NTV Telugu Site icon

Gopala Krishnudu: నాలుగు పదుల ‘గోపాలకృష్ణుడు’

Anr

Anr

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో ఏ.కోదండరామిరెడ్డి రూపొందించిన తొలి చిత్రం ‘గోపాలకృష్ణుడు’. ఈ చిత్రం 1982 జూలై 1న జనం ముందు నిలచింది. ‘గోపాలకృష్ణుడు’ కథ ఏమిటంటే – డాక్టర్ మూర్తికి ఏకైక సంతానం గోపాలకృష్ణ. పేరుకు తగ్గట్టే అమ్మాయిలతో ఆడుతూ పాడుతూ తిరుగుతుంటాడు గోపాలకృష్ణ. వృత్తిలో తీరికలేని డాక్టర్ మూర్తికి కొడుకు చిలిపి చేష్టలు అంతగా తెలియవు. సుజాత అనే మధ్య తరగతి అమ్మాయిని బుట్టలో వేసుకోవాలని చూస్తాడు గోపాలకృష్ణ. కానీ, ఆ అమ్మాయి అతని డాబుకు లొంగదు. చిత్రంగా ఆ సుజాత, డాక్టర్ మూర్తి చెల్లెలు కూతురు. కొన్ని కారణాల వల్ల విడిపోయిన మూర్తి, ఆయన చెల్లెలు మళ్ళీ కలుసుకుంటారు. చనిపోతూ, తన కూతురు సుజాత బాధ్యతను అన్న డాక్టర్ మూర్తికి అప్పగిస్తుందామె. తరువాత సుజాతను ఇంటికి తీసుకు వస్తాడు మూర్తి. సుజాతనే కోరుకుంటున్న గోపాలకృష్ణ తండ్రి ఇష్టప్రకారం ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. హాయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఓ రోజు రాధ అనే కంటిచూపు కోల్పోయిన అమ్మాయిని డాక్టర్ మూర్తి తీసుకు వస్తారు. ఆమెను గోపి ప్రేమ పేరుతో మోసం చేసి ఉంటాడు. సుజాత, రాధ మధ్య స్నేహం నెలకొంటుంది. రాధకు చూపు వచ్చేలా చేయాలని డాక్టర్ మూర్తి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే సుజాతకు లివర్ కేన్సర్ ఉందని తేలుతుంది. కంటిచూపు లేకపోయినా రాధ, గోపిని గుర్తు పడుతుంది. నిలదీస్తుంది. వారి మధ్య సాగిన సంభాషణను సుజాత వింటుంది. తాను చనిపోతూ, తన కళ్ళను రాధకు దానం చేస్తుంది సుజాత. చివరకు గోపి, రాధను కలిపి కన్నుమూస్తుంది.

ఏయన్నార్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో జయసుధ, రాధ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, రమాప్రభ, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, సుభాషిణి, హలం, అత్తిలి లక్ష్మి, ఝాన్సీ, డబ్బింగ్ జానకి నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. వేటూరి పాటలు పలికించగా, చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని “అమ్మచాటు పిల్లాడిని..”, “బంతులా చేమంతులా..”, “అందాల రాధికా..”, “జ్ఞాపకం ఉన్నదా..”, “గోదారి గట్టంటా..”, “గుడిలోపలి దైవమా..” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రాన్ని భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ముందు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో భీమవరపు బుచ్చిరెడ్డి ‘సప్తపది’ చిత్రం నిర్మించి, నిర్మాతగా మంచి పేరు సంపాదించారు. అందరూ ఆయనను ‘సప్తపది’ బుచ్చిరెడ్డి అనేవారు.

ఈ సినిమాకు సరిగా 34 రోజుల ముందుగా యన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటించిన ‘జస్టిస్ చౌదరి’ విడుదలై విజయవిహారం చేస్తోంది. అంతకు ముందు సంవత్సరం యన్టీఆర్ ‘కొండవీటి సింహం’, ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. వారిద్దరిమధ్య నెలకొన్న పోటీ కారణంగా ‘జస్టిస్ చౌదరి’ స్థాయిలో ‘గోపాలకృష్ణుడు’ కూడా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి బర్త్ డే అయిన జూలై 1ననే ఈ సినిమా విడుదల కావడం విశేషం! కాగా, ‘గోపాలకృష్ణుడు’ సినిమా ఆ తరువాత ఎనిమిది రోజులకు వచ్చిన యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ ముందు నిలువ లేకపోయింది. ఈ సినిమా తరువాత ఏయన్నార్ తో నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి, జంధ్యాల దర్శకత్వంలో ‘అమరజీవి’ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏ.కోదండరామిరెడ్డి కథను తెరకెక్కించే తీరు నచ్చిన ఏయన్నార్ తరువాత తమ ‘శ్రీరంగనీతులు’ చిత్రానికి ఆయననే దర్శకునిగా ఎంచుకున్నారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆపై ఏయన్నార్ తో కోదండరామిరెడ్డి రూపొందించిన ‘అనుబంధం’ కూడా విజయపథంలో పయనించింది.