Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..

Cauliflower Without Worms

Cauliflower Without Worms

Cauliflower Quality Test: చలికాలం వచ్చిందంటే చాలు, మార్కెట్ నిండా తెల్లటి క్యాలీఫ్లవర్లు కళకళలాడుతుంటాయి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, మార్కెట్లో గోభీ కొనేటప్పుడు అందరినీ వేధించే పెద్ద సమస్య ఏంటంటే, దానిలోపల దాక్కుని ఉండే పురుగులు. పైకి ఎంత చూడముచ్చటగా, తెల్లగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు క్యాలీఫ్లవర్లు లోపల చిన్న పురుగులు ఉంటాయి. దీనివల్ల మన డబ్బు వృథా కావడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. మార్కెట్లో మోసపోకుండా నాణ్యమైన, పురుగులు లేని క్యాలీఫ్లవర్‌ను దాన్ని కట్ చేయకుండానే ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మనం కొనే క్యాలీఫ్లవర్లు తాజాగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి దాని పువ్వుల గట్టితనాన్ని గమనించాలి. పువ్వులు ఒకదానితో ఒకటి గట్టిగా అతుక్కుని ఉండాలి. ఒకవేళ పువ్వుల మధ్యలో ఖాళీలు ఎక్కువగా ఉండి విడిపోయినట్లు కనిపిస్తే అలాంటి వాటిని అసలు కొనకండి. ఎందుకంటే ఇలాంటి వదులుగా ఉండే గోభీ లోపలే పురుగులు, మురికి సులభంగా దాక్కుంటాయి. అలాగే, గోభీ కింద ఉండే ఆకులు దాని ఫ్రెష్ నెస్ ని బయటపెడతాయి. ఆకులు పచ్చగా, గట్టిగా, తాజాగా ఉంటే ఆ గోభీ ఫ్రెష్ గా ఉన్నట్లే. ఒకవేళ ఆకులు ఎండిపోయినా, పసుపు రంగులోకి మారినా, వాడిపోయినా అవి పాత గోభీ అని అర్థం చేసుకోవాలి. అలాంటి వాటిలో పురుగులు ఉండే అవకాశం చాలా ఎక్కువ.

గోభీ రంగును కూడా పరిశీలించాలి. మంచి క్యాలీఫ్లవర్ లేత క్రీమ్ రంగులో లేదా పూర్తిగా తెలుపు రంగులో ఉండాలి. ఒకవేళ గోభీ మీద నల్లటి, గోధుమ రంగు లేదా పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అస్సలు కొనకండి. ఇది గోభీకి ఫంగస్ పట్టిందని లేదా పురుగులు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం. అలాగే, గోభీ పువ్వులను నిశితంగా పరిశీలించాలి. దాని పైభాగంలో లేదా కాడపై చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయా లేదా అని చూడండి. ఒకవేళ గోధుమ రంగులో ఉండే చిన్న పొడి లాంటి పదార్థం (పురుగుల వ్యర్థాలు) కనిపిస్తే, దాని లోపల పురుగులు ఉన్నాయని ఇట్టే పసిగట్టవచ్చు. అదేవిధంగా, క్యాలీఫ్లవర్లు బరువును బట్టి కూడా దాని నాణ్యతను అంచనా వేయవచ్చు. సైజులో పెద్దగా ఉండి, చేతికి వెయిట్ లేకుండా తేలికగా ఉంటే ఆ గోభీ లోపల ఖాళీగా ఉండడమో లేదా పురుగులు తినేయడమో జరిగిందని అర్థం. కాబట్టి దాని పరిమాణానికి తగినట్లుగా బరువున్న గోభీని ఎంచుకోవాలి. ముఖ్యంగా గోభీ కింది కాడ గట్టిగా, ఎలాంటి పగుళ్లు లేకుండా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఇకపై మార్కెట్లో ఎప్పుడూ మోసపోకుండా చక్కటి, పురుగులు లేని మంచి క్యాలీఫ్లవర్ ను సులభంగా ఇంటికి తెచ్చుకోవచ్చు.