NTV Telugu Site icon

20 ఏళ్ళ ‘మనసంతా నువ్వే’

19 Years For Manasantha Nuvve Movie

(అక్టోబర్ 19న ‘మనసంతా నువ్వే’కు 20 ఏళ్ళు)
తన చిలిపినవ్వుతో అప్పట్లో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచాడు హీరో ఉదయ్ కిరణ్. అలా హీరోగా వచ్చీ రాగానే వరుసగా మూడు విజయాలు చూశాడు ఉదయ్. వాటిలో ఒకదానిని మంచి మరోటి విజయం సాధించడం విశేషం. ‘చిత్రం’ తరువాత ‘నువ్వు-నేను’. ఆ పై ‘మనసంతా నువ్వే’ చిత్రాలు జనాన్ని భలేగా అలరించాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ లో ‘మనసంతా నువ్వే’ బిగ్ హిట్. ఆ పై మళ్ళీ ఆ స్థాయి విజయం అతణ్ణి పలకరించలేదు. ‘మనసంతా నువ్వే’ చిత్రంతోనే దర్శకుడు వి.యన్.ఆదిత్య పరిచయం కావడం విశేషం. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2001 అక్టోబర్ 19న ‘మనసంతా నువ్వే’ చిత్రం విడుదలయింది.

కథ విషయానికి వస్తే – ఇందులో కొన్ని పాత కథలు కనిపించినా, కథనంతో ఆకట్టుకున్నారు. అను ఓ ధనవంతుల అమ్మాయి. చంటి ఓ పేదరాలి కొడుకు. ఇద్దరూ చిన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే ధన అహంకారంతో అను తండ్రి, చంటిని చిన్నచూపు చూస్తూ ఉంటాడు. అను, చంటి తాము ఆడుకున్న ప్రదేశంలో ఉండే శ్రీఆంజనేయస్వామి గుడిలో కలుసుకుంటూ ఉంటారు. అను తండ్రికి బదిలీ అవుతుంది. వేరే ఊరు వెళ్ళే సమయంలో చంటికి ఓ కానుక ఇచ్చి, తనతో ఆడుకోవాలని అనిపించిన ప్రతీసారి దానితో ఆడుకోమని చెబుతుంది అను. ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి గుడివద్ద కలుసుకోవాలనుకుంటారు. చంటి తల్లి చనిపోయాక మోహన్ రావు, సుధ దంపతులు అతణ్ణి చేరదీసి సొంతకొడుకులా పెంచుతారు. వారికి రేఖ అనే అమ్మాయి ఉంటుంది. చంటి, తన చెల్లెలి కోసం ఏమైనా చేసేంతగా ప్రేమిస్తాడు. విదేశాలలో చదువుకొని వచ్చినా, అను, తన చిన్ననాటి స్నేహం చంటిని మరచిపోలేదు. ఆంజనేయ స్వామి గుడికి వెళుతుంది. కానీ, చంటిని కలుసుకోలేదు. దాంతో తన స్నేహాన్ని కథగా రాస్తుంది. అది ‘స్వాతి వారపత్రిక’లో ప్రచురితమవుతుంది. ఓ వేదికపై చంటి కూడా తన చిన్నప్పటి ప్రేమకథను చెబుతాడు. అక్కడే ఉన్న అను అతనే తన చంటి అని గుర్తిస్తుంది. అయితే, అతనికి రేణుగా పరిచయం అవుతుంది. అతణ్ణి పరీక్షిస్తుంది. కానీ, అతని మనసులో అను ఉందని తెలుసుకొని మురిసిపోతుంది. కానీ, రేణు తండ్రి చంటిని గుర్తించి, తన కూతురు పెళ్ళి ఓ మినిస్టర్ కొడుకుతో జరుగుతోందని, అడ్డు తప్పుకోమని చెబుతాడు. లేదంటే నీ చెల్లి పెళ్ళి కాకుండా చేస్తాననీ బెదిరిస్తాడు. దాంతో చంటి రేణునే అను తెలుసుకొని, ఆ బాధ తనలోనే దాచుకుంటాడు. రేణుకు ఈ విషయం స్వాతి పత్రిక ఎడిటర్ కూతురు ద్వారా తెలుస్తుంది. ఆమె పెళ్ళి ఎగ్గొట్టి చంటిని కలుసుకొనేందుకు వస్తుంది. తన కూతురును చంటి లేవదీసుకు పోయాడని భావించిన ఆమె తండ్రి గూండాలను వేసుకువచ్చి, చంటి చెల్లెలు పెళ్ళి దగ్గర అతణ్ణి కొట్టిస్తాడు. ఆ దెబ్బలకు చంటి కోమాలోకి వెళతాడు. చిన్నప్పుడు చంటికి అను ఇచ్చిన అలార్మ్ గిఫ్ట్ శబ్దంతో లేస్తాడు. చంటి, అను కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ కథ 1946లో మెహబూబ్ ఖాన్ రూపొందించిన ‘అన్ మోల్ ఘడి’ని గుర్తుకు తెస్తుంది. అయితే కాలానికి అనుగుణంగా పలు మార్పులు చేసి, నిర్మాత ఎమ్.ఎస్.రాజు ఈ కథను తయారు చేశారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ సంగీతం సమకూర్చారు.ఇందులోని అన్ని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. “తూనీగ తూనీగ…”, “చెప్పవే ప్రేమా… చెలియ చిరునామా…”, “కిట కిట కిట తలుపులు…”, “నీ స్నేహం ఇక రాదు అనీ…”, “ధిన్ ధిన్ ధినక…”, “మనసంతా నువ్వే…”, “ఎవరిని ఎప్పుడు…”, “ఆకాశాన…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో “తూనీగ తూనీగ…” పాట ట్యూన్ మళయాళం సినిమా ‘ప్రణయవమంగళ్’కు విద్యాసాగర్ స్వరపరచిన “కన్నాడీ కూడుమ్ కూట్టి…” గీతం నుండి తీసుకున్నది. ఆ ట్యూన్ తరువాత తమిళ వర్షన్ లోనూ ఉపయోగించారు. అక్కడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో చంటిగా ఉదయ్ కిరణ్, రేణుగా రీమా సేన్ నటించారు. అంతకు ముందు వీరిద్దరూ ‘చిత్రం’లోనూ జోడీ కట్టి అలరించారు. తనూ రాయ్, శిజ్జు, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, సునీల్, సుధ, దేవదాస్ కనకాల, శివారెడ్డి, పావలా శ్యామల, రజిత, మాస్టర్ ఆనంద్ వర్ధన్, బేబీ సుహానీ నటించారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో గీత రచయిత సీతారామశాస్త్రి కూడా కనిపిస్తారు.

‘మనసంతా నువ్వే’ చిత్రం 2001 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. ఈ చిత్రం తరువాత హిందీలో ‘జీనా సిర్ఫ్ మేరే లియే’గా, కన్నడలో ‘మనసెల్లా నీనే’, తమిళంలో ‘తితికుదే’గా రూపొందింది. ఒడియాలో ‘నెయ్ జా రే మేఘ మతే’గానూ, బంగ్లాదేశ్ లో ‘మోనేర్ మఝే తుమీ’గానూ తెరకెక్కి అలరించింది. 2001 సంక్రాంతికి ఎమ్.ఎస్.రాజు నిర్మించిన ‘దేవీపుత్రుడు’ విడుదలై అంతగా అలరించలేకపోయింది. ఆ యేడాది దసరా సీజన్ లో వచ్చిన ‘మనసంతా నువ్వే’ ఘనవిజయం సాధించింది. పొంగల్ బరిలో నష్టం చూసినా, దసరాకు ఎమ్మెస్ రాజు హిట్ పట్టేశారని అప్పట్లో భలేగా చర్చించుకున్నారు. ఈ సినిమాతో ఘనవిజయం చూసిన దర్శకుడు వి.యన్.ఆదిత్యకు మంచి గుర్తింపు లభించింది.