష్టాల పాలు చేస్తున్నా అడ్డుకోకపోవడమూ తన తప్పేనని అంటాడు. అన్నిటినీ మించి, పిల్లలు లేని తాను అనాథవైన నిన్ను చేరదీయడం మరింత తప్పనీ చెబుతాడు. ” దాంతో జ్యోతిలో మానవత్వం చిగురిస్తుంది. రాధ చనిపోవాలనుకుంటుంది. ఆమెను జ్యోతి కాపాడి ప్రాణం పోస్తుంది. కిరణ్ జీవితానికి దూరంగా వెళతానని చెప్పి విదేశాలకు వెళ్తుంది జ్యోతి. ఆమె మంచితనం తెలుసుకున్న కిరణ్, రాధ ఎయిర్ పోర్ట్ లో ఆమెకు చివరి సారిగా వీడ్కోలు పలకడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, హేమసుందర్, కె.కె.శర్మ, మల్లాది, ధమ్, కొడాలి ఉమామహేశ్వరరావు, నిర్మల, ఝాన్సీ, జయలత, శ్రీలక్ష్మి తదితరులు నటించారు. ఈ చిత్రానికి భీశెట్టి లక్ష్మణరావు కథను సమకూర్చగా, సత్యానంద్ మాటలు రాశారు. చక్రవర్తి బాణీలకు ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, వేటూరి పాటలు పలికించారు. “చెంపకు చారెడు కళ్ళు….”, “మావారు బంగారు కొండ…”, “సిరిసిరి మువ్వల నవ్వు…”, “తారక చెప్పదు ఏ నాడూ…”, “చిటారు కొమ్మన చిన్నారి గువ్వల గూడుంది…”, “ఊరుకో… ఏడవకు ఊరుకో…” వంటి పాటలు అలరించాయి.
ఈ సినిమా కథ చూస్తే, 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాలో గుమ్మడి, జమున ఎపిసోడ్ గుర్తుకు రాకమానదు. అదే అంశమే అయినా, దీనిని కోదండరామిరెడ్డి అప్పటి ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించారు. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.
