Bandhalu- Anubandhalu: నటభూషణ శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి కొన్ని చిత్రాలలో నటించారు. ‘చండీప్రియ’లో శోభన్ బాబుకు తమ్మునిగా చిరంజీవి నటించగా, ‘మోసగాడు’లో శోభన్ హీరో, చిరంజీవి విలన్ గా అభినయించారు. ఆ తరువాత వారిద్దరూ నటించిన చిత్రం ‘బంధాలు – అనుబంధాలు’. ఈ చిత్రానికి ఆధారం కన్నడలో లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అవళ హెజ్జె’ చిత్రం. విష్ణువర్ధన్ హీరోగా రూపొందిన ఈ చిత్రం కన్నడ నాట మంచి విజయం సాధించింది. తెలుగులోనూ లక్ష్మి ప్రధాన పాత్రగా ‘బంధాలు-అనుబంధాలు’ తెరకెక్కింది.
లక్ష్మికి హిట్ పెయిర్ గా నిలచిన శోభన్ బాబును హీరోగా ఎంచుకున్నారు. కాగా, కీలక పాత్రలో రంగనాథ్ ను తీసుకున్నారు. అప్పటికే లక్ష్మికి తమ్మునిగా చిరంజీవి నటించిన ‘చట్టానికి కళ్ళులేవు’ సినిమా ఘనవిజయం సాధించింది. దీంతో చిరంజీవిని ఇందులో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వమని నిర్మాత మోహన్ కోరడంతో ఆయన అంగీకరించారు.
ఇక ఈ ‘బంధాలు-అనుబంధాలు’ కథ ఏమిటంటే – సీత జైలు నుండి విడుదలై బయటకు వస్తుంది. ఆమెను రంగ తరుముతూ వస్తాడు. అతని నుండి తప్పించుకోవడానికి మానసిక వికలాంగులను బాగు చేసే డాక్టర్ రాంబాబు ఇంట్లోకి వెళ్తుంది. అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఆయన నయం చేస్తాడు. ఆశ్రయమిస్తాడు, తరువాత పెళ్ళి చేసుకుంటారు. డాక్టర్ రాము వద్ద కాంపౌండర్ గా పనిచేసే గోపి, సీతను ఎంతో గౌరవిస్తూ ఉంటాడు. రంగ, సీత జాడ తెలుసుకొని వచ్చి, ఎలాగైనా తనకు లొంగమంటాడు. దాంతో భర్త రివాల్వర్ తో అతడిని కాలుస్తుంది. తలకు బుల్లెట్ తగిలి పడిపోయిన రంగ బాడీని, గోపి సాయంతో ఏట్లో పడేసి వస్తుంది. అతనికి తన గతం వివరిస్తుంది సీత. గోపి ఆమెకు ఎంతో ధైర్యం చెబుతాడు. చిత్రంగా రంగను రాము ఆసుపత్రికి తీసుకు వస్తారు. ఆయన బాగు చేస్తాడు. కానీ, రంగకు గతం గుర్తుండదు. తన రివాల్వర్ లో ఓ బుల్లెట్ ఏమయిందని రాము భార్యను అడుగుతాడు. ఆమె కంగారు పడుతుంది. ఇక రంగాను ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ వెంటాడుతూ ఉంటాడు. అతను డాక్టర్ వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రంగ మతిపోయినట్టు నటిస్తున్నాడని అనుమానిస్తూంటాడు. అసలు రంగాకు ఎలా గాయమైందన్న అనుమానమూ కలుగుతుంది. ఇంట్లో ఉన్నవారిని విచారిస్తూ ఉంటాడు ఇన్ స్పెక్టర్. రాము, సీత కూతురు బేబీని కూడా అడుగుతాడు. ఇలా ఉండగా, రంగాకు గతం గుర్తుకు వస్తుంది. సీతను మళ్ళీ వెంటాడతాడు. అదే ఇంట్లో ఉన్న ఓ ఫోటో చూసి, అది తన తల్లి, తమ్ముడితో చిన్నతనంలో తానున్న ఫోటో అని గుర్తిస్తాడు. దాంతో డాక్టర్ తన తమ్ముడని తెలుసుకుంటాడు రంగ. డాక్టర్ కు కూడా ఈ విషయం తెలుస్తుంది. అతను సంతోషంగా పోలీస్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ చేసి, రంగాకు గతం గుర్తుకు వచ్చిందని, రావచ్చునని అంటాడు. రంగ అది విని పారిపోతాడు. అతడిని ఇన్ స్పెక్టర్ అడ్డగిస్తాడు. అతని చేతిలోని రివాల్వర్ ను రంగ పట్టేస్తాడు. మిమ్మల్నందరినీ చూసిన తరువాత జీవితంలో తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు రంగ చెబుతాడు. తనను తాను కాల్చుకొని, తనకు అన్యాయం జరగడానికి తానే బాధ్యుడినని చెబుతూ రంగ కన్నుమూస్తాడు. అన్న పోయినందుకు డాక్టర్ ఏడుస్తూ ఉండగా కథ ముగుస్తుంది.
ఇందులో శోభన్ బాబు, లక్ష్మి జంటగా నటించగా, ఇన్ స్పెక్టర్ పాత్రలో చిరంజీవి కనిపించారు. రంగనాథ్, జగ్గయ్య, మాడా, పద్మనాభం, బాలకృష్ణ, కళ్యాణం, ఉమా మహేశ్వరరావు, పండరీబాయి, బేబీ సీతాలక్ష్మి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు రామకృష్ణరాజా రాయగా, ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ పాటలు పలికించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని భార్గవ దర్శకత్వంలో మోహన్ నిర్మించారు. ఇందులోని “సరి సరి గమ గమ పద పద నీ..”, “నాకు తెలుసు.. నీకు తెలుసు..”, “ఉన్నాడమ్మా దేవుడు..” అంటూ సాగే పాటలు అలరించాయి. కన్నడలో ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో రూపొంది, అధిక రాబడి చూసింది. కానీ, తెలుగులో అంతగా ఆకట్టుకోలేక పోయింది.