Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్‌లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!

  • విజిల్ రాకముందే ఆవిరి లీకవుతోందా?
  • దెబ్బతిన్న రబ్బరు రింగ్‌తో ప్రమాదం
  • వెంట్ పైపు బ్లాక్ అయితే అంతే సంగతులు
  • కుక్కర్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Pressure Cooker

Pressure Cooker

నేటి ఆధునిక వంటగదులలో ప్రెషర్ కుక్కర్ అనేది ప్రతి ఇంట్లోనూ లేనిదే నడవని ముఖ్యమైన వంటగది పరికరంగా మారింది. పప్పులు, అన్నం, కూరగాయలు వంటి రకరకాల వంటకాలను అతి తక్కువ సమయంలో ఉడికించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణ పాత్రలతో పోలిస్తే ప్రెషర్ కుక్కర్ అధిక ఆవిరి పీడనంతో సుమారు 70 శాతం వేగంగా ఆహారాన్ని ఉడికిస్తుంది. దీనివల్ల గ్యాస్ లేదా విద్యుత్ ఆదా కావడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. అయితే, ఈ సౌకర్యవంతమైన కుక్కర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్నిసార్లు కుక్కర్ విజిల్ రాకముందే మూత అంచుల నుండి ఆవిరి బయటకు రావడం గమనిస్తుంటాం. దీనికి ప్రధాన కారణం కుక్కర్ రబ్బరు రింగ్ లేదా గాస్కెట్ దెబ్బతినడమే. గాస్కెట్ అనేది రబ్బరు లేదా సిలికాన్‌తో తయారైన గుండ్రని రింగ్. ఇది మూతకు, బాడీకి మధ్య ఎలాంటి ఖాళీ లేకుండా గట్టిగా బిగుసుకుని గాలి బయటకుపోకుండా చూస్తుంది. ఒకవేళ ఈ రబ్బరు అరిగిపోయినా, పగిలినా లేదా వదులుగా మారినా అంచుల నుండి ఆవిరి లీకై ఆహారం సరిగ్గా ఉడకదు. ఇలాంటి సమయంలో వెంటనే దాన్ని మార్చడం మంచిది. అలాగే కుక్కర్ మూత సరిగ్గా లాక్ కాకపోయినా లేదా మూత అంచులకు పప్పు, బియ్యం వంటి పదార్థాలు అంటుకుపోయినా ఈ సమస్య వస్తుంది.

కుక్కర్ విజిల్ అడుగు భాగంలో ఉండే వెంట్ పైపు ద్వారానే అదనపు ఆవిరి బయటకు వెళ్తుంది. ఈ పైపులో ఆహార కణాలు లేదా ధాన్యాలు ఇరుక్కుపోతే ఆవిరి బయటకు వెళ్లే మార్గం మూసుకుపోతుంది. కాబట్టి కుక్కర్‌ను శుభ్రం చేసే ప్రతిసారీ వెంట్ పైపును కూడా ఒక పిన్ను లేదా పుల్లతో శుభ్రం చేయాలి. ఒకవేళ కుక్కర్ నుండి నిరంతరం ఆవిరి వస్తూనే ఉంటే దానిని వాడటం ఆపివేయాలి. గ్యాస్ ఆఫ్ చేసి, కుక్కర్ పూర్తిగా చల్లబడే వరకు, పీడనం పూర్తిగా తగ్గిపోయే వరకు వేచి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేడిగా ఉన్నప్పుడు విజిల్ లేదా మూతను బలవంతంగా తీయడానికి ప్రయత్నించకూడదు.

కుక్కర్ సామర్థ్యంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఎప్పుడూ ఆహారాన్ని లేదా నీటిని నింపకూడదు. వంట ప్రారంభించినప్పుడు మంట ఎక్కువగా ఉంచినప్పటికీ, ప్రెషర్ పెరిగిన వెంటనే మంటను తగ్గించాలి. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడంతో పాటు ఆహారం సమంగా ఉడుకుతుంది. మూత సరిగ్గా సరిపోకపోతే బలవంతంగా లాక్ చేయడానికి ప్రయత్నించకుండా అంచులను, గాస్కెట్ పొజిషన్‌ను పరిశీలించాలి. నాణ్యమైన , సరైన మోడల్ విడిభాగాలను మాత్రమే ఉపయోగించడం ద్వారా వంటగదిలో సురక్షితమైన వాతావరణాన్ని కాపాడుకోవచ్చు.