Money Plant Care: ఇంట్లో కాస్త మొక్కలు పెంచే అలవాటు ఉన్న వాళ్లెవరి ఇళ్లలో చూసినా మనీ ప్లాంట్ కచ్చితంగా కనిపిస్తుంది. చూడటానికి పచ్చగా కళకళలాడుతూ ఉండటమే కాకుండా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుందని అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. దీనికి పెద్దగా శ్రమ కూడా ఉండదు, ఇట్టే పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఎంత బాగా చూసుకున్నా అకస్మాత్తుగా మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారడం, ముడతలు పడడం లేదా మచ్చలు రావడం జరుగుతుంటుంది. ఆకులు అలా మారడం చూసి చాలా మంది మొక్క పాడైపోతుందని కంగారుపడిపోతుంటారు. కొందరైతే ఇక ఇది బతకదని వదిలేస్తుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, మొక్క ఎండిపోయే ముందే ఆకులే మనకు ముందస్తు సంకేతాలు ఇస్తాయి. మనీ ప్లాంట్ ఆకుల రంగు, ఆకారం, వాటి తీరును బట్టి దాని ఆరోగ్యం ఎలా ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు. కొన్నిసార్లు నీళ్లు తక్కువైతే ఆకులు పాడవుతాయి, మరికొన్నిసార్లు ఎక్కువ నీళ్లు పోయడం వల్ల లేదా ఎండ తగలడం వల్ల ఇబ్బంది పడుతుంటాయి. అందుకే మొక్కను కాపాడుకోవడానికి దాని ఆకులు చెప్పే ఈ ఆరు ముఖ్యమైన సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్ ఆకుల అంచులు గట్టిగా మారి, బ్రౌన్ కలర్లోకి వచ్చి ముడతలు పడుతున్నాయంటే, ఆ మొక్కకు నీళ్లు కావాలని అర్థం. మట్టిలో తడి ఆరిపోయిందని, వెంటనే నీళ్లు పోయాలని అది చెబుతోంది. కాకపోతే కుండీలో నీళ్లు నిలిచిపోకుండా చూసుకోవాలి, కేవలం మట్టిని తడిగా ఉంచితే చాలు.
ఒకవేళ ఆకుల మీద పెద్దగా, కాలిపోయినట్టుగా బ్రౌన్ కలర్ మచ్చలు కనిపిస్తే, ఎండ వల్ల ఆ మొక్కకు ‘సన్‌బర్న్’ అయిందని అర్థం చేసుకోవాలి. ఆ మొక్కకు ఎండ తగలకుండా నీడ పట్టున ఉండే చోటు కావాలని అది కోరుకుంటోంది. మనీ ప్లాంట్‌ను నేరుగా పడే కఠినమైన ఎండలో కాకుండా, కాస్త నీడగా వెలుతురు వచ్చే చోట పెట్టాలి. మనీ ప్లాంట్ ఆకులు తమ ముదురు ఆకుపచ్చ రంగును కోల్పోయి, కళ తప్పి తెల్లగా లేదా తేలికపాటి రంగులోకి మారుతున్నాయంటే, దానికి సరిపడా వెలుతురు అందట్లేదని అర్థం. ఎక్కువ చీకటిగా ఉండే మూలల్లో పెడితే మొక్కలో క్లోరోఫిల్ తయారీ తగ్గిపోతుంది. అందుకే మంచిగా వెలుతురు తగిలే ప్రదేశానికి దీన్ని మార్చాలి. ఎక్కువ ప్రేమతో చాలా మంది మొక్కకు అవసరానికి మించి నీళ్లు పోస్తుంటారు. ఒకవేళ ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారుతున్నా లేదా కుళ్ళిపోతున్నట్టు అనిపించినా, దానికి నీళ్లు తగ్గించమని అర్థం. ఎక్కువ నీళ్లు పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. కుండీ పైమట్టి పూర్తిగా ఆరిపోయే వరకు మళ్లీ నీళ్లు పోయకూడదు.
ఆకుల మీద పసుపు రంగు వలయాలతో పాటు బ్రౌన్ లేదా నల్లటి మచ్చలు వస్తున్నాయంటే, మనీ ప్లాంట్‌కు ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని గ్రహించాలి. తేమ ఎక్కువైనా లేదా ఆకుల మీద నీళ్లు నిలిచిపోయినా ఇలాంటి ఫంగస్ వస్తుంది. అలాంటి పాడైన ఆకులను వెంటనే కత్తిరించి తీసేయాలి. ఆ తర్వాత ఆ మొక్కపై వేప నూనె (నీమ్ ఆయిల్) లేదా యాంటీ ఫంగల్ స్ప్రే చేయాలి. మనీ ప్లాంట్ ఆకుల మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు పడడం లేదా అంచులు కొరికినట్టుగా కనిపిస్తే, మీ మొక్కపై పురుగుల దాడి జరిగిందని అర్థం. దీనికోసం ఆకులను శుభ్రమైన నీటితో కడిగి, ఏదైనా ఆర్గానిక్ క్రిమిసంహారక మందును వాడితే మొక్కను కీటకాల నుంచి సులభంగా కాపాడుకోవచ్చు. మొక్కను కాపాడుకోవడానికి దాని మూగ భాషను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్ ఆకులు కేవలం అందాన్ని ఇవ్వడమే కాదు, ఆ మొక్క ఆరోగ్యం ఎలా ఉందో మనకు ముందే చెబుతాయి. కాబట్టి ఆకుల రంగు మారగానే కంగారు పడకుండా, దానికి నీళ్లు, వెలుతురు లేదా ఎలాంటి సంరక్షణ కావాలనేది ముందుగా గమనించాలి. ఈ చిన్న చిన్న సంకేతాలను సమయానికి గుర్తిస్తే మొక్క పాడైపోకుండా కాపాడుకోవచ్చు, మీ మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది.

