Yellow Gas Flame: ప్రస్తుత నాగరిక ప్రపంచంలో చాలా ఇళ్లలో వంట కోసం గ్యాస్ బర్నర్‌నే ఉపయోగిస్తుంటారు. సాధారణంగా గ్యాస్ మంట నీలం రంగులో ఉంటుంది. ఇది గ్యాస్ సరిగ్గా మండుతోందనడానికి సంకేతం. అయితే మంట అకస్మాత్తుగా పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. బర్నర్‌లో సమస్య లేదా గ్యాస్ పూర్తిగా మండకపోవడం ఇందుకు కారణం కావచ్చు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మరి అవేంటో చూసేద్దామా..
బర్నర్‌లో మురికి పేరుకుపోవడం
రోజువారీ వంటల సమయంలో నూనె, ఆహార పదార్థాల అవశేషాలు, పాలు వంటి పదార్థాలు బర్నర్‌లోని చిన్న రంధ్రాల్లో పేరుకుపోతాయి. దీంతో గ్యాస్, గాలి సరైన నిష్పత్తిలో కలవకపోవడంతో మంట నీలం రంగు నుంచి పసుపు లేదా నారింజ రంగులోకి మారవచ్చు.
ఆక్సిజన్ సరిపడా అందకపోవడం
గ్యాస్ సరిగ్గా మండాలంటే తగినంత ఆక్సిజన్ అవసరం. బర్నర్కు గాలి సరఫరా సరిగా లేకపోతే గ్యాస్ అసంపూర్తిగా మండుతుంది. ఫలితంగా మంట రంగు మారడమే కాకుండా వంట పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
కార్బన్ మోనాక్సైడ్ ప్రమాదం
గ్యాస్ పూర్తిగా మండకపోతే కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది రంగు, వాసన లేని విష వాయువు. దీని ప్రభావంతో తలనొప్పి, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. వంటగదిలో సరైన వెంటిలేషన్ లేకపోతే ప్రమాదం మరింత పెరుగుతుంది.
పాత్రల అడుగు భాగం నల్లగా మారితే..
గ్యాస్ సరిగ్గా మండకపోతే పాత్రల అడుగు భాగంలో నల్లటి మసి పేరుకుపోవచ్చు. స్టీల్, ఇనుము లేదా అల్యూమినియం పాత్రలు తరచూ కింద భాగంలో నల్లగా మారుతున్నట్లయితే బర్నర్‌ను పరిశీలించడంతో పాటు గ్యాస్ రిపేర్ చేసే వ్యక్తిని సంప్రదించడం మంచిది.
గ్యాస్ వినియోగం
మంట పసుపు రంగులోకి మారిన సమస్యను ఎక్కువకాలం పట్టించుకోకపోతే గ్యాస్ వినియోగం పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ పూర్తిగా మండకపోవడంతో వంటకు ఎక్కువ సమయం పడుతుంది. బర్నర్ లేదా గ్యాస్ సరఫరా మార్గంలో అడ్డంకులు ఉన్నా ఇలాంటి సమస్యలు రావచ్చు. అందుకే గ్యాస్ మంట నీలం రంగులో కాకుండా పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తే దాన్ని సాధారణంగా భావించకుండా బర్నర్‌ను పరిశీలించాలి. శుభ్రపరిచిన తర్వాత కూడా మంట రంగు మారకపోతే స్వయంగా గ్యాస్ లైన్‌ను మార్చడం లేదా మరమ్మతు చేయడం కాకుండా అర్హత కలిగిన గ్యాస్ టెక్నీషియన్‌ను సంప్రదించడం సురక్షితం.

