NTV Telugu Site icon

30 ఏళ్ళ ‘సాజన్’

(ఆగస్టు 30తో ‘సాజన్’కు 30 ఏళ్ళు పూర్తి)

ప్రముఖ హిందీ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ హిట్ ‘సాజన్’. మాధురీ దీక్షిత్ నాయికగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించారు. నదీమ్-శ్రవణ్ స్వరకల్పనలో రూపొందిన ‘సాజన్’ పాటలన్నీ ఎంతగానో అలరించాయి. ఈ చిత్రాన్ని సుధాకర్ బొకాడియా నిర్మించారు. 1991 ఆగస్టు 30న విడుదలైన ‘సాజన్’ ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలచింది.

‘సాజన్’ కథలోకి తొంగి చూస్తే – అమన్ అంటే ఆకాశ్ కు చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టం. అమన్ అనాథ, పైగా వికలాంగుడు. దాంతో ఆకాశ్ కన్నవారు అతణ్ణి కూడా చేరదీస్తారు. ఏ లాంటి భేదం లేకుండా ఇద్దరినీ ఒకేలా చూస్తారు. అమన్ పెరిగి పెద్దవాడై ఓ కవిగా మారతాడు. ఆకాశ్ ప్లేబోయ్ గా అల్లరి చేస్తూంటాడు. ‘సాగర్’ కలం పేరుతో అమన్ పాటలు రాస్తూ ఉంటాడు. వాటిని ఆరాధించే అభిమాని గాయని పూజా సక్సేనా. ఆ పాటలతోనే పూజకు ఎంతో పేరు లభిస్తుంది. ఆమెపై అమన్ మనసు పారేసుకుంటాడు. ఈ విషయం మిత్రునితో చెప్పాలనుకుంటాడు కానీ, చెప్పలేడు. అదే సమయంలో ఆకాశ్ తాను కూడా పూజాను ప్రేమిస్తున్నట్టు చెబుతాడు. దాంతో ఆకాశ్ నే ‘సాగర్’గా నటించమని అమన్ తన కవితలు అతని నోట పలికిస్తూ ఉంటాడు. ఆకాశ్ ను సాగర్ అని భావించి పూజా కూడా ప్రేమిస్తుంది. అయితే చివరకు అమన్ తన కోసం అలా చేశాడని తెలుసుకుంటాడు ఆకాశ్జ అసలు విషయం పూజాకు చెప్పి, అమన్ ను ఆమెను కలిపి, ఆకాశ్ నిష్క్రమించడంతో కథ ముగుస్తుంది.

ఆకాశ్ గా సల్మాన్ ఖాన్, అమన్ గా సంజయ్ దత్, పూజాగా మాధురీ దీక్షిత్ నటించిన ఈ చిత్రంలో ఖాదర్ ఖాన్, రీమా లాగూ, ఏక్తా సోహినీ, లక్ష్మీకాంత్ బెర్డే, అంజనా ముంతాజ్, రాజు శ్రేష్ట్, తేజ్ సప్రూ నటించారు. దర్శకుడు లారెన్స్ డిసౌజా “దేఖా హై పెహ్లీ బార్…” పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇక ప్రఖ్యాత గాయకుడు పంకజ్ ఉదాస్ “జియే తో జియే కైసే…” పాట పాడుతూ కనిపిస్తారు. రీమా రాకేశ్ నాథ్ రాసిన కథలో తొలుత అమన్ పాత్ర కోసం ఆమిర్ ఖాన్ ను అనుకున్నారు లారెన్స్ డిసౌజా. అయితే కథ విన్న తరువాత ఆమిర్ తాను అమన్ కేరెక్టర్ కు కనెక్ట్ కాలేక పోతున్నానని చెప్పాడు. దాంతో ఆ పాత్రలో సంజయ్ దత్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాతో మాధురీ దీక్షిత్ కు విశేషమైన పేరు లభించింది. ముఖ్యంగా డాన్సుల్లో అదరహో అనిపించింది.

ఈ చిత్రంలోని “పెహ్లీ బార్ మిలే హై…” పాటను ఫయాజ్ అన్వర్ రాయగా, మిగిలిన పది పాటలను సమీర్ పలికించారు. నదీమ్ -శ్రవణ్‌ స్వరకల్పనలో రూపొందిన అన్ని పాటలూ విశేషంగా ఆకట్టుకున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘మైనే ప్యార్ కియా’లో ఆయనకు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగానం చేశారు. అదే తీరున ఈ చిత్రంలోని సల్మాన్ పాటలన్నిటినీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడటం విశేషం. “బహుత్ ప్యార్ కర్తీ హై…” పాటను మేల్ వర్షన్ బాలు పాడగా, ఫిమేల్ వర్షన్ ను అనురాధ పడ్వాల్ గానం చేశారు. ఇక ఇదే పాటను యుగళంగా కూడా బాలు, అనురాధ కలసి పాడారు. “జియే తో జియే కైసే…” పాటను తొలుత పంకజ్ ఉదాస్ పాడతారు. తరువాత మేల్ వర్షన్ ను బాలు, ఫిమేల్ వర్షన్ అనురాధ ఆలపించారు. కుమార్ సను, అల్కా యాగ్నిక్ పాడిన “మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై…” పాట కూడా అలరించింది. “దేఖా హై పెహ్లీ బార్…” సాంగ్ ను బాలుతో కలసి అల్కా గానం చేశారు. “తుమ్సే మిల్నేకీ తమన్నా హై…”, “పెహ్లీ బార్ మిలే హై…” పాటలను బాలు సోలోగా పాడారు. “తూ షాయర్ హై…” పాటను అల్కా యాగ్నిక్ సోలోగా ఆలపించారు. ఈ సినిమా ద్వారా నదీమ్-శ్రవణ్ కు ఉత్తమ సంగీత దర్శకత్వం విభాగంలో ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. “మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై…” పాటతో ఉత్తమ గాయకునిగా కుమార్ సను ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

‘సాజన్’ చిత్రం ఆ రోజుల్లో మూడు కోట్ల రూపాయలతో నిర్మితమై, బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే దాదాపు 500 కోట్ల రూపాయలతో సమానం అని చెప్పవచ్చు.
ఈ కథలో ఇద్దరు మిత్రులు ఒకరికోసం ఒకరుత్యాగం చేస్తారు. ఇదే లైన్ ను తీసుకొని ఇద్దరు అమ్మాయిలు ఒకరికోసం ఒకరు త్యాగం చేసే కథను తెలుగులో ‘అల్లరి ప్రియుడు’గా రూపొందించారు. హిందీలో హీరోయిన్ గాయని కాగా, తెలుగులో హీరో గాయకుడు. అక్కడలాగే, తెలుగులో అనాథ అయిన అమ్మాయి పాటలు రాస్తూ ఉంటుంది. కథను తెలుగు నేటివిటీకి మార్చి, కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. తెలుగులోనూ ‘అల్లరి ప్రియుడు’ ఘనవిజయం సాధించడం విశేషం. అలాగే ఆ తర్వాత ఇదే కథతో ఉదయ్ కిరణ్ హీరోగా ‘నీ స్నేహం’ చిత్రాన్ని తెరకెక్కించారు ఎం.ఎస్.రాజు. ఇదీ విజయం సాధించటం గమనార్హం.