America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు

America Green Card

America Green Card

America : అమెరికా కలలు… గ్రీన్ కార్డ్ ఆశలు… ఏళ్ల తరబడి ఎదురుచూపులు… ఇప్పుడు లక్షలాది భారతీయుల గుండెల్లో ఒక్కసారిగా ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కష్టాలు పడి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు… ఇక అక్కడే స్థిరపడాలని భావించిన వాళ్ళు … ఇప్పుడు ఊహించని షాక్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే భారతీయులకు సంబంధించిన ఈబీ 2 గ్రీన్ కార్డ్ కోటా పూర్తిగా ముగిసిపోయిందని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో వేలు కాదు… లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి.

అమెరికాలో ఉద్యోగం సంపాదించిన ప్రతి భారతీయుడి కలల్లో గ్రీన్ కార్డ్ ఒక పెద్ద లక్ష్యం. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అదే ఆశతో అక్కడ జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ చేసిన తాజా ప్రకటన వారందరికీ తీవ్ర నిరాశను మిగిల్చింది. 2026 ఆర్థిక సంవత్సరానికి భారతీయులకు కేటాయించిన ఈబీ 2 కేటగిరీ గ్రీన్ కార్డులన్నీ ఇప్పటికే జారీ అయ్యాయని స్పష్టం చేసింది. అంటే ఈ ఏడాదిలో ఇక కొత్తగా ఈబీ 2 గ్రీన్ కార్డులు భారతీయులకు దక్కే అవకాశం లేనట్టే.

×
×
Ad

అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది చూస్తే అమెరికా వలస విధానంలోని కఠినమైన కోటా వ్యవస్థే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం ఒక పరిమితిని నిర్ణయిస్తుంది. మొత్తం 1 లక్షా 40 వేల గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేస్తుంది. ఇందులో కొంత భాగాన్ని ఈబీ 2 కేటగిరీకి కేటాయిస్తారు. అలాగే ఈబీ 1లో మిగిలిపోయిన వీసాలను కూడా ఇందులో కలుపుతారు. కానీ అసలు ఇబ్బంది దేశాల వారీగా అమల్లో ఉన్న 7 శాతం పరిమితి. ఈ నియమం వల్ల ఏ ఒక్క దేశానికీ నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ గ్రీన్ కార్డులు దక్కవు. దాంతో భారత్ లాంటి భారీ జనాభా కలిగిన దేశాలకు డిమాండ్ ఎంత ఎక్కువగా ఉన్నా అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే మిగిలిపోతున్నాయి.

ఈ లెక్కల ప్రకారం భారతీయులకు ఈబీ 2 కేటగిరీలో దక్కే గ్రీన్ కార్డుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. అయితే అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల సంఖ్య మాత్రం లక్షల్లో ఉంది. అందుకే దరఖాస్తులు పెరుగుతున్న కొద్దీ వెయిటింగ్ లిస్ట్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. అందుకే గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారిక గణాంకాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో అత్యధిక సంఖ్య భారతీయులదే. సుమారు 7 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం వరుసలో ఉన్నారని ఇప్పటికే వెల్లడైంది. అంటే అమెరికా వలస విధానంలో అత్యధిక ప్రభావం పడుతున్న వర్గం భారతీయులేనని స్పష్టమవుతోంది.

ఇక మరోవైపు అమెరికాలో వలస నిబంధనలు మరింత కఠినతరం కావడం కూడా పరిస్థితిని క్లిష్టంగా మార్చుతోంది. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులపై అమెరికా యంత్రాంగం స్క్రూటినీ పెంచుతోంది. పత్రాల పరిశీలన మరింత కఠినంగా మారుతోంది. ఇటీవల అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ విడుదల చేసిన తాజా మెమో కూడా వలసదారుల్లో కొత్త ఆందోళనకు కారణమైంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తమ స్వదేశం నుంచే అప్లై చేయాలని అందులో పేర్కొనడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు వెంటాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మొత్తం మీద ఇప్పుడు అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న భారతీయ నిపుణుల పరిస్థితి మరింత అనిశ్చితిలో పడిపోయింది. ఏళ్ల తరబడి అక్కడ పనిచేస్తూ పన్నులు చెల్లిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన వేలాది కుటుంబాలు ఇప్పుడు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పిల్లల చదువులు, ఉద్యోగ భవిష్యత్తు, కుటుంబ స్థిరత్వం వంటి అంశాలు వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే వరకు ఈ ఎదురుచూపులు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటివరకు అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు భారతీయులకు కొత్త ఈబీ 2 వీసాలు జారీ చేసే అవకాశం కూడా లేదని స్పష్టమవుతోంది.