Nikhil: ‘కార్తికేయ -2′ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కృష్ణ తత్వాన్ని తెలియచేసిన ఈ సినిమాతో నిఖిల్ మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. దాంతో లైనప్ లో ఉన్న అతని సినిమాల షూటింగ్స్ చక చకా సాగిపోతున్నాయి. ఇదే యేడాది నిఖిల్ నటిస్తున్న “18 పేజీస్’ మూవీ కూడా విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే.. ‘కార్తికేయ -2’ అతని సరసన నటించిన అనుపమా పరమేశ్వరనే ఇందులో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ 2 పిక్చర్స్ లో అల్లు అరవింద్ సమర్పకునిగా బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్ కథను ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ రాశారు. గతంలో సుకుమార్ రచన చేసి నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
’18 పేజీస్’ చిత్రం నుండి విడుదల కాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన….’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలు అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.
