Home Gardening: ఇల్లు అందంగా కనిపించడానికి చాలామంది ఖరీదైన ఫర్నిచర్ మాత్రమే కాకుండా రకరకాల మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు. మొక్కలు పెంచడం అందరికీ ఇష్టమే కానీ, వాటికోసం ప్రతీసారి బయట మార్కెట్లో కుండీలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతుంది. మార్కెట్లో దొరికే కుండీలు చాలా ఖరీదైనవి. ఎంత ఖరీదు ఉన్నప్పటికీ.. మొక్కలు పెంచాలంటే ఖచ్చితంగా మార్కెట్ నుంచే కుండీలు తేవాలని చాలామంది భావిస్తుంటారు.. కానీ ఇంట్లో పచ్చదనం వెల్లివిరియాలంటే మార్కెట్లో లభించే ఖరీదైన కుండీలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం పనికిరావు అని చెత్తబుట్టలో పడేసే పాత వస్తువులన్నింటినీ మొక్కలు పెంచడానికి అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఇంట్లో పచ్చదనం పెరగడమే కాకుండా, పాత సామాగ్రిని సరికొత్తగా రీసైకిల్ చేసినట్లు అవుతుంది. కుండీలకు బదులుగా మనం చక్కగా మొక్కలు పెంచుకోగలిగే ఆ 6 అద్భుతమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం నిత్యం వాడి పడేసే ప్లాస్టిక్ బాటిళ్లను చెత్తలో వేయకుండా అందమైన ప్లాంటర్లుగా మార్చుకోవచ్చు. ఆ బాటిల్స్ మధ్యలో కట్ చేసి మట్టి నింపి పుదీనా, కొత్తిమీర లేదా చిన్న పూల మొక్కలను సులభంగా పెంచవచ్చు. బాటిల్స్ కు రకరకాల రంగులు వేసి బాల్కనీలో వేలాడదీస్తే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే అడుగుభాగంలో చిన్న రంధ్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు, అప్పుడే అదనపు నీరు బయటకుపోయి వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి. ఇక, ఇంట్లో మూలన పడి ఉన్న పాత ప్లాస్టిక్ బకెట్లు లేదా పగిలిపోయిన టబ్స్లో టమోటాలు, పచ్చిమిర్చి, వంకాయ లాంటి కూరగాయల మొక్కలను ఏపుగా పెంచుకోవచ్చు. దీనికోసం ఆ కంటైనర్లను శుభ్రం చేసి అడుగున చిన్న రంధ్రాలు చేసి, తగినంత మట్టి, ఎరువు నింపాలి. మొక్కల వేర్లు బలంగా విస్తరించడానికి మంచి స్థలం దొరికేలా చూసుకోవడంతో పాటు అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక, మనీ ప్లాంట్, పోథోస్, లకి బాంబూ వంటి మొక్కలను మట్టితో సంబంధం లేకుండా కేవలం నీటిలోనే అద్భుతంగా పెంచుకోవచ్చు. దీనికోసం గాజు సీసాలు లేదా జాడీల్లో శుభ్రమైన నీటిని నింపి, మొక్క కాండం భాగాన్ని (ముడి ఉన్న ప్రాంతాన్ని) నీటిలో ఉంచాలి. ఆకులు మాత్రం నీటిలో తడవకుండా బయట ఉండేలా చూసుకోవాలి. అలాగే కంటైనర్లోని నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
పాత టైర్లను శుభ్రంగా కడిగి నచ్చిన రంగులు వేసుకుంటే అద్భుతమైన ఫ్లవర్ బెడ్ తయారవుతుంది. ఆ టైర్లలో మట్టి నింపి కాలానుగుణంగా పూచే పూల మొక్కలను లేదా అందమైన అలంకరణ మొక్కలను నాటుకోవచ్చు. ఇలాంటి టైర్లను కొన్నింటిని పక్కపక్కనే అమర్చి బాల్కనీలో లేదా వాకిట్లో సరికొత్త అందమైన చిన్న ఉద్యానవనాన్ని సృష్టించవచ్చు. అయితే వీటిలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అలాగే వీటిలో తినే కూరగాయల మొక్కలను పెంచడం మానుకోవడం మంచిది. ఇంట్లో మిగిలిపోయిన ఖాళీగా ఉన్న బలమైన డబ్బాలను చిన్నచిన్న ప్లాంటర్లుగా మార్చుకోవచ్చు. వాటిని శుభ్రం చేసుకుని కొత్తిమీర, పుదీనా, చిన్నపాటి ఇండోర్ డెకరేటివ్ మొక్కలను సులభంగా నాటవచ్చు. ఆ డబ్బాలు మొక్కలకు హాని చేయని మెటీరియల్ తో చేసినవని, వాటిలో ఇంతకుముందు ఎలాంటి రసాయనాలు నిల్వ చేయలేదని నిర్ధారించుకోవడం ముఖ్యం. మట్టితో పెంచే ప్లాంటర్లు అయితే అడుగున నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా రంధ్రాలు చేయాలి. కొబ్బరి బోండాం గట్టి పెంకు చిన్న మొక్కలకు అందమైన సహజమైన ప్లాంటర్లా ఉపయోగపడుతుంది. ఆ పెంకును శుభ్రం చేసి దానిలో మట్టి నింపి చిన్నపాటి అందమైన అలంకరణ మొక్కలను పెంచవచ్చు. కావాలనుకుంటే తాడు సహాయంతో దీన్ని హ్యాంగింగ్ ప్లాంటర్ లా బాల్కనీలో వేలాడదీయవచ్చు. ఇక కొబ్బరి పీచుతో తయారైన కోకోపిట్ ను మట్టిలో కలపడం ద్వారా తేమ ఎక్కువసేపు నిలిచి ఉండేలా చూసుకోవచ్చు.

