ఇంట్లో మన అమ్మలు లేదా అమ్మమ్మలు దోసె వేయడానికి ముందు వేడి పెనం మీద కొద్దిగా నీళ్లు చల్లడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాగే రెస్టారెంట్లలో కరకరలాడే దోసెలు వేసేటప్పుడు చెఫ్‌లు కూడా పెనంపై నీళ్లు చల్లడం గమనించవచ్చు. పిండి పెనానికి అంటుకోకుండా ఉండటానికి అలా చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ, ఆ సాధారణ పని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది.
పెనం టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉండటం కోసం
దోసె మంచిగా రావాలంటే పెనం వేడి సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. పెనం మరీ ఎక్కువగా వేడెక్కిపోతే, పిండి వేసిన వెంటనే అది మాడిపోయి రౌండ్‌గా పలుచగా వదలడం కష్టమవుతుంది. అలా అని పెనం వేడి తక్కువగా ఉంటే దోసె సరిగ్గా ఉడకదు, పెనానికి అంటుకుపోతుంది. అందుకే దోసె వేసే ముందు కొద్దిగా నీళ్లు చల్లితే, పెనం సరైన వేడితో ఉందా లేదా అని ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
పెనం వేడిని సింపుల్‌గా గుర్తించే పద్ధతి
పెనం మీద కొన్ని చుక్కల నీళ్లు చల్లినప్పుడు అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూసి టెంపరేచర్ అంచనా వేయవచ్చు. నీళ్లు నెమ్మదిగా ఆవిరైపోతే పెనం సరిగ్గా వేడెక్కలేదని అర్థం. అదే నీళ్లు పడిన వెంటనే వేగంగా ఆవిరైపోతే పెనం దోసె వేయడానికి కరెక్ట్ టెంపరేచర్ లో ఉందని తెలుసుకోవచ్చు. ఒకవేళ నీటి చుక్కలు పెనం మీద చిన్న చిన్న బంతుల్లా దొర్లుకుంటూ తిరిగితే మాత్రం పెనం మరీ ఎక్కువగా వేడెక్కిందని అర్థం చేసుకోవాలి.
పిండి అంటుకోకుండా సాఫీగా రావడానికి
పెనం విపరీతంగా వేడిగా ఉన్నప్పుడు పిండిని వేస్తే అది క్షణంలో మాడిపోయి ఎగుడుదిగుడుగా వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్లు చల్లి, ఒక తడి గుడ్డతో పెనాన్ని తుడవాలి. ఇలా చేయడం వల్ల పెనం మీద ఉన్న అదనపు వేడి తగ్గిపోయి, పిండిని పల్చగా, గుండ్రంగా సాఫీగా పోయడానికి చక్కటి వాతావరణం ఏర్పడుతుంది.
నీటి బిందువులు బంతుల్లా తిరగడానికి కారణం
చాలామంది చూసే ఉంటారు, వేడి పెనం మీద నీళ్లు చల్లినప్పుడు అవి వెంటనే ఆవిరి అయిపోకుండా పెనం మీద చిన్న బంతుల్లా దొర్లుతుంటాయి. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంది. వేడిగా ఉన్న ఉపరితలంపై నీరు పడినప్పుడు, ఆ నీటి బిందువు అడుగు భాగంలో వేగంగా ఒక పలుచని ఆవిరి పొర తయారవుతుంది. ఈ ఆవిరి పొర వల్ల నీటి బిందువు నేరుగా పెనానికి తగలకుండా దాని మీద తేలుతూ గుండ్రంగా తిరుగుతుంది.
పెనాన్ని సిద్ధం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దోసె వేసే ముందు పెనం మీద నీళ్లు చల్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా వేళ్లతో కొన్ని చుక్కలు మాత్రమే చిలకరించాలి. నీళ్లు చల్లేటప్పుడు ముఖాన్ని, చేతులను పెనానికి మరీ దగ్గరగా ఉంచకూడదు. అలాగే పెనం మీద నూనె లేదా నెయ్యి ఉన్నప్పుడు పొరపాటున కూడా నీళ్లు పోయొద్దు, నూనె చిట్లే ప్రమాదం ఉంది. నీళ్లు చల్లిన తర్వాత ఆ మిగిలిన నీటిని శుభ్రమైన గుడ్డతో తుడిచేసి ఆ తర్వాతే పిండి పోయాలి. మొత్తానికి దోసె వేసే ముందు నీళ్లు చల్లడం అనేది కేవలం ఆచారం కాదు, దోస పర్ఫెక్ట్గా రావడానికి ఉపయోగించే ఒక చక్కటి టెక్నిక్.

