NTV Telugu Site icon

30 ఏళ్ల కిల్ల‌ర్

Killer

(జ‌న‌వ‌రి 10తో నాగార్జున కిల్ల‌ర్కు 30 ఏళ్ళు)
జ‌గ‌ప‌తి ఆర్ట్ పిక్చ‌ర్స్ సంస్థ అధినేత వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ కు అక్కినేని నాగేశ్వ‌ర రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. త‌మ బ్యాన‌ర్ లో ఏయ‌న్నార్ హీరోగా అనేక సూప‌ర్ హిట్స్ అందించారు వి.బి.రాజేంద్రప్ర‌సాద్. అలాగే ఏయ‌న్నార్ న‌ట‌వార‌సుడు నాగార్జున హీరోగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కెప్టెన్ నాగార్జున‌ నిర్మించారు రాజేంద్ర‌ప్ర‌సాద్. ఆ సినిమా అంత‌గా అల‌రించ‌లేక పోయింది. నాగార్జున‌తో రాజేంద్ర‌ప్ర‌సాద్ నిర్మించిన మ‌రో చిత్రం కిల్ల‌ర్. ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ‌ళ‌యాళీ ద‌ర్శ‌కుడు ఫాజిల్ డైరెక్ట‌ర్. అప్ప‌ట్లో న‌గ్మా అందం జ‌నానికి శ్రీ‌గంధాలు పూస్తూ ఉండేది. ఆమె ఇందులో నాయిక‌. ఇళ‌య‌రాజా స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన కిల్ల‌ర్ 1992 జ‌న‌వ‌రి 10న జ‌నం ముందు నిల‌చింది. అదే రోజున ఇళ‌యరాజా సంగీతంలోనే రూపొందిన చంటి కూడా విడుద‌ల‌యింది. రెండూ మ్యూజిక్ తో అల‌రించాయి.

కిల్ల‌ర్ క‌థ విష‌యానికి వ‌స్తే – మేరీ అనే న‌ర్సు వ‌ద్దకు ఓ గ‌ర్భ‌వ‌తి వ‌స్తుంది. ఆమెను గూండాలు త‌ర‌ముతూ ఉంటారు. మేరీ ఆమెకు పురుడు పోస్తుంది. బిడ్డ‌ను క‌ని ఆమె చ‌నిపోతుంది. దాంతో మేరీనే ఆ బాబుకు ఈశ్వ‌ర్ అని పేరు పెట్టి పెంచుతుంది. మేరీ కూతురు న్యాన్సీ. త‌మ కుటుంబాన్ని పోషించుకోవ‌డానికి ఈశ్వ‌ర్ త‌ప్పుడు దారుల్లో సాగుతూ ఉంటాడు. న్యాన్సీ ప్రేమించి పెళ్ళి చేసుకొని, ఓ బిడ్డ‌కు త‌ల్లి అవుతుంది. చెల్లెలికి ధ‌న‌సాయం చేస్తూ ఉంటాడు ఈశ్వ‌ర్. డ‌బ్బు బాగా సంపాదించాల‌ను కుంటాడు. ఓ ధ‌న‌వంతుడు, త‌న చెల్లెలిని ఆమె ఇంట్లో ఉన్న‌వారిని చంపేస్తే కోరినంత ధ‌నం ఇస్తానంటాడు. ఆ కాంట్రాక్ట్ అంగీక‌రిస్తాడు. అందులో భాగంగా కోటీశ్వ‌రురాలైన మాళవిక ఇంట్లోకి ప్ర‌వేశించ‌డానికి ప్లాన్ వేస్తాడు. మాళ‌విక‌కు ద‌గ్గ‌ర బంధువైన ప్రియ అనే అమ్మాయిని ప్రేమ‌లోకి దింపి ఆమె ద్వారా మాళ‌విక ఇంట్లో అడుగు పెడ‌తాడు. మాళ‌విక చిన్న త‌మ్మునికూతురు నేహ‌. చిన్న పాప‌, ఆమెను చంప‌డానికే కాంటాక్ట్ తీసుకొని ఉంటాడు ఈశ్వ‌ర్. మాళ‌విక ఇంట్లోమాత్రం త‌న పేరు కృష్ణ‌కుమార్ అని చెబుతాడు.

కొద్ది రోజుల‌కే ప‌సిపాప‌, మాళ‌విక‌కు ద‌గ్గ‌ర‌వుతాడు ఈశ్వ‌ర్. వారిని చంప‌డం ఇష్టం లేక మేలు చేస్తాడు. కానీ, అత‌నికి కాంటాక్ట్ ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తారు. దాంతో పాప‌ను కిడ్నాప్ చేసుకువెళ్తాడు ఈశ్వ‌ర్. అత‌ని ఇల్లు తెలుసుకొని, వారిఇంట్లో వాళ్ల‌ను చంపాల‌నుకుంటుంది మాళ‌విక‌. అక్క‌డే మేరీ ద్వారా ఆ ఈశ్వ‌ర్ త‌న అన్న‌కొడుకు అనితెలుసుకుంటుంది మాళ‌విక‌. ఆ త‌రువాత దుర్మార్గుల బారి నుండి ఈశ్వ‌ర్, మాళ‌విక‌ను, పాప‌ను ర‌క్షిస్తాడు. చివ‌ర‌కు ఈశ్వ‌ర్ త‌న మేన‌ల్లుడు అని మాళ‌విక చెబుతుంది.అంద‌రూ ఆనందించ‌డంతో క‌థ ముగుస్తుంది.

ఈ చిత్రంలో శార‌ద‌, బేబీ షామిలీ, అన్న‌పూర్ణ‌, తుల‌సి, విజ‌య్ కుమార్, అల్లు రామలింగ‌య్య‌, నిర్మ‌ల‌మ్మ‌, బ్ర‌హ్మానందం, ఆహుతి ప్ర‌సాద్, బెన‌ర్జీ, గిరిబాబు, చిట్టిబాబు, రమాప్ర‌భ‌, జ్యోతి న‌టించారు. ఈ చిత్రానికి జంధ్యాల సంభాష‌ణ‌లు రాశారు. వేటూరి పాట‌లు ప‌లికించారు. ఇందులోని ప్రియా ప్రియ‌త‌మా రాగాలు...స‌ఖీ కుశ‌ల‌మా అందాలు... పాట అప్ప‌ట్లో కుర్రకారును విశేషంగా ఆక‌ట్టుకుంది. రంభ‌ల‌కి రంజు..., ఉక్కిరి బిక్కిరి...., ఓ ర‌బ్బీ... ఏం దెబ్బ‌....,సిందూర‌పు పూదోట‌లో..., పిలిచే కుహూ కుహూ... పాట‌లు అల‌రించాయి. కిల్ల‌ర్ చిత్రం వంద రోజులు చూసింది.