NTV Telugu Site icon

2023 New heroines: ఈ యేడాది అలరించబోతున్న కొత్త భామలు!

New Heroines

New Heroines

New heroines: గత సంవత్సరం తెలుగువారి ముందుకొచ్చిన సంయుక్త మీనన్ మరో రెండు మూడు అవకాశాలను అందిపుచ్చుకుని, ఈ యేడాది కూడా టాలీవుడ్ లో తన సత్తాను చాటడానికి ప్రయత్నిస్తోంది. ఇక రెండేళ్ళ క్రితం ‘పెళ్ళిసందడి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల లాస్ట్ ఇయర్ ‘థమాకా’తో సాలీడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు… ప్రిన్స్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ మూవీలోనూ చోటు దక్కించుకుంది. ఇప్పటికే రామ్, నవీన్ పోలిశెట్టి, గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటీ మూవీల్లో శ్రీలీల నటిస్తోంది. సో… ఈ యేడాదిలో ఆమె హీరోయిన్ గా నటించే సినిమాలు నాలుగైదు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే… ప్రతి సంవత్సరంలానే ఈ యేడాది కూడా పలువురు పరభాషా నాయికలు తెలుగులో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అందులో ఈ యేడాది తొలి అడుగు వేసిన కథానాయిక ప్రియ భవానీ శంకర్. ఇప్పటికే పలు తమిళ చిత్రాలలో నటించిన ప్రియ తొలిసారి తెలుగులో ‘కళ్యాణం కమనీయం’ మూవీతో అడుగుపెట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు కానీ ప్రియ భవానీ శంకర్ కు నటిగా గుర్తింపును తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే ఇప్పటికే ఆమె సత్యదేవ్ సినిమాలో నటిస్తోంది. అలానే నాగచైతన్య నటిస్తున్న తొలి వెబ్ సీరిస్ ‘దూత’లోనూ, లారెన్స్ మూవీ ‘రుద్రుడు’లోనూ ఆమె నటిస్తోంది. కాబట్టి… మరికొన్ని అవకాశాలను ఈమె అందిపుచ్చుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు.

జనవరి 26న రాబోతున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ మూవీ ‘బుట్టబొమ్మ’తో అనికా సురేంద్రన్ తెలుగువారి ముందుకు తొలిసారి కథానాయికగా వస్తోంది. ఆమె గత యేడాది విడుదలైన నాగార్జున ‘ఘోస్ట్’లో గుల్ పనాగ్ కూతురుగా నటించి మెప్పించింది. అలానే ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’తో ఆషికా రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మూవీ మొఘల్ డి. రామానాయుడు మనమడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం అవుతున్న ‘అహింస’ మూవీతో గీతికా తివారి హీరోయిన్ గా తెలుగులో తొలి అడుగువేస్తోంది. పేరులో ‘అహింస’ ఉన్నా… సినిమాలో చాలా హింస ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. గత యేడాది ‘స్వాతిముత్యం’తో డీసెంట్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి గణేశ్ రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. ఈ మూవీతో బాలీవుడ్ భామ అవంతిక దుస్సాని తెలుగువారి ముందుకు వస్తోంది. విశేషం ఏమంటే… అలనాటి నటి భాగ్యశ్రీ కుమార్తే అవంతిక!

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సంతోష్ శోభన్ మూవీ ‘శ్రీదేవి శోభన్ బాబు’తో నాయికగా పరిచయం అవుతోంది గౌరి జి. కిషన్. ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాత. ‘కలర్ ఫోటో’తో నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్న సాయి రాజేష్ బేసికల్ గా దర్శకుడు. అతని డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ హీరోగా ‘బేబీ’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పలు చిత్రాలలో నటించిన వైష్ణవీ చైతన్య ‘బేబీ’తో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అలానే నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న మూవీతో యుక్తీ తరేజ; మాస్ మహరాజా రవితేజ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’తో సూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ; ‘ఏయ్ పిల్లా’తో రూబెన్ షికావత్ తెలుగులో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ ద్వారా సాక్షి వైద్య ను హీరోయిన్ గా తెలుగువారి ముందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి తీసుకురాబోతున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘రాజా డీలక్స్’. మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ. అలానే ప్రభాస్ తో నాగ అశ్విన్ రూపొందిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’తో దీపికా పదుకునే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నిజానికి దీపికా పదుకునే చాలా కాలం క్రితమే జయంత్ సి. పరాన్జీ మూవీలో ‘లవ్ 4 ఎవర్’లో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. కానీ అనివార్య కారణాలతో ఆ మూవీ విడుదల కాలేదు. సో… దీపికా పదుకునేకు అధికారికంగా ‘ప్రాజెక్ట్ కె’నే తొలి తెలుగు సినిమా అనుకోవాలి. ఇప్పటికీ ఈ సినిమాలన్నీ సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. రాబోయే నెలల్లో ఇంకెంతమంది పరభాషా తారామణులు టాలీవుడ్ లోకి అడుగుపెడతారో చూడాలి.

Show comments