Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

Refrigerator Cleaning Tips

Refrigerator Cleaning Tips

Refrigerator Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిజ్ నుండి వచ్చే దుర్వాసన చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఫ్రిజ్ తలుపు తెరిచినప్పుడల్లా వచ్చే వింత వాసన వల్ల అసౌకర్యంగా అనిపించడమే కాకుండా, అతిథుల ముందు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా పాడైపోయిన ఆహారం, ఒలికిపోయిన ద్రవాలు లేదా ఫ్రిజ్‌ను తరచుగా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటిస్తే, ఎలాంటి రసాయనాలు లేకుండా మీ ఫ్రిజ్‌ను శుభ్రంగా, తాజాగా ఉంచుకోవచ్చు.

మీ ఫ్రిజ్‌ తాజాగా ఉండాలంటే ఏం చేయాలి..
* ముందుగా ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేయాలి. అందులో ఉన్న ఆహార పదార్థాలు, పానీయాలను బయటకు తీసి, పాడైపోయినవి లేదా గడువు ముగిసినవి ఉంటే వెంటనే తీసేయాలి.. ఇవే ఎక్కువగా దుర్వాసనకు కారణమవుతాయి. ఆ తరువాత ఫ్రిజ్ ప్లగ్ తీసి, అరలు మరియు డ్రాయర్‌లను తొలగించాలి, తద్వారా ప్రతి మూలను సులభంగా శుభ్రం చేయవచ్చు.

* ఫ్రిజ్‌ను లోతుగా శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం వంటి సాధారణ పదార్థాలు సరిపోతాయి. ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి ద్రావణం తయారు చేయాలి. ఈ ద్రావణంతో ఫ్రిజ్ లోపలి గోడలు, అరలు, తలుపులను శుభ్రం చేస్తే దుర్వాసన తొలగిపోవడమే కాకుండా మరకలు కూడా సులభంగా పోతాయి.

* ఎక్కడైనా గట్టిగా మురికి లేదా జిగటగా ఉన్న ప్రదేశాలు ఉంటే, అక్కడ వెనిగర్ చల్లి శుభ్రం చేయాలి. వెనిగర్ సహజ క్రిమిసంహారకంగా పనిచేసి బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ముఖ్యంగా మూలలు, రబ్బరు సీల్స్ వంటి ప్రాంతాలను జాగ్రత్తగా శుభ్రం చేయాలి, ఎందుకంటే అక్కడే ఎక్కువగా మురికి పేరుకుపోతుంది.

* శుభ్రపరిచిన తర్వాత ఫ్రిజ్‌లో తేమ ఉండకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడవాలి. అనంతరం సగానికి కోసిన నిమ్మకాయను లేదా చిన్న గిన్నెలో బేకింగ్ సోడాను ఫ్రిజ్‌లో ఉంచితే, అది దుర్వాసనను పీల్చుకుని ఫ్రిజ్‌ను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుతుంది.

* అదేవిధంగా కొన్ని మంచి అలవాట్లు పాటించడం కూడా చాలా ముఖ్యం. ఆహారాన్ని ఎప్పుడూ మూతపెట్టి ఉంచడం, ఏదైనా ద్రవం ఒలికితే వెంటనే శుభ్రం చేయడం, వారానికి ఒకసారి తేలికపాటి శుభ్రత చేయడం వంటి అలవాట్లు ఫ్రిజ్‌ను ఎప్పుడూ శుభ్రంగా, వాసన రాకుండా ఉంచుతాయి. ఈ సులభ చిట్కాలతో మీ ఫ్రిజ్ ఎల్లప్పుడూ తాజాగా మెరిసిపోతుంది అంతే..