NTV Telugu Site icon

పాతికేళ్ళ ఎగిరే పావుర‌మా

స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చూడ‌త‌గ్గ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మేటి అనిపించుకున్నారు ద‌ర్శకులు, సంగీత ద‌ర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయ‌న రూపొందించిన చిత్రాలు, వాటిలో స్వయంగా స్వర‌క‌ల్పన చేసిన గీతాలు తెలుగువారిని విశేషంగా అల‌రించాయి. ఏది చేసినా, జ‌నానికి వినోదం పంచాల‌న్న‌దే కృష్ణారెడ్డి ల‌క్ష్యంగా సాగారు. మ‌ళ‌యాళంలో అల‌రించిన స‌ల్లాపం చిత్రం ఆధారంగా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శక‌త్వంలో ఎగిరే పావుర‌మా చిత్రం వెలుగు చూసింది. శ్రీ‌స్రవంతి మూవీస్, చంద్రకిర‌ణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పి.ఉషారాణి నిర్మాత‌గా వ్యవ‌హ‌రించారు. జె.డి.చ‌క్రవ‌ర్తి, శ్రీ‌కాంత్, లైలా ప్రధాన పాత్రల‌లో తెర‌కెక్కిన ఎగిరే పావుర‌మా చిత్రం 1997 జ‌న‌వ‌రి 30న విడుద‌ల‌యింది. విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే – జ్యోతి పేద‌మ్మాయి. తాగుబోతు తండ్రి, ప్రేమించే అమ్మమ్మ, ఆమె అంటే ప్రాణం పెట్టే మేన‌మామ ఉంటారు. వీరికి తోడు జ్యోతిని క‌న్నబిడ్డలా చూసుకొనే ఓ మంచిమ‌న‌సున్న దేవ‌త కూడా ఉంటుంది. వీరంద‌రి న‌డుమ ఎగిరే పావురంలా దిగులు ఎరుగ‌కుండా జ్యోతి సాగుతూఉంటుంది. ఆమె ఉండే ఊరికి జూనియ‌ర్ బాలును అని చెప్పుకొనే గాయ‌కుడు వ‌స్తాడు. జ్యోతి అభిలాష కూడా త‌న పాట ప‌దిమందికి చేరాల‌న్నదే. బాలు, జ్యోతి మ‌న‌సులూ క‌లుస్తాయి. త‌న మ‌న‌వ‌రాలిని ఎలాగైనా త‌న కొడుక్కిచ్చి పెళ్ళి చేయాల‌ని జ్యోతి అమ్మమ్మ అభిలాష‌. బాలు కూడా పేద‌వాడే కావ‌డంతో ముందు జీవితంలో స్థిర‌ప‌డ్డాక పెళ్ళి అనుకుంటారు. ఈ లోగా జ్యోతిని ఎంతో ఆప్యాయంగా చూసుకొనే దేవ‌త భ‌ర్త రాక్షసుడిలా జ్యోతినే చెర‌ప‌ట్టాల‌ని చూస్తాడు. జ్యోతి మేన‌మామ వాడికి త‌గిన శాస్తి చేస్తాడు. వాడి భార్య మంచి త‌నం చూసి చంప‌కుండా వ‌ద‌లేస్తాడు.
తాను జ్యోతిని ఎంత‌గా ప్రేమించినా, ఆమె మ‌న‌సులో త‌న‌కు కేవ‌లం ఓ మేన‌మామ‌గానే స్థానం ఉంద‌ని, ఆమె బాలును ప్రేమిస్తుంద‌ని తెలుసుకుంటాడు ఆమె మామ‌. దాంతో బాలు,జ్యోతి ప్రేమ ఫ‌లించాల‌ని వారిని ఒక‌టిగా చేసి, తాను ఎప్పటిలాగే న‌వ్వుతూ త‌న ప‌నిలోకి వెళ‌తాడు జ్యోతి మేన‌మామ‌.

ఇందులో సుహాసిని, చ‌ర‌ణ్ రాజ్, నిర్మల‌మ్మ, కోట శ్రీ‌నివాస‌రావు, బ్రహ్మానందం, బాబూ మోహ‌న్, తనికెళ్ళ భ‌ర‌ణి, శివాజీరాజా, చిట్టిబాబు, గుండు హ‌నుమంత‌రావు, క‌ళ్ళు చిదంబ‌రం, గౌత‌మ్ రాజు, సుబ్బ‌రాయ శ‌ర్మ‌, జెన్నీ, శ్రీ‌ల‌క్ష్మి, ఝాన్సీ, క‌ల్పన‌, వై.విజ‌య‌, బేబీ స్రవంతి, మాస్టర్ సిద్ధార్థ్ న‌టించారు. ఈ చిత్రానికి లోహిత్ దాస్ రాసిన క‌థ ఆధారం కాగా, మ‌రుధూరి రాజా మాట‌లు రాశారు. వేటూరి, భువ‌న‌చంద్ర, సిరివెన్నెల పాట‌లు ప‌లికించారు. ఇందులోని ఎగిరే పావుర‌మా..., మాఘ‌మాసం ఎప్పుడొస్తుందో..., రూనా లైలా..., దిసీజ్ ద రిథ‌మ్ ఆఫ్ ద లైఫ్..., గుండె గూటికి పండ‌గొచ్చింది...,చిట‌ప‌ట చినుకుల‌…,బ్రహ్మలో గురుబ్రహ్మలు…,ఆహా… ఏమి రుచి…అన‌రా మైమ‌ర‌చి…“ పాట‌లు విశేషంగా అల‌రించాయి. ఎస్వీ కృష్ణారెడ్డి స్వర‌విన్యాసాలు సైతం జ‌నాన్ని భ‌లేగా ఆక‌ట్టుకున్నాయి.

ఈ సినిమాతో తెలుగుతెర‌కు ప‌రిచ‌య‌మైన లైలా అతి త్వర‌లోనే అగ్రక‌థానాయ‌కుల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది.అంత‌కు ముందు జె.డి.చ‌క్రవ‌ర్తి, శ్రీ‌కాంత్ క‌ల‌సి న‌టించిన వ‌న్ బై టూ కన్నా మిన్నగా ఈ సినిమా విజ‌యం సాధించింది. కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో ఒక‌టిగా ఎగిరే పావుర‌మా నిల‌చింది.