Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

  • సర్వీసింగ్‌లో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే
  • టీడీఎస్ లెవల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం
  • స్టోరేజ్ ట్యాంక్ పరిశుభ్రత ఎందుకు ముఖ్యం?
  • RO వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు
Water Purifier

Water Purifier

Health Tips : నేటి మోడ్రన్ యుగంలో వాటర్ ప్యూరిఫైయర్ అనేది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే విషయాన్ని ఐజేసీఆర్‌టీ (IJCRT) అధ్యయనం కూడా స్పష్టం చేసింది. అయితే, చాలా మంది దీనిని కొనేటప్పుడు, వినియోగించేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ తమ ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తుంటారు. కేవలం తక్కువ ధర ఉందనో లేదా ఆకర్షణీయమైన ప్రకటనలను చూసో ప్యూరిఫైయర్‌ను ఎంపిక చేసుకోకూడదు. మన ప్రాంతంలోని నీటి నాణ్యత, అలాగే సరైన నిర్వహణ పట్ల అవగాహన లేకపోతే ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్యూరిఫైయరే అనారోగ్యానికి కారణం కావచ్చు. అందువల్ల, ప్యూరిఫైయర్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సర్వీసింగ్ విషయంలో నిర్లక్ష్యం వద్దు

చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్ పూర్తిగా ఆగిపోయే వరకు దాని జోలికి వెళ్లరు. ఇది చాలా పెద్ద పొరపాటు. ప్యూరిఫైయర్‌లోని ఫిల్టర్లను సరైన సమయంలో మార్చకపోతే వాటిలో మట్టి, హానికరమైన బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఫలితంగా అవి నీటిని శుద్ధి చేయకపోగా, ఉన్న నీటిని మరింత కలుషితం చేస్తాయి. కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారైనా నిపుణుడైన టెక్నీషియన్‌ను పిలిపించి పూర్తి సర్వీసింగ్ చేయించడం ఎంతో అవసరం.

టీడీఎస్ (TDS) లెవల్స్ బాగా తగ్గించవద్దు

మనం తాగే నీటిలో శరీరానికి అవసరమైన ఖనిజాలు (మినరల్స్) ఉండటం చాలా ముఖ్యం. నీటిలోని టీడీఎస్ (Total Dissolved Solids) స్థాయి 50 కంటే తక్కువగా ఉంటే ఆ నీరు ‘డెడ్ వాటర్’గా మారుతుంది. ఇటువంటి నీటిలో శరీరానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అస్సలు ఉండవు. కాబట్టి ప్యూరిఫైయర్ సెట్టింగ్స్‌లో టీడీఎస్ లెవల్స్‌ను మరీ ఎక్కువగా తగ్గించడం ఆరోగ్యానికి మంచిది కాదు.

స్టోరేజ్ ట్యాంక్ పరిశుభ్రత ముఖ్యం

ప్యూరిఫైయర్ లోపల నీళ్లు నిల్వ ఉండే స్టోరేజ్ ట్యాంక్‌ను కనీసం నెలకొకసారైనా తప్పకుండా క్లీన్ చేయాలి. చాలా కాలం పాటు నీరు అందులోనే నిల్వ ఉండిపోతే ట్యాంక్ లోపలి భాగంలో ఒక రకమైన జిగురు ఏర్పడి, బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇల్లు తాళం వేసి ఉండటం వల్ల లేదా మరేదైనా కారణం చేత రెండు మూడు రోజులు ప్యూరిఫైయర్ వాడకపోతే, ట్యాంక్‌లోని పాత నీటిని పూర్తిగా పారబోసి, కొత్తగా నిండిన నీటిని మాత్రమే తాగాలి.

నీటి రకాన్ని బట్టి సరైన ప్యూరిఫైయర్ ఎంపిక

మీ ఇంట్లోకి వచ్చే నీరు మున్సిపల్ నీరా లేక బోరు నీరా అనే అంశంపై ప్యూరిఫైయర్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మున్సిపల్ నీటిలో టీడీఎస్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి యూవీ (UV), యూఎఫ్ (UF) ప్యూరిఫైయర్లు సరిపోతాయి. అదే బోరు నీరైతే ఉప్పుదనం, టీడీఎస్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్‌ఓ (RO) ప్యూరిఫైయర్‌ను ఉపయోగించాలి. తక్కువ టీడీఎస్ ఉన్న మున్సిపల్ నీటికి అనవసరంగా ఆర్‌ఓ ప్యూరిఫైయర్ వాడితే నీరు తన సహజ రుచిని కోల్పోవడమే కాకుండా, ఎక్కువ నీరు వృథా అవుతుంది.

పవర్ ఆన్, ఆఫ్ చేయడం సరికాదు

చాలా మంది విద్యుత్ ఆదా అవుతుందనే ఆలోచనతో ప్యూరిఫైయర్‌ను అప్పుడప్పుడు ఆఫ్ చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో వస్తున్న ఆటోమేటిక్ ప్యూరిఫైయర్లు ట్యాంక్ నిండగానే వాటంతట అవే ఆగిపోతాయి. అలా కాకుండా మనం మాటిమాటికి మాన్యువల్‌గా స్విచ్ ఆన్, ఆఫ్ చేయడం వల్ల ప్యూరిఫైయర్‌లోని సెన్సార్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

వేస్ట్ వాటర్ పైపు అమరిక.. వృథా నీటి వినియోగం

ఆర్‌ఓ ప్యూరిఫైయర్ల నుండి బయటకు వచ్చే వేస్ట్ వాటర్ పైపును మురికి కాలువల్లో లేదా సింక్ లోపల లోతుగా ఉంచకూడదు. కాలువల్లోని బ్యాక్టీరియా ఆ పైపు ద్వారా తిరిగి ప్యూరిఫైయర్ లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉంది. అలాగే, ఈ పైపు నుండి వృథాగా పోయే నీటిని పారబోయకుండా ఒక బకెట్‌లో పట్టి ఉంచి.. ఇల్లు తుడవడానికి, పాత్రలు కడగడానికి లేదా మొక్కలకు పోయడానికి ఉపయోగించుకోవడం మంచిది.