Floor Cleaning Tips: ఇల్లు ఎంత తుడిచినా, ఎంత శుభ్రం చేసినా ఫ్లోర్ మీద అక్కడక్కడ నల్లటి మచ్చలు లేదా బూట్లు, చెప్పుల గుర్తులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వైట్, క్రీమ్ లేదా లైట్ కలర్ ఫ్లోరింగ్ మీద ఈ మచ్చలు చాలా త్వరగా కళ్లలో పడతాయి. ఎంత బాగా మోప్ చేసినా, సోపు పెట్టి రుద్దినా ఇవి పోవు. వీటిని వదిలించడానికి చాలా మంది ఖరీదైన ఫ్లోర్ క్లీనర్స్ కొంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే ఈ మొండి మచ్చలను ఇట్టే వదిలించుకోవచ్చు. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి మార్క్స్ పడితే కింద చెప్పిన 4 సింపుల్ చిట్కాలు బాగా పనిచేస్తాయి.
మెలామైన్ స్పంజ్ (ఇరేజర్ స్పంజ్): ఫ్లోర్ మీద ఉండే మొండి నల్లటి మచ్చలను పోగొట్టడానికి మెలామైన్ స్పంజ్ లేదా ఇరేజర్ స్పంజ్ వాడొచ్చు. ఇది ఫ్లోర్‌కి అతుక్కుపోయిన రబ్బరు గుర్తులను, మురికిని ఇది సులభంగా తొలగిస్తుంది. ముందుగా ఈ స్పంజ్ని కొద్దిగా తడిపి, మచ్చ ఉన్న చోట మెల్లగా రుద్దాలి. ఆ తర్వాత క్లీన్ క్లాత్ తో ఆ ప్రాంతాన్ని తుడవాలి. అయితే ఫ్లోర్ డ్యామేజ్ కాకుండా, ఎక్కువ గట్టిగా రుద్దకుండా జాగ్రత్తపడాలి.
క్లీన్ షూస్ సహాయం: ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ, బూట్ల గుర్తులను వదిలించడానికి మరో శుభ్రమైన బూటును కూడా వాడొచ్చు. ఇందుకోసం లైట్ కలర్, క్లీన్ రబ్బరు సోల్ ఉన్న షూ మడమ భాగంతో మచ్చ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. దీనివల్ల ఫ్లోర్‌పై ఉన్న నల్లటి మార్క్ చాలా వరకు తగ్గిపోతుంది. అయితే మరీ మురికిగా ఉన్న లేదా డార్క్ కలర్ సోల్ ఉన్న షూస్‌ని అస్సలు వాడొద్దు, లేదంటే ఫ్లోర్ మీద కొత్త మచ్చలు పడతాయి.
సాధారణ రబ్బరు ఇరేజర్: పిల్లలు పెన్సిల్ రాతలు చెరిపే రబ్బరు, ఫ్లోర్ మీద పడిన రబ్బరు మచ్చలను కూడా తొలగించగలదు. ముందుగా ఒక శుభ్రమైన తడి గుడ్డతో మచ్చ ఉన్న భాగాన్ని తుడవాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న ఆ ప్రదేశంలో రబ్బరు ఇరేజర్తో నెమ్మదిగా రబ్ చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా నల్లటి మచ్చలు మాయమవుతాయి. క్లీనింగ్ పూర్తయ్యాక రబ్బరు తుక్కును గుడ్డతో ఊడ్చేయాలి. ఒకవేళ చెక్కతో చేసిన ఫ్లోర్ లేదా సున్నితమైన ఉపరితలాలు అయితే, ఎక్కడైనా కనిపించని చిన్న మూలన దీన్ని ట్రై చేసి చూడడం మంచిది.
బేకింగ్ సోడా మ్యాజిక్: నల్లటి మచ్చలు చాలా పాతవి, మొండిగా ఉంటే బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని మచ్చ ఉన్న చోట రాసి, మెత్తటి గుడ్డతో సున్నితంగా రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత తడి గుడ్డతో ఆ పేస్ట్ తుడిచేసి, చివరగా పొడి గుడ్డతో ఫ్లోర్‌ని క్లీన్ చేయాలి. బేకింగ్ సోడా కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి, షైనింగ్ లేదా పాలిష్ చేసిన ఫ్లోర్స్ మీద ముందుగా టెస్ట్ చేసుకున్న తర్వాతే వాడాలి.
ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి: చాలా మంది నల్లటి మచ్చలు పోవడానికి వెనిగర్, నీళ్ల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. కానీ ఇది అన్ని రకాల ఫ్లోర్స్‌కి సేఫ్ కాదు. ముఖ్యంగా మార్బుల్, సహజ రాళ్ళు, కొన్ని రకాల వుడెన్ ఫ్లోర్స్ దీనివల్ల పాడైపోతాయి. కాబట్టి ఫ్లోర్ ఏ రకమైనదో తెలియకుండా దీన్ని వాడకండి. ఎలాంటి కొత్త క్లీనర్ లేదా చిట్కా అయినా సరే ఫ్లోర్ మీద ట్రై చేసే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.

