(సెప్టెంబర్ 18న షబానా ఆజ్మీ బర్త్ డే)
దేశం గర్వించదగ్గ నటీమణుల్లో షబానా ఆజ్మీ అగ్రస్థానంలో నిలుస్తారు. సమాంతర సినిమా మన దేశంలో వెలుగులు విరజిమ్మడంలో షబానా ఆజ్మీ అభినయం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘అంకుర్’తోనే జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ, తరువాత నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా ‘హ్యాట్రిక్’ చూశారు. మొత్తం ఐదుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ మన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘మార్నింగ్ రాగ’లోనూ కీలక పాత్ర పోషించారు. చిత్రసీమకు ఆమె చేసిన సేవలకు కళాకారుల కోటాలో రాష్ట్రపతి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. పద్మభూషణ్ సైతం ఆజ్మీ దరి చేరింది. ఇవి గాక అనేక అవార్డులూ, రివార్డులూ షబానా కీర్తి కిరీటంలో నిలిచాయి. ఏడు పదుల వయసులోనూ మునుపటి ఉత్సాహంతోనే షబానా ఆజ్మీ నటిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
షబానా ఆజ్మీ 1950 సెప్టెంబర్ 18న హైదరాబాద్ లో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ ఉర్దూ కవి, గీత రచయిత ఖైఫీ ఆజ్మీ, తల్లి నటి షౌకత్ ఆజ్మీ. రంగస్థలంపై ఖైఫీ, షౌకత్ ఇద్దరూ సుప్రసిద్ధులు. సినిమాల్లోనూ ఖైఫీ పాటలు అజరామరంగా నిలిచాయి. వామపక్ష భావాలతో భార్యాభర్తలిద్దరూ సాగారు. అవే ఆదర్శభావాలు షబానాలోనూ పాతుకుపోయాయి. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుండి సైకాలజీలో పట్టా పుచ్చుకున్నారు షబానా ఆజ్మీ. ‘సుమన్’ సినిమాలో జయబాధురి నటన చూసి, తానూ నటి కావాలని కలలు కన్నారు షబానా. తన కలను సాకారం చేసుకోవడానికి పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొందారు. ఇన్ స్టిట్యూట్ నుండి బయటకు రాగానే కె.ఏ. అబ్బాస్ ‘ఫాస్లా’లోనూ, కాంతిలాల్ రాథోడ్ ‘పరిణయ్’లోనూ నటించారు షబానా. అయితే శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘అంకుర్’ ముందుగా జనం ముందు నిలచింది. మన దేశంలో నియో-రియలిస్టిక్ ఫిలిమ్ గా రూపొందిన ‘అంకుర్’లో షబానా అభినయం ఇట్టే జనాన్ని ఆకట్టుకుంది. హైదరాబాద్ సమీపంలో జరిగిన ఓ కథ ఆధారంగా ‘అంకుర్’ తెరకెక్కింది. అందులో లక్ష్మి పాత్రలో షబానా కొన్ని సీన్స్ లో తెలుగు కూడా మాట్లాడుతుంది. ఈ హిందీ చిత్రంలో షబానా నటన చూసి, జనం నివ్వెర పోయారు. అక్కడ షబానా కనిపించలేదు, లక్ష్మి పాత్రనే కనిపించింది. ఆమె నటనకు నీరాజనం పడుతూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు లభించింది.
ఇప్పటి దాకా ఉత్తమ నటిగా ఎందరో జాతీయ స్థాయిలో నిలిచారు. అయితే వారందరిలోకి షబానా ఆజ్మీ భిన్నంగా తన బాణీ పలికించారు. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా షబానా ‘హ్యాట్రిక్’ సాధించారు. 1982లో ‘అర్థ్’, 1983లో ‘ఖాందార్’, 1984లో ‘పార్’ చిత్రాల ద్వారా షబానా వరుసగా మూడు సార్లు జాతీయ ఉత్తమనటిగా నిలచి జనం మదిని గెలిచారు. ప్యారెలల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించినా, మధ్య మధ్యలో ‘ఫకీరా’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘పర్ వరిష్’, ‘అవతార్’, ‘మాసూమ్’ వంటి కమర్షియల్ మూవీస్ లోనూ షబానా ఆజ్మీ నటించి మెప్పించారు. ‘పార్’ తరువాత 14 ఏళ్ళకు ‘గాడ్ మదర్’ చిత్రంతో మరోమారు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు షబానా. మొత్తం ఐదు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న బెస్ట్ యాక్ట్రెస్ గా ఇప్పటికీ తనదే పైచేయిగా సాగుతున్నారామె. షబానా సోదరుడు బాబా ఆజ్మీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. బాపు రూపొందించిన కొన్ని చిత్రాలకు బాబా ఆజ్మీ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. బాబా ఆజ్మీ భార్య తన్వీ ఆజ్మీ కూడా నటిగా రాణించారు. ఇక ప్రముఖ నటీమణులు టబు, ఫరా ఆమెకు మేనకోడళ్ళ వరుస అవుతారు.
దీపామెహతా రూపొందించిన ‘ఫైర్’లో నందితా దాస్ తో కలసి షబానా ఆజ్మీ స్వలింగ సంపర్కం పెట్టుకొనే పాత్రలో నటించి సంచలనం సృష్టించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించడానికి షబానా సిద్ధంగా ఉన్నారు. ‘షీర్ ఖుర్మా’ అనే రొమాంటిక్ కామెడీలోనూ ఆమె నటించారు. ‘వాట్స్ లవ్ గాట్ టు డు విత్ ఇట్?’ అనే బ్రిటిష్ రొమాంటిక్ కామెడీలోనూ షబానా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా వెలుగు చూడలేదు. 70 ఏళ్ళలో షబానా నటించిన ఈ సినిమాల్లో ఆమె నటన ఏ తీరున సాగిందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటుడు బెంజమిన్ గిలానీతో షబానాకు వివాహ నిశ్చితార్థం అయింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళి మాత్రం జరగలేదు. ఆ తరువాత ప్రముఖ రచయిత, గీత రచయిత జావేద్ అక్థర్ ను పెళ్ళాడారు షబానా. అప్పటికే జావేద్, హనీ ఇరానీని వివాహం చేసుకున్నారు. వారికి ఫర్హాన్ అక్థర్, జోయా అక్థర్ పిల్లలు. అందువల్ల షబానా కన్నవారు ఆమె జావేద్ ను పెళ్ళాడటానికి అంగీకరించలేదు. తన మనసుకు నచ్చిన జావేద్ ను షబానా తన జీవితంలోకి ఆహ్వానించింది. హనీ ఇరానీ సైతం వారి ప్రేమను ఆమోదించింది. ప్రస్తుతం హనీ వేరుగా ఉంటున్నా, షబానాతో తన స్నేహబంధాన్ని మాత్రం ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక హనీ పిల్లలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటారు షబానా. జావేద్, షబానా ఇద్దరూ ఆదర్శభావాలు వెల్లడించడమే కాదు, అందుకు కట్టుబడి ఉంటారు. షబానా సోషల్ ఆక్టివిస్ట్ గానూ ఉత్సాహంగా పనిచేస్తుంటారు. పసిపిల్లల సంరక్షణ, ఎయిడ్స్ నివారణ వంటివాటిపై జనాల్లో అవగాహన కలిగించడంలో ముందుంటారు షబానా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యురాలిగా షబానా ఆ పార్టీ ప్రచారంలోనూ పలుమార్లు పాల్గొన్నారు. తెరపై విలక్షణమైన పాత్రల్లో అలరించడమే కాదు, వ్యక్తిగానూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్నారు షబానా ఆజ్మీ. ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.