Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!

  • కాలుష్యం ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఆటపాటలు
  • కుషన్లు, టేప్‌తో సరదాగా కదలికలు
  • బెలూన్లు, బొమ్మలతో పిల్లలకు వినోదం
  • ఆటలతో పాటు భద్రతపైనా తల్లిదండ్రుల దృష్టి
Games

Games

వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో చిన్నపిల్లలను బయటకు తీసుకెళ్లాలా వద్దా అనే సందేహం చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతుంది. ముఖ్యంగా పసిపిల్లలు, టాడ్లర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బయట గాలి నాణ్యత బాగాలేకపోతే పిల్లలను ఇంట్లోనే ఉంచడం మంచిది. అయితే రోజంతా ఇంట్లోనే ఉంటే పిల్లల్లోని ఉత్సాహం, అల్లరి, ఆటపాటలన్నీ ఎలా? టీవీ, మొబైల్‌తో ఎంతసేపని కాలక్షేపం చేయిస్తారు? ఇలాంటి సమయాల్లో పిల్లలను సరదాగా, చురుగ్గా ఉంచేందుకు ఇంట్లోనే కొన్ని సులభమైన ఆటలను పరిచయం చేయవచ్చు. ఎక్కువగా పరుగులు పెట్టకుండా, శ్వాసపై అధిక ఒత్తిడి పడకుండా ఆడుకునే ఈ ఆటలు పిల్లలకు వినోదంతో పాటు శరీర కదలికను కూడా అందిస్తాయి.

కుషన్ ఐలాండ్.. ఒక దీవి నుంచి మరో దీవికి

ఇంట్లో ఉండే మెత్తటి దిండ్లు, కుషన్లు, చిన్న రగ్గులను నేలపై కొంత దూరంలో ఏర్పాటు చేయాలి. వాటిని చిన్న చిన్న దీవులుగా ఊహించుకుని, ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకోవాలని పిల్లలకు చెప్పాలి. మధ్యలో ఉన్న నేలపై అడుగు పెట్టకూడదనే చిన్న నియమం ఆటను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. పిల్లలు కుషన్లపై నెమ్మదిగా అడుగులు వేస్తూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు కదులుతారు. అయితే కుషన్లు జారకుండా చూసుకోవాలి. ఎత్తైన సోఫాలు, కుర్చీలు, అస్థిరమైన వస్తువులను దీవులుగా ఉపయోగించకూడదు. చిన్నపిల్లలు కాబట్టి పెద్దలు దగ్గరుండి పర్యవేక్షించడం తప్పనిసరి.

టేప్‌తో హాప్‌స్కాచ్.. ఇంట్లోనే ఆటల సందడి

నేలపై సులభంగా తొలగించగల పెయింటర్ టేప్‌తో చిన్న చిన్న గడులు గీయవచ్చు. వాటిలో నడవడం, ఒక గడి నుంచి మరో గడికి నెమ్మదిగా అడుగులు వేయడం వంటి ఆటలు ఆడించవచ్చు. పిల్లల వయసును బట్టి ఆటను మార్చుకోవచ్చు. చిన్నారులకు దూకాల్సిన అవసరం లేకుండా ఒక్కో గడిలో అడుగు పెట్టడం, గడుల్లో ఉన్న సంఖ్యలను గుర్తించడం వంటి సరదా టాస్కులు ఇవ్వొచ్చు. దీంతో పిల్లలకు శరీర కదలికతో పాటు సంఖ్యల పరిచయం కూడా కలుగుతుంది. నేల జారేలా లేకుండా చూసుకోవాలి. టేప్ సరిగ్గా అంటుకుందా లేదా ముందే పరిశీలించాలి.

జంతువుల్లా నటించడం.. క్రేజీ గేమ్

పిల్లలకు జంతువుల పేర్లు చెబుతూ, వాటిలా కదలాలని చెప్పడం మరో మంచి ఆట. బాతులా నడవడం, ఎలుగుబంటిలా నెమ్మదిగా పాకడం, ఫ్లెమింగోలా కొద్దిసేపు ఒక కాలిపై నిలబడే ప్రయత్నం చేయడం వంటి సరదా యాక్టివిటీస్ చేయించవచ్చు. చిన్నపిల్లలకు జంతువుల పేర్లు తెలియకపోతే వాటి బొమ్మలు లేదా ఫొటోలు చూపించవచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి నటిస్తే ఆట మరింత సందడిగా మారుతుంది. అయితే ఎక్కువసేపు ఒకే కాలిపై నిలబడటం, వేగంగా కదలడం వంటి వాటిని బలవంతం చేయకూడదు.

బెలూన్ వాలీబాల్.. పరుగులు లేకుండానే ఆట

ఒక సాధారణ బెలూన్‌తోనే పిల్లలను కొంతసేపు సరదాగా ఆడించవచ్చు. బెలూన్‌ను గాల్లోకి మెల్లగా వదిలి, అది నేలకు పడకుండా చేతులతో తాకేలా ఆట ఆడించాలి. బెలూన్ నెమ్మదిగా కిందికి రావడంతో పిల్లలు దాని కదలికను కళ్లతో గమనిస్తూ, చేతులు చాపుతూ ఆడుకోవచ్చు. ఎక్కువగా పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే పగిలిన బెలూన్ ముక్కలు చిన్నపిల్లలకు ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం కలిగిస్తాయి. అందుకే పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఆడించాలి. బెలూన్ ముక్కలను వెంటనే తొలగించాలి. నోటితో బెలూన్ ఊదడం కూడా పిల్లలకు ఇవ్వకూడదు.

పిక్చర్ హంట్.. బొమ్మలతో వెతుకులాట

చిన్నపిల్లలకు రాతపూర్వక క్లూల కంటే బొమ్మలతో ఆటలు మరింత సులభంగా అర్థమవుతాయి. ఇంట్లోని సురక్షితమైన ప్రదేశాల్లో కొన్ని బొమ్మలు లేదా వస్తువులను దాచిపెట్టి, వాటికి సంబంధించిన చిత్రాలను చూపిస్తూ వెతకమని చెప్పవచ్చు. ఉదాహరణకు టెడ్డీ బేర్ బొమ్మ ఫొటో చూపిస్తే ఆ బొమ్మను వెతకాలి. రంగులు, ఆకారాలు, బొమ్మల పేర్లు పరిచయం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వస్తువులను అందుబాటులో ఉండే ప్రదేశాల్లోనే దాచాలి. చిన్న వస్తువులు, నాణేలు, బ్యాటరీలు వంటి వాటిని దాచడం మాత్రం ప్రమాదకరం.

కార్డ్‌బోర్డ్ బాక్స్‌తో టార్గెట్ గేమ్

ఇంట్లో ఖాళీగా ఉన్న పెద్ద కార్డ్‌బోర్డ్ బాక్స్‌తో ఒక చిన్న టార్గెట్ గేమ్ తయారు చేయవచ్చు. బాక్స్ ముందు భాగంలో పెద్ద పెద్ద లక్ష్య గడులు ఏర్పాటు చేసి, వాటికి సంఖ్యలు లేదా రంగులు గుర్తుగా పెట్టొచ్చు. పిల్లలు మృదువైన పెద్ద బంతులను లక్ష్యాల వైపు నెమ్మదిగా రోల్ చేయాలి. బంతి ఏ గడిలోకి వెళ్లిందో చెప్పిస్తూ ఆటను కొనసాగించవచ్చు. చిన్న వస్తువులకు బదులుగా తగిన పరిమాణంలో ఉండే సురక్షితమైన ఆట వస్తువులను ఎంచుకోవాలి. బాక్స్‌కు పదునైన అంచులు లేకుండా చూసుకోవాలి.

బాక్స్ టన్నెల్.. ఇంట్లోనే చిన్న అడ్వెంచర్

పెద్ద కార్డ్‌బోర్డ్ బాక్సులను ఉపయోగించి నేలపై చిన్న టన్నెల్‌లా ఏర్పాటు చేయవచ్చు. పిల్లలు దాని గుండా నెమ్మదిగా పాకుతూ మరోవైపు చేరుకోవాలి. టన్నెల్ చివర్లో వారికి ఇష్టమైన బొమ్మను ఉంచితే ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అయితే బాక్సులు కూలిపోకుండా, గాలి ఆడేలా, తగినంత విశాలంగా ఉండేలా ఏర్పాటు చేయాలి. పిల్లల తల ఇరుక్కుపోయేలా చిన్న దారులు చేయకూడదు. ఫ్లాష్‌లైట్లతో వెలుగులు చూపించాలనుకుంటే పెద్దలే వాటిని నిర్వహించాలి. కొవ్వొత్తులు లేదా వేడెక్కే లైట్లు ఉపయోగించకూడదు.

వాయు కాలుష్యం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బయట వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలను ఇంట్లోనే ఉంచడం కాలుష్యానికి గురయ్యే అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇంట్లో ఉన్నంత మాత్రాన గాలి పూర్తిగా స్వచ్ఛంగా ఉంటుందని భావించకూడదు. బయట గాలి నాణ్యతను బట్టి కిటికీలు తెరవాలా, మూసి ఉంచాలా నిర్ణయించుకోవాలి. సాధ్యమైతే సరైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించవచ్చు. ఇంట్లో పొగ, ధూపం, అగరబత్తులు, వంట పొగ వంటి వాటిని తగ్గించడం మంచిది.

పిల్లలు ఆడుతున్నప్పుడు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురకలాంటి శ్వాస శబ్దం లేదా ఇతర అసౌకర్యాలు కనిపిస్తే వెంటనే ఆట ఆపాలి. ముఖ్యంగా ఆస్తమా ఉన్న చిన్నారుల విషయంలో వైద్యుల సూచనలను పాటించాలి. ఇంట్లో ఆడే ఆటలు కూడా పిల్లల వయసు, సామర్థ్యానికి తగ్గట్టుగా ఉండాలి. ఎక్కువగా అలసిపోయేలా చేయడం కంటే, మధ్యమధ్యలో విశ్రాంతి ఇస్తూ సరదాగా ఆడించడం మంచిది.

మొత్తానికి, బయట గాలి నాణ్యత సరిగా లేని రోజుల్లో పిల్లలను ఇంట్లోనే ఉంచాల్సి వచ్చినా వారి ఆటపాటలకు బ్రేక్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే కొత్త ఆటలు పరిచయం చేస్తే పిల్లలు ఉత్సాహంగా గడపడంతో పాటు తల్లిదండ్రులతో మంచి సమయాన్ని ఆస్వాదించవచ్చు.