కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. హోంబాలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టించాయో తెలిసిందే. ఇక నిన్నటికి నిన్న రిలీజైన ట్రైలర్ కూడా రికార్డుల మోత మోగిస్తుంది. అన్ని భాషల్లో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి పాత రికార్డులను తిరగరాస్తుంది. కేవలం 24 గంటల్లోనే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సాధించింది.
ఇక ఒక్కో భాషల్లో చెప్పుకొస్తే కన్నడ ట్రైలర్ కి 18 మిలియన్ వ్యూస్, తెలుగు ట్రైలర్ కి 20 మిలియన్ వ్యూస్, హిందీ ట్రైలర్ కి 51 మిలియన్ వ్యూస్, తమిళ్ ట్రైలర్ కి 12 మిలియన్ వ్యూస్, మలయాళ ట్రైలర్ కు 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్నీ మేకర్స్ స్పెషల్ థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. ” రికార్డ్స్.. రికార్డ్స్ .. రికార్డ్స్.. రాఖీ కి ఇది ఇష్టం ఉండదు.. అందుకే తప్పించుకుంటాడు.. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి.. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
